Monday, June 8, 2009

గోంగోర రోటి పచ్చడి.

మొత్తానికి మా దేశీ కొట్టోడు గోంగోర మహా వృక్షాలని తెచ్చాడు మొన్న. సూడంగనే పాణం గిలగిల్లాడి, ఓ నాలుగు డాలర్లు పోతే పోనీ దీనెక్క గోంగోర తిన్ని బతుకెందుకు అనేసి, ఓ నాలుగు వృక్షాలను లారీకేసి తోలకొచ్చా. ఆదివారం, కుంపటెట్టి గోంగోర పప్పు తవండుకోవాలని ముందు ప్రణాళికేస్కున్నా, సమయాభావం పిల్లల డిమ్యాండ్ల వల్ల పప్పుగిన్నె కుంపట్లోంచి మామూలు పొయ్యిమీదకి మారింది. పప్పులో ఎయ్యంగా మరో రెండు వృక్షాలు మిగిల్నై. ఏటిసేయ్యాల్రా బగమంతుడా అంది మావిడ పిల్లని సంకనేస్కుని. వెనువెంటనే, పచ్చడి నూరూ అని నోట్ళోంచి, మన ప్రమేయంలేకుండా జాలువార్చింది నాలుక ఇంత నీళ్ళు నోట్లో ఊర్చుకుంటూ. అటులనే మాహారాజా అనేసి ఆ ప్రాణి రోలు కడగటం మొదలెట్టింది (రోలు అనగా గ్రైండరు)
ఇంతక మునుపు జరిగిన గోగుల యుద్ధంలో నే చెప్పినట్టుగా, గోంగోరతో పచ్చళ్ళు రకరకాలు.
సరే గోంగోరతో చేసే ఈ పచ్చడికి కావాల్సింది, నేను తెచ్చినట్టుగా గోంగోర మహా వృక్షాలు కాదు. ఏక్ దం ఫ్రెష్, నవనవ లాడే గోంగోర మరియూ, అప్పటికప్పుడు కోస్కొచ్చిన పచ్చిమిరగాయలు. ఓర్నీఇంట వాన కురవా, యాడ దొరకతన్నాయ్ ఇయ్యాల్రేపు "ప్రెష్" సరుకు అని అనుకోవచ్చు అందరూ, అబ్బా చోద్యం అనుకోనూ వచ్చు. అలాంటి ఆకుతో మిరగాయల్తో సేత్తే ఆ రుచే ఏరు అని నా అర్ధం.
సరే, ఓ కట్ట గోంగోర, ఓ అరడజను మిర్చి, రెండు ఎండు మిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, అరచెంచా మెంతులు, తిరగమాత సామాన్లు, ఓ చెంచా నూనె.
ముందుగా గోంగూర. మిరగాయలు ఉడకబెట్టి పక్కనెట్టుకోవల. అయినాక,
భాండీ ఎట్టి తిరగమాత ఏసేసి, దాంట్లోనే మెంతులేసేసి, చిట్పట్ అన్నాక ఎల్లుల్లి ఏసేసి ఏపాల. అయినాక ఆ ఉడకబెట్టిన గోంగోర, మిరగాయల్ని ఇందలో ఏసేసి ఓ సారి ఏయించి (నీళ్ళు ఉంటే అయి ఇంకిపోయిందాక పొయ్యిమీనే ఉంచాల), ఉప్పు ఏసేసి, రోట్లో ఏసుడు, నూరుడు. అంతమెత్తగా ఉండాల్సినపన్లా. కచ్చాపచ్చీగా ఉండా పర్లా.

దీనికి కీ - మిర్చీ, గోంగోర ఆటి వాసన్ని కోల్పోకుండా చూడాల. కాబట్టి మోడరేట్ గా వేయించుకోండా.
ఈ పచ్చడి ఎక్కువకాలం ఉండదు. కేవలం రెండు మూడ్రోజులు మాత్రమే.

ఇక దీంట్లో ఎన్ని కేలరీలు ఉంటాయో నాకు పెద్ద తెలియదు. కానీ బలమైన ఆహారమే. కారణం దీంట్లో కేవలం ఒక స్పూను నూనె, రుచుకి ఉప్పు, మిగతావి ఆరోగ్యకరమైనవే. గోంగోరలో ఇనుము అధికశాతం ఉంటుంది.

నేను ఈ రోజు రాగిజావలో దీన్నేస్కుని ఓ కుమ్ముడు కుమ్మాను.
మీరూ ఆనందించండి.

[సర్లే బాసూ అంతా బాగనే ఉంది, మరీ ఏంది అంత కొంచెం అయ్యింది పచ్చడీ అనుకుంటున్నారా? రుసి సూద్దాం అని నోట్టో ఏస్కున్నామయ్యా, ఏందంట, సగం అయిపోయింది :):)]