Thursday, October 1, 2009

తోటకు రా!!

గార్డెన్ టు కం!! అనగా తోటకు రా!!!

ఈ మద్దెన మనకి పాపులారిటీ పెరిగిపొయ్యి, కొందరు, డవిరెక్టుగా అడిగేస్తున్నారు, అదెట్టా సెయ్యాల ఇదెట్టా సెయ్యాల అని [చందా :):)].
ఆరోగ్యనికి మంచి కూరలు ఎట్టా సేస్కోవాల? ఏవితినాల? ఏంజెయ్యాల? ఇట్టాంటివి సానా పెస్నలు లెగుత్తా ఉంటాయ్ సేనా మందికి.
అట్టాంటోళ్ళకోసం ఓ మంచి వంటకం తోటకూర కూర.
మాంచి లేత తోటకూరతో పప్పు కెవ్వు కేక. అట్టానే కూరగూడా...కెవ్వుకేక!!
ఎట్టాచేస్తారో ఏంకదో సూద్దాం తోటకిపదహే.
మార్కెట్టుకెళ్ళి
ఓ పెద్ద కట్ట తోటకూర
నాలుగు మిర్చి
ఓ గుప్పెడు పచ్చిశనగపప్పు
తాలింపు గింజలు
ఓ చెంచా నూనె
ఓ ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు బొబ్బలు నూక్కొచ్చుకో.

ఓ బక్కెట్టు నీళ్ళు తెచ్చుకో తోటకూరని దాంట్లో వెయ్యి. ముంచు లేపు, ముంచు లేపు, ముంచు లేపు. అట్టా ఓక్కో ఆకు సుబ్బనంగా కడుక్కో. దేనికీ? పెస్నలొద్దు పనిజూడు. ఎందుకంటే, తోటకూర పండిచే రైతులు నీళ్ళుపెడతారా తోటకూర సేనుకి, ఇసుక మొక్కని[చెట్టుని - ఇక్కడ కొందరు అనొచ్చు తోటకూర మొక్క కదా మా ఊళ్ళో అట్టానే అంటాం, చెట్టు వృక్షం కాదు భాయ్ అని - పిల్లాట] పట్టుకుని వదల్దు. సరిగ్గా కడుక్కోకపోతే కూర తినేప్పుడు కసకస లాడుద్ది.

సుబ్బనంగా కడుక్కున్నాక, కట్ట కట్ట అట్టానే కటింగు బల్లమీనపెట్టి ఓ మోస్తరి సైజుకి నరికేసేయ్.

ఇప్పుడు, ఓ భాండీ తీస్కో
పొయ్యిమీన పెట్టు, ఆరెండు సెంచాల నూనె ఏసేయ్
ఏడికాంగనే తాలింపు గింజలు ఏసేయ్. పచ్చిశనగపప్పు ఎక్కువ ఎసేయ్.
ఏగంగనే ఎల్లుల్లి రెబ్బల్ని అరసేత్తో కుక్కి, తొక్కపీకి ఏసేయ్. మిరగాయల్ని నాలుగుముక్కలుగా నరికేసి ఎసేయ్ దాంట్లో..
సిటపటలాడంగనే, తరుక్కున్న తోటకూర కుమ్ము. సెగ కొంచెం తగ్గించి మూతపెట్టు...
పుసుక్కున ఉడికిపోద్ది నాయాల్ది. ఉప్పు తగిలించి లాగించు. కారం సాలకపోతే ఓ మిరగాయ పక్కనెట్టుకుని లాగించవో...

రెట్టెల్లోకి బాగుండిద్ది, వన్నంలోకీ బాగుండిద్ది, దేనికైనా బాగుండిద్ది. వారోగ్యానికి వారోగ్యం..