Thursday, October 1, 2009

తోటకు రా!!

గార్డెన్ టు కం!! అనగా తోటకు రా!!!

ఈ మద్దెన మనకి పాపులారిటీ పెరిగిపొయ్యి, కొందరు, డవిరెక్టుగా అడిగేస్తున్నారు, అదెట్టా సెయ్యాల ఇదెట్టా సెయ్యాల అని [చందా :):)].
ఆరోగ్యనికి మంచి కూరలు ఎట్టా సేస్కోవాల? ఏవితినాల? ఏంజెయ్యాల? ఇట్టాంటివి సానా పెస్నలు లెగుత్తా ఉంటాయ్ సేనా మందికి.
అట్టాంటోళ్ళకోసం ఓ మంచి వంటకం తోటకూర కూర.
మాంచి లేత తోటకూరతో పప్పు కెవ్వు కేక. అట్టానే కూరగూడా...కెవ్వుకేక!!
ఎట్టాచేస్తారో ఏంకదో సూద్దాం తోటకిపదహే.
మార్కెట్టుకెళ్ళి
ఓ పెద్ద కట్ట తోటకూర
నాలుగు మిర్చి
ఓ గుప్పెడు పచ్చిశనగపప్పు
తాలింపు గింజలు
ఓ చెంచా నూనె
ఓ ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు బొబ్బలు నూక్కొచ్చుకో.

ఓ బక్కెట్టు నీళ్ళు తెచ్చుకో తోటకూరని దాంట్లో వెయ్యి. ముంచు లేపు, ముంచు లేపు, ముంచు లేపు. అట్టా ఓక్కో ఆకు సుబ్బనంగా కడుక్కో. దేనికీ? పెస్నలొద్దు పనిజూడు. ఎందుకంటే, తోటకూర పండిచే రైతులు నీళ్ళుపెడతారా తోటకూర సేనుకి, ఇసుక మొక్కని[చెట్టుని - ఇక్కడ కొందరు అనొచ్చు తోటకూర మొక్క కదా మా ఊళ్ళో అట్టానే అంటాం, చెట్టు వృక్షం కాదు భాయ్ అని - పిల్లాట] పట్టుకుని వదల్దు. సరిగ్గా కడుక్కోకపోతే కూర తినేప్పుడు కసకస లాడుద్ది.

సుబ్బనంగా కడుక్కున్నాక, కట్ట కట్ట అట్టానే కటింగు బల్లమీనపెట్టి ఓ మోస్తరి సైజుకి నరికేసేయ్.

ఇప్పుడు, ఓ భాండీ తీస్కో
పొయ్యిమీన పెట్టు, ఆరెండు సెంచాల నూనె ఏసేయ్
ఏడికాంగనే తాలింపు గింజలు ఏసేయ్. పచ్చిశనగపప్పు ఎక్కువ ఎసేయ్.
ఏగంగనే ఎల్లుల్లి రెబ్బల్ని అరసేత్తో కుక్కి, తొక్కపీకి ఏసేయ్. మిరగాయల్ని నాలుగుముక్కలుగా నరికేసి ఎసేయ్ దాంట్లో..
సిటపటలాడంగనే, తరుక్కున్న తోటకూర కుమ్ము. సెగ కొంచెం తగ్గించి మూతపెట్టు...
పుసుక్కున ఉడికిపోద్ది నాయాల్ది. ఉప్పు తగిలించి లాగించు. కారం సాలకపోతే ఓ మిరగాయ పక్కనెట్టుకుని లాగించవో...

రెట్టెల్లోకి బాగుండిద్ది, వన్నంలోకీ బాగుండిద్ది, దేనికైనా బాగుండిద్ది. వారోగ్యానికి వారోగ్యం..




Wednesday, September 30, 2009

విదేశి-దేశి స్టైల్

ఇలాక్కూడా లాగించొచ్చు సోదరా.
ఓల్ వీట్ ఆర్టిసాన్ బ్రెడ్డు, దోస్కాయ పప్పు కుమ్ము. అరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి దానికి అది, దీనికి ఇది...

Tuesday, September 1, 2009

కంది పచ్చడి

"నా పేరు లక్ష్మి! ఔనూ!! నీపేరేమిటి చెప్పుమూ?"
"నా పేరు గాంధీ, కేరాఫ్ ప్లాట్ఫారం"
"నువ్వూ నాలాగనే అన్నమాట!"
"ఆకలిగా ఉంది"
"ఇంద ఈ చెనక్కాయలు కుమ్ము"
కరకర - ఢమల్ ఢిమీల్
"అదేంటి గాంధీ అంత తీవ్రంగా సూస్తున్నావ్ ఆ పొట్లం కట్టిన కాయతకాన్నీ"
"ఇదేదో ఉద్యోగప్రకటనలా ఉంది లక్ష్మీ"
"ఏదీ చదువ్ "
"కావెలెను! ఓ పెద్ద హోటల్ లో వంటవాడు
అర్హతలు - ఓ పెద్ద ఎప్సెరీయన్స్ అవసరంలేదు. జీతమ్ గంటకి నాలుగు డాలర్లు"
"ఏంటీ? డన్కిన్ డోనట్స్ లో చేసిన గంటకి ఏడెనిమి వస్తాయ్. ఇదేదో కాళ్ళులాగే వ్యవహారమ్లా ఉందే"
"అంతే కాదు లక్ష్మీ వాళ్ళదే ఉంకో ప్రకటన
కావలెని! ఓ పెద్ద హోటల్ లో ఛీప్ షెఫ్
జీతం గంతకి పాతిక. ఓవర్ టైం ఎక్స్ట్రా. గ్రీన్ కార్డు ఉచితంగా చేయబడును."
"ఇందులో ఎదో తిరకాసు ఉంది గాంధీ. ఒకే రెస్టారెంటోడు ఇలా రెండు ఇచ్చాడంటే. నువ్వు తప్పనిసరిగా అప్ప్లై చెయ్యాల్సిందే."


... .. .


"హహహహ"
"ఏమిటమ్మా అంత ఇదిగా నవ్వుతున్నావ్"
"నువ్వు చెప్పింది కరెక్టు డాడీ"
"రెండో ఉద్యోగానికి వందల అప్లికేషన్లు వచ్చినై. మొదటిదానికి ఒకటె వచ్చింది. అదీ స్టాంపు లేకుండా"
"ఏమిఁటీ? ఈ రాజారామ్మోహన్ రావ్ కి స్టాంపులేకుండా అప్లికేషన్ పంపించడమా? ఎంత ధైర్యం? వాడిపేరేంటి?"
"గాంధీ"
"అపేరు పెట్టుకుని కూడా వాడికి అంతపొగరా. వాణ్ణి వెంటనే ఇన్టర్వ్యూ కిప్ ఇలువ్."

... .. .

"గుడ్మార్ణింగ్ సార్"
"హ్మ్! నువ్వేనా జాతిపితవి."
"కాదు సారు. కనీసం ఒట్టి పితని కూడా కాదు. ఎందుకంటే ఇంకా పెళ్ళు కూడా కాలేదు కాబట్టి. కొందరుమాత్రం ముద్దుగా బెంచ్ పిత అనిపిలుస్తుంటారు"
"హహహ"
"నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకన్డా మామూలు జోకులు కోడా వెయ్యగలవన్నమాట. గుడ్. చూడబ్బాయ్!! జోకులువేసేవాళ్ళంటే నాకిస్టం, కానీ నామీదజోకులు వేసేవాళ్ళాంటేనే కష్టం. వాళ్ళంతేదో చూడకుండా నాకు నిద్రకూడా పట్టదు.
"ఆ!! ఇంటర్వ్యూ ప్రారంభిస్తాను.
మోదటి ప్రశ్న - నువ్వెక్కడుంటావ్."
"నాకంటూ ఇల్లులేదు. మా ఎంప్లాయర్ గాడి గెస్ట్ హౌస్ లో ఉంటా"
"ఓహో!! ఆ గెస్ట్ హౌస్ ఎక్కడుంది"
"వూరికి అటైపుంది"
"నువ్విక్కడకి ఎలా వచ్చావ్."
"(సచ్చినాడ ఎలా వస్తార్రా, నడ్సుకున్టా వచ్చా అనుకున్నావేట్రా) బస్సులో"
"లాస్ట్ అండ్ ఫైనల్ కొశ్చెన్ - ఎలా ఎలా ఎల్తావ్ నీ ఇంటికి అదే గెస్ట్ హౌస్ కి."
"(అదేమరి ఎకసెక్కాలన్టే) బస్సులో"
"దట్స్ ఆల్. నీ ఇంటర్వ్యూ ఐపోయింది. ఇంటర్వ్యూ కోసం ఇంతదూరం రావటం. ఈ ఇంటర్వ్యూకి వంటగదిలో గంటలు గుండిగలు గుండిగలు వండి ప్రాక్టీస్ చెయ్యటాలు శుద్ధ దండగ. యూ ఆర్ నాట్ సెలెక్టెడ్. దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగునుడికారంలో చెప్పాలంటే దెబ్బకు దెబ్బ. లేకపోతే ఈ రామ్మొహన్రావ్ కే ఉద్యోగానికి అప్ప్లికేషన్ పెడుతూ స్టాంప్ లేకుండా మెయిల్ చేస్తావా?"
"నేనూ మూడు ప్రశ్నలడగొచ్చా"
"అడుగు."
"మీ సంపాదన ఎంత?"
"గంటకి నాలుగొందలు."
"ఓహ్, అంటే ఎనిమిది గంటలకి (కాల్క్యులేటర్ పని చేయట్లా టయానికి దీనెన్కమ్మ) ఉండు, ఉండు, సెప్తా 3200, వారానికి 16000, నెలకి 64000 (మనసులో నాయల్ది, మనిషివా *త్తివా), అంటే నాకు నువ్వు ఇస్తానన్న జీతానికి వందరెట్లు ఎక్కువ. చూసావా, ఈ గంటకి నాలుగు డాలర్లు రాకుండా రాకుండా చేసానన్నమాట. ఎలా ఉంది సార్ ఈ టిట్ ఫర్ టాట్."
"ఇంతతెలివైన వాడివి ఈ ఉద్యోగానికే ఎందుకొచ్చావ్?"
"నాకన్నా రాటుదేలిన వంటగాళ్ళు మజ్జిగపుల్సు పెట్టుకుంటున్నారు సార్ ఇళ్ళల్లో."
"అలా ఎందుకు జరుగుతోంది."
"కందిపప్పు రేటుపెరగటం వల్ల."
"హా!! ఐతే కందిపచ్చడి చేయటం వచ్చానీకు."
"అదంతపెద్ద విషయమూకాదూ, అదోపెద్ద కష్టమూ కాదు."
"నువ్వు సరిగ్గా గమనించావో లేదో, నా చెవిలో పూలేంలేవు, నువ్వు చెప్పిందాతా వొప్పుకోటానికి. కందిపచ్చడి చెయ్యటం ఓ ఆర్ట్."
"గంటలో ఐదుగ్రాముల కందులతో కందిపచ్చాదిచేసు చూపిస్తా."
ఏంటీ గంటలో ఐదుగ్రాముల కందిపప్పుతో కందిపచ్చడి చేసిచూపిస్తావా, మర్డర్లు చేస్తావా లూటీలు చేస్తావా ఐదుగ్రాములు కొనాలంటే ఆస్థులు అమ్ముకోవాలి."
"రామ్మోహన్రావ్, నాలాంటి బెంచ్ పిత తల్చుకుంటే, ఇండియా నుండి వచ్చేప్పుడు తెచ్చుకున్న కిలోకందిపప్పు పొట్లం పగిలి చెల్లాచెదురుగా సూట్కేస్ లో పడిపోయిన గింజల్ని ఏరుకొచ్చైనా చేయాగలడు *కందిపచ్చడి*"
"అలాఐతే, నీకు నా రెస్టారెంట్లో ఉద్యోగమే కాకుండా గ్రీన్కార్డ్ కూడా ఉచితంగా ప్రాసెస్ చేయిస్తా"
... .. .

టిక్ టిక్ టిక్ కౌంట్ డౌన్ ఇస్టార్టెడ్ -

కావాల్సిన పదార్ధాలు: కందులు లేక కందిపప్పు, ఎండు మిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి.
ముందుగా, కందిప్పప్పుని వేయించి పక్కనబెట్టుకోవాలి. ఎలా? భాండీ పెట్టి, భాండీ వేడయ్యాక కందిపప్పు వేసి వేపటమే.
టిక్ టిక్ టిక్ --
అయ్యాక, ఒక అరగ్లాసు నీళ్లలో ఓ పెద్ద గోలీ అంత చింతపండు నానబెట్టుకో. అలా అది నానుతూ ఉండనీ.
ఇప్పుడు, మళ్లీ భాండీ పెట్టు, ఓ రెండు చెంచాలు నూనె పొయ్యి. వేడి అయ్యాక, ఓ పావు గుప్పెడు జీలకర, ఓ ఎనిమిది మెంతులు వెయ్యి నూనెలో, వేగంగనే ఓ 10 తొడిమలు తీసిన ఏండుమిరపగాయలు వెయ్యి, వేపు, అయ్యాక ఓ సిబ్బిరేకులో పోస్కో, లేకపోతే ఆ కోరుతో భయపడి మీ చుట్టుపక్కనోళ్లు అగ్నిమాపక యంత్రాన్ని పిలుస్తారు.
టిక్ టిక్ టిక్ --
ఇందాక చింతపండు నానబెట్టుకున్నావుగా, దాన్ని బాగా చెయ్యిపెట్టి పిసికి, చింతపండు పిప్పి తీసేయ్యి.
ఇప్పుడు, ఈ ఎండుమిరపగాయలు, ఏపిన కందిపప్పు, చింతపండు గుజ్జు, ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బింగు వెయ్యి. అయ్యాక ఓ చెంచాడు ఉప్పువేసి మళ్లీ రుబ్బింగు వెయ్యి.
టిక్ టిక్ టిక్ --
రుబ్బింగు వెయ్యగా వచ్చిన పచ్చడినే కందిపప్పు పచ్చడి అంటారు.

రామ్మోహన్రావ్ ననేనేగెలిచా...
రామ్మోహన్రావ్....పారిపొయ్యాడు ఎదవ.

Friday, August 21, 2009

రామ్ములక్కాయతో మూడు రకాలు

మీలో ఎందరికి గుర్తూ? చిన్నప్పుడు రాంమ్ములక్కాయని పందారలో నంచుకుని తింటం! రామ్ములక్కాయ మరీ అంత పండూకాకుండ మరీ పచ్చీ కాకుండగా దోరగా పండింది సిన్న సిన్న ముక్కలుగ కోసేసి పందారజల్లుకు లాగిస్తే ఉంమ్మ.
అట్టానే పందార బదులు ఉప్పు కారం జల్లుకుని లాగించినా ఓకే!!
ఈడసూడండా!! రామ్ములక్కాయతోని మూడ్రకాలంట.
1. నిటారు రకం
దోర రామ్ములక్కాయని అడ్డంగా ముక్కలు జేస్కోండా (కింద జూపెట్టిన బొమ్మలో ఆడు మూడ్రకాల రామ్ములక్కాయల్ని నించోబెట్టాడు అయి - red, yellow, heirloom. heirloom అంటే నాటు రకం అని అనుకున్టా!). ఒకదానిమీన ఇంకోటన్ట ఎట్టండా. అర్గ్యూలా ఆకులంటా!! మనేందెలుసుద్దీ?? కొత్తిమీర నాలుగాకులు, పుదీనా నాలుగాకులు సమ్మగా కడిగేసి సన్నగా తరిగేసి పైన జల్లండా. ఓ రెండు కిట్న తులసాకులంట కుమ్మండా. ఓ రెండు సెంచాలు ఆలివ్ ఆయిలంట కుమ్మరించండా. కొంచెం కారం లేక మాడ్చి నలగొట్టిన మిరాయలు, కొంచెం ఉప్పు జల్లండా
లాగించండా. ఇది జెప్పాల్సిన పనిల్యా!
2. రోస్టు
ఓ నాలుగు ద్రాచ్చా రామ్ములక్కాయలు అట్టాగే ఆలివ్ నూనెలోనంటా, ఓ చిటాకు ఉప్పుజల్లి ఏపించండా. ఓ బేకింగు పేనా లోకి మార్చేసి, ఓవెన్ లో 425 F ఏడిమీన 7 - 10 నిమిషాలు రామ్ములక్కాయ తొక్క పగిలిపొయేంతవరకూ రోశ్టు జేయాలంట. అయినక ఓవెన్ని ఆపేసి బయటకి లాగి కిట్న తులసి లేకపోతే రెండు పుదీనా ఆకులేసి కుమ్మటమేనంట.
3. సరసా ఛీఛీ సల్సా అంట
ఓ ఐదు ఇదేదో రామ్ములక్కాయ సిన్న సిన్న ముక్కలుగా తరిగేసి, ఓ ఎర్ర ఉల్ల్స్ తరుక్కుని, పావుకప్పు సొంపు ఛీఛీ, నీ ఎంకమ్మ, సోంపు, ఓ అరడజను మిరగాయల్ని తరుక్కుని, ఓ బల్ల సెంచా (టేబిలు స్పూను) ఆలివ్ నూనె, ఓ బల్లసెంచా కమలా రసం ఓ పెద్ద బొచ్చలో ఏసి కలిపేసి ఉప్పు, మాడగొట్టి నలగ్గొట్టిన మిరియాలు ఏసి లాగించమంటాడు.


ఈ పుటోబు యాణ్ణుంచో నూక్కొచ్చి ఏడబెడుతన్నా. కాపీరైటు కాపీలెప్టు గోలమనకెందుకూ!!


[Photo is pointing to womansday.com. If any objection for linking to this photo, please let me know. I will remove it.]

Thursday, August 13, 2009

కాలిబసీత

ఈ మధ్య మాకు ఉచితంగా ఓ పత్రిక (పుత్రిక కాదులేవయ్యా బాబు) వస్తోంది. దానిపేరు దేనికిలేగానీ, కొన్ని కొన్ని మంచి మంచి అవసరమైన విషయాలు ఉన్నాయ్ అందులో. మనకి కావాల్సిన సెక్షన్లో నన్ను ఆకర్షించిన వంటకం ఇది. దీని పేరు కాలిబసీత (Calibasita)

కావాల్సినవి -
4 జుకిని[1]. ఇదేందిది అనుకోవద్దు. ఇది మన బీరకాయకి పెద్దమ్మ బామ్మర్ది అన్నగారికి చెల్లెలు వరస. ఇది దొరక్కపోతే కీరా వాడుకోవచ్చు, ఏంపర్లేదు.
2 టేబిలు స్పూల ఆలివ్ ఆయిల్.
1 ఒకమోస్తరు సైజు ఉల్స్
1 వెల్లుల్లి రెబ్బ
3 మొక్కజొన్న కండెలు.
2 రోమా[2] రాంములక్కాయలు బాగా పండినవి.
1/2 కప్పు మొత్సరిల్ల ఛీజు లేక ఫెటా ఛీజు. అది ఇది దొరక్కపోతే పన్నీరు ముక్కలు అనుకోండి.[ఇది మాత్రం మీ ఇష్టం కావాలంటే వేస్కోవచ్చు లేకపోతే లేదు]
రుచికి కోషర్[3] ఉప్పు.
ఇదేందిది కోషర్ ఉప్పు అంటారా?
ఇది మన ఇంట్లో వాడుకునే ఉప్పే కాకపోతే కొంచెం గండ్ల ఉప్పులా ఉంతుంది. మరియూ కోషర్ ఉప్పులో ఐయోడిన్ ఉండదు.
పద్ధతి -
ముందుగా జుకిని ని ఓ మాదిరిసైజు ముక్కలుగా కోసి ఓ చిల్లుల గిన్నెలో వేసి, కొంచెం ఉప్పుజల్లి పక్కనబెట్టు.
ఉల్స్ ని తరుక్కో సన్నగా.
వెల్లుల్ల్ని ఓ సారి కుక్కి తొక్క తీసేసి సన్నగా తరుక్కో.
రాంములక్కాయ తరుక్కో సన్నగా
మొక్కజొన్న కండె నుండి మొక్కజొన్న ఇత్తనాలని తీ. ఎట్టా? ఒలుస్తూ కూకుంటావా? తెల్లారుద్ది. కత్తిపెట్టి ఈడజూపిచ్చినట్టుగా చెయ్యి

ఒక భాండీ తీస్కుని ఆలివ్ ఆఉఇల్ వేసి, పోసి కాదు, ఓ రెండు చెంచాలు వేసి, వేడెక్కంగనే ఉల్స్, వెల్లుల్లి వెసి మూణ్ణిమిషాలు ఏపు.
పైన తరుక్కున్న జుచ్చిని, మొక్కజొన్నని ఎయ్యి, 6-7 నిమిషాలు ఏపు.
తరుక్కున్న రాంములక్కాయలు వేసి 2-3 నిమిషాలు ఏగనీ.
[గ్రేటెడ్ ఛీజ్ జల్లు]
దింపేసి రొట్టెతోనో గుడ్డుతోచేసిన అట్టుతోనో లాగించు.

నోట్ -
1. జుకిని http://en.wikipedia.org/wiki/Zucchini
2. రోమా రాంములక్కాయలు http://en.wikipedia.org/wiki/Roma_tomato
3. కోషర్ ఉప్పు http://en.wikipedia.org/wiki/Kosher_salt

Nutrition Facts
* Calories 143
* Total Fat 7g
* Saturated Fat 1g
* Cholesterol NA
* Sodium 602mg
* Total Carbohydrates 21g
* Dietary Fiber 4g
* Protein 4g

Wednesday, July 29, 2009

(రాం)ములక్కాయలు

నిన్న (రాం)ములక్కాయలు వండుకున్నాం. అదేంది బ్రాకెట్టులో రాం అని రాసారు? ప్రతీదానికీ రామ నామం జపిస్తారా అని ఎవురైనా అనుకోవచ్చు. తప్పులేదు.
ఏందయ్యా కత అంటే రాంములక్కాయ మరియూ ములక్కాయ కూర. ఏంటి?? నోరూరిందా? మరి ఊరదా? ముక్కులు వాసన కోసం ఎగురుతున్నాయా? మరి ములక్కాయ రాంములక్కాయలో ఉడుకుతుంటే ఆ వాసనే వేరుకదా!!
దీనిక్కావాల్సింది -
ఎర్రని నవనవలాడుతున్న రాంములక్కాయలు ఓ రెండు, నాజూకైన ములక్కాయలు ఓ రెండు, ఓ ఉల్స్, నాలుగు వెల్లుల్లి, కొంచెం అల్లం, ఓ చెటాకు కొత్తిమీర, ఓ చెంచాల నూనె, తిరగమాత గింజలు గట్రా!!. నేను ఈ మధ్య వంటలకి ఆలివ్ ఆయిల్ నూనె వాడుతున్నా
ఇక మొదలుపెడదామా!!
ముందు, మిర్చిని సన్నగా తరుక్కో. తర్వాత, అరచేతినిబెట్టి, వెల్లుల్లి రెబ్బల్ని కుక్కు (క్రష్), అప్పుడు వాటిపైన తొక్కతీసేసి సన్నగా ఛాప్ చేసి పక్కన్బెట్. అల్లం, పైన తొక్క తోసేసి, సన్నగా తర్క్స్, పక్కన్బెట్స్.

ఉల్లిపాయని సన్నగా తరుక్కో, ములక్కాయల్ని సుబ్బరంగా కడుక్కుని ఐదు ముక్కలుగా నరుకు, ఆ రెండు రామ్ములక్కాయల్ని ఛాప్ చేస్కో.

పొయ్యి వెలిగించు, చట్టి పెట్టు అదే, డేగిషా.
నూనె పొయ్యి. కాగంగనే మినుములు, పచ్చిశనగపప్పు, ఎండు మిర్చి, ఆవాలు, జిలకర, చివరాకరికి కర్వేపాకులు లతో తిరగమాత వేసేయ్. ఓ చెటికెడు పసుపు వెయ్యి. ఇప్పుడు మిర్చి, వెల్లుల్లి వెయ్యి. ఓ సారి బాగా కలుపు. ఇప్పుడు ఉల్స్ వెయ్యి, డీప్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించు.
అయ్యిందా, ఇప్పుడు తరుక్కున్న ములక్కాయలు, రాంములక్కాయలు వేసేయి. కలుపు లేక గంటే బెట్టి తిప్పు. ఉప్పు, కారం వెయ్యి కలియ తిప్పు, మూతెట్టు. గ్రేవీ అంటే నీళ్లు సరిపోను లేవు అనుకుంటే ఓ గళాసు పోస్కో (ఆంటే అవసరాన్ని బట్టి అని)
ఉడకనీ ఇక.
ఉడికినాక, కొత్తిమీర (పైన్లీ వాష్డ్ అండ్ ఛాప్ప్డ్ - శుభ్రంగా కడిగిన మరియూ సన్నగా తరిగిన) జల్లు - ఇంకొంచేస్పు ఇగరనీ - పొయ్యి ఆపేసి డెగిషాని దింపి ఇక సిగ్గు లేకండా అదేన్వాయా సిగ్గు పడకుండా లాగించు.



కొందరు ములక్కాయని జస్ట్ గుజ్జుని పళ్ళతో లాగించేసి పక్కన పడెస్తారు. కానీ ములక్కాయ రుచి ఆసాంతం నమిలి పీల్చి పిప్పిని మాత్రం వదిలనప్పుడే. అందుకే సిగ్గు లేకండా అదేన్వాయా సిగ్గు పడకుండా లాగించు అన్నది. కాబట్టి, మునక్కాయ ముక్క బాగా ఉడకటం ఇక్కడ కీ. అలానే ఈ కూర ఆరోగ్యానికి కూడా మంచిదే!!

Thursday, July 23, 2009

ఓటు

ఏందీ!! నేను బ్లాగు ఎమ్మెల్యేగా పోటీసేత్తనా నాకోటేయండీ అని అడుగుత్తున్నా అనుకుంటన్నారా? మరక్కడే ఉప్మాలో చెంచా ఏసారు.
ఈయాల రోవంత ఆకలిగా ఉండింది. మరీమద్దెన డైటింగు గట్రా సేత్తనాం, ఎస్సర్సైజులు సేత్తాన్నాంగదా. అందుకు. మామూలుగైతే ఓ సంచి సిప్పీసు అ.క.అ చిప్సు కరకరా నములుకుంటా మిగేటోళ్ళం కదా. మరి ఇప్పుడేంసెయ్యాల్రా బగమంతుడా అని ఆలోసిస్తూ నా ఈప్మీనకేస్కునె సంచీలోకి సెయ్యి బెడితే, ల్యాపుటపు, బొక్కులు, కాయితకాలు, అయ్యి ఇయ్యి మట్టీ మషాణం, బయటి హార్డ్ డ్రైవ్, తోబాటు ఓటు మీల్ డబ్బా తగిలింది. జర్రున బైటికి గుంజునా . ఇట్టా ఓ సంచి తీసానా
From ఓట్మీల్

ఓ గలాసులో ఏడ్నీళ్ళు పోసినా
From ఓట్మీల్

సంచి చింపేసి ఏడినీళ్ళలో బోసినా
From ఓట్మీల్

ఓ రెంణ్ణిమిషాలు మూతబెట్టి ఉంచినా.
From ఓట్మీల్


ఓ సెంచా బెట్టి ఓ పాలి కలిపేసి సుబ్బనంగా లాగించినా!!!

Monday, July 20, 2009

రొట్టె చుట్టు

ఇయ్యాల మావిడ రొట్టెల్జేసి అవ్వతలనూకి కూరసెయ్యటానికి టైం దొరకట్లా ఏమైనా సెయ్యరాదా అని పిల్లల్తో పర్గులుపెడుతూ అంది.
ఏమున్నాయ్ అన్నా.
క్యారెట్లు పాడైపోతున్నాయ్ అంది.
ఫ్రై జేస్కో అంది.
నీ ఇష్టం కిచెన్ నీదే అంది.
సరే, ఎప్రాన్ నడుముకి కట్టుకునేలోపు మళ్ళీ ఓ మాట సెప్పింది. క్యారెట్టు తురిమి ఉప్పు, మిరియాలపొడి జల్లుకుని లాగించొచ్చుకదా అని ఓ సలహా పడేసింది.
ఠడా!! మంచి ఆలోచనే అని దూకా, రంగంలోకి.
తను ఇచ్చిన ఔడియాని పొడిగించా.
ఇలా -
క్యారెట్ల పైన తొక్కని ఓ రౌండు తీసేసి, పీలర్తో క్యారెట్టు మొత్తాన్నీ స్పగెట్టి లా పీల్ చేసేసా.
అదే చేత్తో ప్రిజ్జీలోంచి పాపాయు దోస్కాయ ( బేబీ క్యూకుంబర్) ని తీసి సన్నగా తరిగేసేసి,
ఓ ఉల్స్ ని సన్నగా నిలువునా తరిగేసేసి అన్నీ ఓ తెల్ల బొచ్చలో వేసేసి, ఓ నిమ్మ బద్ద పిండేసి కొంచెం ఉప్పుజల్లేసి ఇలా

బాగా కలిపేసి,
రొట్టె పైన పెట్టి మద్దెనుండి మడిచి ఈ చివర్ని లోనికి మడిచి, ఆ చివర్ని మొత్తం ఇలా

సుట్టేసి సుబ్బరంగా లాగించా.
దీంట్లోకి మొలకెత్తిన పెసలు, మొలకెత్తిన సజ్జలు ఏవైనా మస్తుగుంటై.

Monday, June 8, 2009

గోంగోర రోటి పచ్చడి.

మొత్తానికి మా దేశీ కొట్టోడు గోంగోర మహా వృక్షాలని తెచ్చాడు మొన్న. సూడంగనే పాణం గిలగిల్లాడి, ఓ నాలుగు డాలర్లు పోతే పోనీ దీనెక్క గోంగోర తిన్ని బతుకెందుకు అనేసి, ఓ నాలుగు వృక్షాలను లారీకేసి తోలకొచ్చా. ఆదివారం, కుంపటెట్టి గోంగోర పప్పు తవండుకోవాలని ముందు ప్రణాళికేస్కున్నా, సమయాభావం పిల్లల డిమ్యాండ్ల వల్ల పప్పుగిన్నె కుంపట్లోంచి మామూలు పొయ్యిమీదకి మారింది. పప్పులో ఎయ్యంగా మరో రెండు వృక్షాలు మిగిల్నై. ఏటిసేయ్యాల్రా బగమంతుడా అంది మావిడ పిల్లని సంకనేస్కుని. వెనువెంటనే, పచ్చడి నూరూ అని నోట్ళోంచి, మన ప్రమేయంలేకుండా జాలువార్చింది నాలుక ఇంత నీళ్ళు నోట్లో ఊర్చుకుంటూ. అటులనే మాహారాజా అనేసి ఆ ప్రాణి రోలు కడగటం మొదలెట్టింది (రోలు అనగా గ్రైండరు)
ఇంతక మునుపు జరిగిన గోగుల యుద్ధంలో నే చెప్పినట్టుగా, గోంగోరతో పచ్చళ్ళు రకరకాలు.
సరే గోంగోరతో చేసే ఈ పచ్చడికి కావాల్సింది, నేను తెచ్చినట్టుగా గోంగోర మహా వృక్షాలు కాదు. ఏక్ దం ఫ్రెష్, నవనవ లాడే గోంగోర మరియూ, అప్పటికప్పుడు కోస్కొచ్చిన పచ్చిమిరగాయలు. ఓర్నీఇంట వాన కురవా, యాడ దొరకతన్నాయ్ ఇయ్యాల్రేపు "ప్రెష్" సరుకు అని అనుకోవచ్చు అందరూ, అబ్బా చోద్యం అనుకోనూ వచ్చు. అలాంటి ఆకుతో మిరగాయల్తో సేత్తే ఆ రుచే ఏరు అని నా అర్ధం.
సరే, ఓ కట్ట గోంగోర, ఓ అరడజను మిర్చి, రెండు ఎండు మిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, అరచెంచా మెంతులు, తిరగమాత సామాన్లు, ఓ చెంచా నూనె.
ముందుగా గోంగూర. మిరగాయలు ఉడకబెట్టి పక్కనెట్టుకోవల. అయినాక,
భాండీ ఎట్టి తిరగమాత ఏసేసి, దాంట్లోనే మెంతులేసేసి, చిట్పట్ అన్నాక ఎల్లుల్లి ఏసేసి ఏపాల. అయినాక ఆ ఉడకబెట్టిన గోంగోర, మిరగాయల్ని ఇందలో ఏసేసి ఓ సారి ఏయించి (నీళ్ళు ఉంటే అయి ఇంకిపోయిందాక పొయ్యిమీనే ఉంచాల), ఉప్పు ఏసేసి, రోట్లో ఏసుడు, నూరుడు. అంతమెత్తగా ఉండాల్సినపన్లా. కచ్చాపచ్చీగా ఉండా పర్లా.

దీనికి కీ - మిర్చీ, గోంగోర ఆటి వాసన్ని కోల్పోకుండా చూడాల. కాబట్టి మోడరేట్ గా వేయించుకోండా.
ఈ పచ్చడి ఎక్కువకాలం ఉండదు. కేవలం రెండు మూడ్రోజులు మాత్రమే.

ఇక దీంట్లో ఎన్ని కేలరీలు ఉంటాయో నాకు పెద్ద తెలియదు. కానీ బలమైన ఆహారమే. కారణం దీంట్లో కేవలం ఒక స్పూను నూనె, రుచుకి ఉప్పు, మిగతావి ఆరోగ్యకరమైనవే. గోంగోరలో ఇనుము అధికశాతం ఉంటుంది.

నేను ఈ రోజు రాగిజావలో దీన్నేస్కుని ఓ కుమ్ముడు కుమ్మాను.
మీరూ ఆనందించండి.

[సర్లే బాసూ అంతా బాగనే ఉంది, మరీ ఏంది అంత కొంచెం అయ్యింది పచ్చడీ అనుకుంటున్నారా? రుసి సూద్దాం అని నోట్టో ఏస్కున్నామయ్యా, ఏందంట, సగం అయిపోయింది :):)]

Friday, May 22, 2009

పళ్ళెం పద్ధతి - ఒక వివరణ

ఈ మధ్య నేను ప్రచురించిన గోధుమరవ్వ ఉప్మా పోస్టుకి మన బ్లాగ్ సోదరుడు "నెమలికన్ను" మురళి, మధుమేహ వ్యాధి గ్రస్తులు తినగలిగే కొత్త రకం వంటల గురించి రాయమని సూచించారు.
ఆ దిశగా ఈ ప్ర్రయత్నం, పోస్టు.
మధుమేహ వ్యాధిక్రస్తులకి చాలా అపోహలు, చాలా అపనమ్మకాలు, భయాలు అవీ ఇవీ ఉంటాయి. ఏది తినొచ్చు, ఏది తినకూడదూ. హమ్మో అది తింటె ఎలా, ఇది తింటే ఎలా...లాంటి ఎన్నో అలోచనలతో భయపడుతూ ఉంటారు.

గూగుల్లో గెలుకుతూ ఉంటే ఈ క్రింది సమాచారం తగిలింది. ఉపయోగపడుతుందీ జనాలకి అని ఇక్కడ పెడుతున్నా.
ప్లేట్ మెథడ్ - అనగా పళ్ళెం పద్ధతి -
అంటె భోజనంలో ఏమి తినొచ్చు అని.
ఈ క్రింది బొమ్మని చూడండి.


ఇది మీరు భోజనం చేసే పళ్లెం అనుకుందాం. పళ్ళెం అంటే, అర్ధవంతంగా ఉన్న సైజులో అని. పళ్లెం అనగా స్థాభాళం కాదు.
ఇప్పుడు, ఆ పళ్ళాన్ని, పైన చెప్పిన విధంగా మూడు భాగాలు చేస్కోండి. అంటే రంపం తెచ్చి కోస్కోండి అనికాదు, మూడు భాగాలు చేసాం అని ఊహించుకోండి. అనగా, ముందుగా, అడ్డంగా ఒక గీత గీయండి. పళ్ళెం రెండు భగాలయ్యింది. ఇప్పుడు కింది భాగంలో నిలువుగా ఒక గీత గీయండి.
ఇప్పుడు పైన ఉన్న సగభాగం అనగా సింహ భాగం NS పదార్ధాలు, మిగతా దాంట్లో ఒక సగం S పదార్ధాలు, మిగతా P పదార్ధాలు తినాలి. దీంతో పాటు తక్కువ లేక అస్సలు కొవ్వు లేని పాలు ఒక కప్పు, పండ్ల ముక్కలు ఒక కప్పు తీస్కోవాలి.
NS పదార్ధాలు అనగానేమీ?
NS = నాన్ స్టార్చీ అని. గంజి లేని పదార్ధాలు. ఉదాహరణకి
పాలకూర, క్యారెట్లు, లెట్యూస్, గ్రీన్స్, కోసుగడ్డ, బోక్చోయ్ (చీనా కోసుగడ్డ అంటారు)
గ్రీన్ బీన్స్, బ్రొక్కొలి, కోసుపువ్వు, రామ్ములక్కాయ
పండ్ల రసాలు, సల్సా, ఉల్లి, దోసకాయ, బీట్రూట్, బెండ
పుట్టగొడుగులు, మిర్చి, టర్నిప్ (ముల్లంగి లాంటిది)
S పదార్ధాలు అనగానేమీ?
S = స్టార్చీ అని. అనగా గంజిగల పదార్ధాలు. ఉదాహరణకి -
ముడి ధాన్యాలు లేక వాటి ఉత్పత్తులు - హోల్ వీట్ బబ్రెడ్డు.
ఎక్కువ పీచుగల పదార్ధాలు - అనగా తృణధాన్యాలు.
ఓట్మీల్, గ్రిట్స్(thick maize-based porridge), హోమిన్య్ లేక క్రీం ఆఫ్ వీట్.
వరి, పాస్తా (హోల్ గరిన్ పాస్తా) , రొట్టెలు,
మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి,
ఉడకబెట్టిన బీన్స్ - సోయా బీన్స్, బఠాణి, కిడ్నీ బీన్స్, లెంటిల్స్, పుల్లశనగ, ఇత్యాదివి.

ఇక P పదార్ధాలు -
మాంసాహారం లేక ఎక్కువ ప్రొటీను గల శాకాహారం.

మధుమేహ ఆహార పిరమిడ్

అలానే కొన్ని ఉపయోగపడే తీగలు -
https://www.diabetes.org/food-nutrition-lifestyle/nutrition/meal-planning/create-your-plate.jsp

కాబట్టి ఏమి తిన్నా, సరైన రీతిలో తినాలి అనేది పాయింటు. పళ్ళు తినకూడదా? మామిడి పండు తినకూడదా? తినొచ్చు. ఎంత అనేది ప్రశ్న.
ఇలా ఎప్పుడైనా మంచి సమాచారమ్ దొరికితే ఇక్కడ పెడుతుంటా.

Monday, April 27, 2009

దోసకాయ పప్పు - కుంపటి

మాష్టారూ మీరు మరీను. దోసకాయ పప్పుకి ఒక పోస్టా అనొచ్చు. కానీ రాయాలనిపించింది. పంచుకోవాలనిపించింది.
హఖహ!! (గొంతు సవరణ)
ఇంతకీ కధ ఏమనగా
మాకూ స్ప్రింగు వచ్చిందీ, మేమూ ధైర్నంగా ఇంటోంచి బయటికి వస్తున్నం, హీటర్లు గట్ర ఆపేసినం. మా దేశీ కొట్టోడు దోస్కాయలు దెచ్చిండు. వండుకున్నం. ఏముందీ గురూ అంటావా? కుంపటిమీన వండినం. :):)
From దోసకాయ పప్పు

మరీ పైన బొమ్మలో ఉన్నంత తాజా మాల్ కాదుగానీ పర్లేదు, ఓ మోస్తరి తాజా దోసకాయలు తెచ్చాడు మావాడు.
సరే మొన్న ఇరవై ఐదు కి వచ్చింది వేడి. బిలబిల మంటూ జనాలు బయటకి వచ్చేసారు. నేనూ ఇక కుంపటి వెలిగిద్దాం అని మొదలిబెట్టా.
ముందుగా దోసకాయ పప్పు చెయ్యటానికి కావాల్సిన వస్తువులు -
దోసకాయ.
మిర్చి కొన్ని.
కర్వేపాకు.
కందిపప్పు.
ఉప్పు గట్ర........

ముందుగా దోసకాయకి చెక్కుతీసి సన్నని ముక్కలుగా తరుక్కోవాలి.
From దోసకాయ పప్పు


కుంపటి రా చెయ్యి. అనగా, బొగ్గులు కుంపట్లో వేసి, కిరసనాయిలు పోసి, వెలిగించి సిద్ధం చేస్కో.
ఇప్పుడు ఒక గిన్నెలో కందిపప్పు ఓ గిద్దెడు, పోసి ఒకసారి కడిగి, ఒకటికి రెండు చొప్పున నీళ్ళు పోసి కొంచెం పసుపువేసి కుంపటి మీద పెట్టు. మూతపెట్టు. కొంచెంసేపయ్యాక పొంగొస్తుంది పప్పు, మూతని ఓరగా పెట్టు ఇక ఉడకనీ
From దోసకాయ పప్పు

కందిపప్పు ఒక గింజ ఒత్తిచూడు, మెత్తగా నలిగిందీ అన్నప్పుడు దోసకాయ, మిర్చి, కర్వేపాకు వేసేయ్. మూతపెట్టు.
From దోసకాయ పప్పు

బాగా ఉడకనీ ఇక. అప్పుడప్పుడూ నీళ్ళు ఉన్నాయో లేదో చూస్తుండూ. నీళ్ళు తగ్గితో ఓ అరగ్లాసు పొయ్యి. ఏంకాదు.
From దోసకాయ పప్పు

అప్పుడప్పుడూ మూత తీసి చూస్తుండూ ఏంటీ పరీస్తితీ అని.
ఇక దోసకాయ ముక్క ఉడికిందీ అన్నప్పుడు ఉప్పూ కారం వేసేయ్.
From దోసకాయ పప్పు

ఓ సారి మొత్తం కలియతిప్పి, తిరగమాత వేసి, కొంచెం కొత్తిమీర జల్లు.
From దోసకాయ పప్పు

ఓ సారి మొత్తం కలిపి, దింపెయ్.
దింపినాక, ఓ నిమ్మకాయ పిండు.
వేడి వేడి దోశకాయ పప్పు నెయ్యితో కుమ్ము.
కొంతమంది నిమ్మకాయ బదులు చింతపండు వాడతారు. నాకు మిమ్మకాయ నచ్చుతుంది. కొంతమంది కారం బదులు మిర్చి పేస్ట్ వాడతారు అనగా ఓ నాలుగు మిర్చిని గ్రైండ్ చేసి కుమ్మటమే. ఐతే మిర్చీ పేస్ట్ వేస్తే అది పచ్చివాసన పొయ్యేదాకా ఉడకనివ్వాలి.

కాంబినేష్నన్స్ తెల్సుకో - పప్పులో పచ్చడి కలుపుకుని తినే అలవాటు ఉంటే, దోసకాయ పప్పులోకి సరైన కాంబినేషన్ కొత్త ఆవకాయ.
కుమ్ము ఇక.

మా దేశి కొట్టోడు ఎల్.బికి మూడు డాలర్లు నూకాడు.
నాకు బాగా గుర్తు, మా ఊళ్ళో, దోసకాయలు ఎలా అమ్ముతారూ అంటే, ఎద్దుల బండ్లకి ముందున్న జల్లలో దోసకాయలు తెచ్చి ఊళ్ళో ఒకచోట ఆపుతారు. ఊరి ఎట్టోడు తప్పెట తో వస్తాడు, రచ్చబండాకాడాకి దోస్కాయల బండ్లొచ్చినై. ఎత్తు రూపాయ అని. ఎత్తు అనగా మూడు కిలోలు. జనాలు ఎళ్ళి మూడో నాలుగో ఎత్తులు తెచ్చుకుంటారు. రాళ్ళలా ఉండేవి ఆ దోసకాయలు. పెద్దపెద్దవి. వెతికి చూద్దాం అన్నా కుక్కమూతులు ఉండేవి కావు. పప్పు, కూర, పచ్చడి, చారు, పులుసు వీటిల్లోనే కాకుండా దోసకాయని నిలువునా కోసి ఉప్పు కారం అద్దుకుతింటే మహా రుచిగా ఉంటుంది. ఐతే దోసకాయ తిన్న పొట్ట దొంగలుపడిన ఇంటితో సమానం. మా ఊరిబయట ఎక్కడ చూసినా దోసకయ చెట్లే.
బళ్ళో నెలకోసారి బోర్డు క్లీనింగు కార్యక్రమం. దానికి బడికి ఎళ్ళేప్పుడే చొక్కా నిండా ఈ దోసాకు నింపుకుని, బడికెళ్ళినాక దులిపి, దోసాకూ బొగ్గు బాగా నూరి బోర్డుకి పట్టిస్తే, భలే వొచ్చేవి బోర్డులు.

Friday, April 24, 2009

పాస్తా రివిజిటెడ్ బొమ్మలు సెలనసిత్రాలతో

ఇయ్యాల మా ఇంటో పాస్తా చేస్కున్నం.
దాని ఇది ఇదానం ఈడాబెడతన్నా, బొమ్మలు, సెలన సిత్రాలతో.
ఇంతకముందరే జెప్పా, పాస్తా వీజీ అని.
ఇయిగో ఇయ్యి కావాల ముందు.
From పాస్తా

సన్నంగ అన్నీ తరుక్కునే లోపు,
పాస్తాని ఏడినీళ్ళల్లో ఎయ్యాల
From పాస్తా

ఈ లోపల, ఎర్రయి, ఆకుపచ్చయ్యి, పసుప్పచ్చయి బెంగుళూరు మిరగాయలు, ఉల్లిపాయలు, మిర్చి, అల్లం, వెల్లుల్లి, రాములక్కాయ అన్ని తరుక్కుని పక్కనెట్టుకోవాల.
From పాస్తా

ఇంక, ఆ ఉడుకుతున్న పాస్తాలో ఓ చెంచా ఉప్పు, ఓ చెంచా నూనె ఎయ్యాల
From పాస్తా

అయి ఉడికినాక, ఆటిని వడపోసి ఓ సారి సల్లనీళ్ళకింద పెట్టాల.
భాండీ పెట్టి ఓ ఐదు సెంచాల నూనె పొయ్యాల. నూనె కాగంగనే, మిర్చి, వెల్లుల్లి, అల్లం ఏసి ఏపాల, ఏగినాక ఉల్లిపాయలు నూకాల.
From పాస్తా

ఉల్లిపాయలు ఏగినాక, బెంగుళూరు మిర్చి ఎయ్యాల, మళ్ళీ ఏపాల
From పాస్తా

ఇయ్యీ ఏగినాక, రాములక్కాయలు ఏసి, రామ్ములక్కాయ గుజ్జు ఓ నాలుగు సెంసాలు ఏసి ఏపాల. ఓ సెంసా ఉప్పేసి రామ్ములక్కాయలు ఉడికినయి అన్నాక పాస్తా ఏసి బాగా తిప్పాల.
From పాస్తా

మద్దెలో రాములక్కాయ గుజ్జు సాలకపోతే ఇంకొంచెం ఎయ్యాల.
అయినాక, కొత్తిమీర ఎసేసి ఓ సారి తిప్పేసి
From పాస్తా

పొయ్యి ఆపేసి, నిమ్మకాయ పిండాల.

ఇప్పుడు ఏడి ఏడిగా లాగించాల.
అదీ కత.

Monday, April 13, 2009

గోధుమరవ్వ ఉప్మా

చాలా సందర్భాలలో అనగా పెళ్ళిళ్లకీ పేరంటాలకీ ఇలాంటి అన్నీ కార్యాలకి ముంబాయిరవ్వ (బొంబాయి పేరు మార్చటమైనది) ఉప్మా చేస్తుంటారు.
అలానే ఇంట్లో కూడా చాలామంది ముంబాయి రవ్వ ఉప్మా నే చేస్కుంటుంటారు. గోధుమరవ్వ ఉప్మా సరైన పద్ధతిలో చేస్కుంటే చాలా రుచిగా ఉంటుంది మరియూ ఆరోగ్యం కూడా.
కావాల్సిన పదార్ధాలు -
గోధుమరవ్వ. ఇక్కడ దీన్ని బ్రోకెన్ వీట్ అంటారు.
From ఉప్మా

మన ఊళ్ళో బన్సీ గోధుమరవ్వ దొరుకుతుంది, దాని రుచి అత్భుతం.
సరే, ఇంకా ఒక ఉల్లిపాయ, నాలుగు మిర్చి, ఓ గుప్పెడు వేరుశనగలు, నాలుగు రెబ్బలు కర్వేపాకు, ఒక క్యారెట్టు, ఒక బంగాళదుంప, ఒక పది-పదిహేను గ్రాముల అల్లం ముక్క. తిరగమాత గింజలు, ఓ నాలుగు చంచాల నూనె.
పద్దతి -
ముందుగా మిర్చి, అల్లం, ఉల్లిపాయ, క్యారెట్టు, బంగాళదుంప తరుక్కో ఇలా
From ఉప్మా

అయ్యక, భాండీ పెట్టి నూనె పోసి కాగంగనే తిరగమాత గింజలతోపాటు పల్లీ వేసి వేగాక కర్వేపాకు వేసి చిట్పట్ మన్నాక తరుక్కున్న మిర్చీ, అల్లం వేసేయ్. వేగినాక ఉల్లిపాయలు వెయ్యి. ఉల్లి గోల్డెన్ బ్రౌన్ కి రాంగనే
From ఉప్మా

ఇందాక తరుక్కున్న క్యారెట్టు, బంగాళదుంప వేసేయ్. వేగనీ.
ఈలోపల ఓ నాలుగు గిద్దెల నీళ్లు సిద్ధం చేస్కో. దుంప, క్యారెట్టు వేగంగనే ఈ నీళ్లు పోసెయ్యి ఆ భాండీలో.
నాలుగు గిద్దెలు ఏమిలెక్క? లెక్కేంటంటే, ఒకటికి రెండు. అనగా ఒక పార్టు రవ్వ ఉడకటనికి రెండు పార్టుల నీరు అవసరం. కాబట్టి రెండు గిద్దెల రవ్వ కొల్చుకుని పక్కన సిద్ధంగా పెట్టుకో.
భాండీలోని నీళ్లు తెర్లుతున్నప్పుడు ఒక చెంచాడు ఉప్పేసేయ్.
From ఉప్మా

ఇప్పుడు ఆ తెర్లుతున్న నీళ్లలో ఇందాక సిద్ధంగా పెట్టుకున్న రవ్వని నెమ్మదిగా పోస్తూ కలతిప్పుతూ పూర్తిగా పేసేసాక మొత్తం ఓ సారి కలిపేసి మూతపెట్టి, తక్కువమంటపై ఉంచు. ఉడకనీ.
ఓ ఐదు నిమిషాలకి మూతతీసి చూడు ఉడికిందేమో.
From ఉప్మా


ఉడికే ఉంటుంది. మంట ఆపేసి ఆరగించు.
నేను చేసినదాంట్లో కొంచెం నీళ్లు తక్కువ అయినై మరియూ కొంచెం లవణం తగ్గింది.
గమనిక -
౧. గోధుమరవ్వ మధుమేహ వ్యాధిగ్రస్తులకి చాలా మంచిది. వారికే కాకుండ ఎవ్వరికైనా మంచిదే మరియూ తొందరగా జీర్ణం అవుతుంది కూడా.

Wednesday, April 8, 2009

కోసుగడ్డ ఇగురు

ఇది సెయ్యటానికి కావాల్సినవి
ఓమాదిరి సైజు కోసుగడ్డ ఒకటి.
ఓ నాలుగు పచ్చిమిరపకాయలు.
ఐదురూపాయల నాణెం అంత అల్లం.
ముఫైఎనిమిది.నాలుగు గ్రాముల ఆవుదం సమించండి గుర్గారు నూనె.
తిరగమాత గింజలు.
మరియూ ఇంగువ.
ఓ చెంచా ఉప్పు.
ఓ అరచెంచా కారం.
ఈ విధానం బెంగళూరు పద్దతి.
ఏటయ్యా అంటే -
ముందుగా మిరిచి నిలువునా చేరేసి పక్కనెట్టు.
అల్లం సిన్న సిన్న ముక్కలుగా తరుక్కో పక్కనెట్టేయ్.
ఇప్పుడు కూసుగడ్డని సన్నగా తరిగేస్కో.

భాండీ ఎట్టు. నూనెపొయ్యి, వేడెక్కినాక తిరగమాత వెయ్యి. చిట్పట్ అన్నాక ఇంగువ వెయ్యి. అయ్యాక పసుపు చిటికెడు వేసేయ్. తిరగమాత మాడకముందే అల్లం మిర్చి వేసేయ్యి. వేయించు. ఓ నిమిషం అయ్యాక తరుక్కున్న కోసుగడ్డ వేసేయ్. ఓసారి మొత్తం తిప్పి మూతెట్టు.
గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపు, ఉప్పు కారం వేయ్యి.
దింపి లాగిఉంచు వేడి వేడి అన్నం, నెయ్యి వేస్కుని.

ఈ కూరలో కీ - ఇంగువ. తిరగమాతలో వేసే ఎండుమిర్చి ఇంగువలో వేగుట. ఈ కూర తినునప్పుడు ఈ ఎండు మిర్చీని కొరుక్కుంటు ఆస్వాదించు.
సరే అలానే - పురజనుల కోరికపై కోసుగడ్డ అనగా కోసేసిన గడ్డ కాదు, క్యాబే-జీ. అబ్బే, అదేంతిట్టు కాదబ్బాయ్ క్యాబేజీ అని.

Friday, April 3, 2009

వడపప్పు, పానకం

జగమెల్లరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

మరి శ్రీరామనవమి రోజున, పందిళ్లలో జెగ్గులకొద్దీ పానకం, దోసిళ్లకొద్దీ వడపప్పు తినకపోతే మహా పాపం.
అసలు ఏంటివి? ఎలా చేస్తారు?
శ్రీరామనవమి చైత్రమాసం కాబట్టి, ఎండలు ముదురుతుంటాయి. తాపాన్ని తట్టుకుని, కాస్త చలువచేసేవి తినండి అని అంతర్లక్ష్యం.
పానకం తయ్యారీ విధానం -
కావాల్సినవి -
ఓ కూజాడు నీళ్లు.
ఓ వంగ గ్రా।। బెల్లం.
నాలుగు యాలుకలు.
నాలుగు మిరియాలు.
విధానం-
యాలుకల పైన తొక్క తీసేసి, ఆ గింజల్ని ఓ చిప్పగంటె నూరుకుని నీళ్లల్లో వేసేయి.
మిరియాలని, చిప్పగంటె తో బాగా నూరుకుని నీళ్లల్లో కలిపేయ్.
బెల్లాన్ని బాగా చిప్పగంటెతో నలిపేసి నీళ్లలో వేసేయి.
బాగా కలుపు, బెల్లం కరిగిందాకా. అయ్యాక, తడిగుడ్డని చుట్టు జగ్గుకి. చల్లబడతాయ్ నీళ్లు.

వడపప్పు -
పెసరపప్పు ఒక కప్పుడు.
ఒక గంట నీళ్లలో నానబెట్టిన పెసరపప్పే వడపప్పు. కొందరు దీనికి చిటికెడు ఉప్పు కలుపుతారు. కొందరు కొబ్బరి తురుము ఒక అరచెంచా, కొత్తిమీర ఒక అరచెంచా, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ఒక అరచెంచా, కలుపుతారు. మన ఇష్టం, సౌకర్యం.

ముందుగా వీటిని, ఆ సీతారామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టి, ఓ పట్టుపట్టటమే, భక్తికి భక్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
అదీ కధ.

Monday, March 30, 2009

టమాటా, బేబీమొక్కజొన్న, మొలకెత్తిన సోయా గింజలు

ముందుగా దేంతోనో మొదలుపెట్టా కానీ, మొత్తం పెట్టా. అర్ధంకాలేదా??
మొన్న వారాంతానికి, తను పిల్లలతో సతమతమౌతుంటే, నేను రంగంలోకి దూకా. అసలు ఆలోచన, లేక నా మినిస్టరు యొక్క ఆర్డర్స్, తను ముందుగానే సోయా ఇంకేవో మొలకెత్తిన గింజల్ని ఉడ్కబెట్టింది, వాటితో కూరచెయ్యి అని. మనం మొదలుపెడుతుండగానే ఓ మెరుపు ఆలోచన వచ్చింది. మనోళ్లకి "తరగటం" మీద ఓ డెమో ఇస్తే వీడియో రూపంలో ఆనందిస్తారు కదా అని. ఠడా వెంటనే మన చిన్ని డిజిటల్ కెమెరా తెచ్చి ఎలానో కాఫీ పిల్టర్ మీద నిలబెట్టి మొదలెట్టా. అయితే ఈ వీడియోలో నెర్రేషన్ లేదు. ఆ సమయంలో మాట్టాడితే మావాడు వెంటనే యట్రాక్ట్ అయ్యి, నే తీస్తా వీడియో, నే తీస్తా వీడియో అని లాక్కెళ్లే ప్రమాదం ఉన్నందున, ఇది ఒకరకంగా "పుష్పక విమాణం" సినిమా లాంటిది అనుకోండి. అలా మొదలు పెట్టి, కూర విధి విధానంతో సహా లాగించేసా. అయితే, కొన్ని కొన్ని సాంకేతిక సమస్యలవల్ల నేననుకున్న విధంగా తీయలేకపొయ్యా. ఎలా అంటే, తరిగేటాప్పుడు ఒక కోణంలో పెట్టా కెమేరాని, అయ్యాక పందార డబ్బా మీద పెట్టా, బెమ్మాణంగా వస్తుంది అనుకున్నా, కానీ పందార డబ్బా మోసం చేసింది. భాండీ తప్ప అన్నీ పడ్డాయ్ వీడియోలో.

సరే సంగంతేంటంటే, చెప్పిందేచెప్పరా కాదు కాదు వినరా పాచిపళ్ళ దాసుడా. అనగా, మళ్లీ టమాటా కూరే.
ఐతే ఈ సారి వెరైటీగా -
టమాటా, బేబీమొక్కజొన్న, మొలకెత్తిన సోయా మరియూ ఇంకేదో గింజ. మొన్న మా లోకల్ కూరలషాపుకి వెళ్లినప్పుడు ఈ డబ్బా చూసా, మొలకెత్తిన సోయా+ఇవి. ఏంపర్లేదు కూరచేసి అవతల నూకచ్చు అని తీస్కున్నా.
ఒక మాట - అపరాలు అనగా, పెసలు, కందులు, శనగలు ఇలాంటివి. వీటిల్లో మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తినటం మంచిది. ఇక్కడ మల్టై గ్రైన్స్ ఉన్న బ్రెడ్ అవి ఇవి దొరుకుతుంటాయ్ కూడా. మొలకెత్తినవి ఏవైనా సరే పిరికిడిలో పట్టినన్ని మాత్రమే తినాలి(హి హీ, ఎవ్వని పిరికిడీ అంటున్నావా!! నీదేనోయి నాగన్నా/నాగక్కా) ఎక్కువ తింటే "అతి సర్వత్రా.." తెలుసుగా.
ఈ కూరకి కావాల్సినవి -
టమాటాలు ఎరడు
ఒందు ఉల్లిపాయ
నాల్కు వెల్లుల్లి
నాల్కు మిర్చి
ఏళు బేబీమొక్కజొన్న
ఒందు మొలకెత్తిన ఇత్తనాల డబ్బా
ఒందు కొత్తిమీర కట్ట
నాల్కు చెంచాల నూనె. నేను ఈ మధ్య వంటలకి ఆలివ్ ఆయిల్ నూనె వాడుతున్నా.
ఇక మొదలుపెడదామా!!
ముందుగా ఆ మొలకెత్తిన విత్తనాలని ఉడ్కబెట్టుకో కొంచెం ఉప్పేసి.


పైన వీడియోకి నెర్రేషన్ -

వెల్లుల్లి రెబ్బల్ని కుక్కు, వాటిపై తొక్కలు తియ్యి. ఇక వాటిని సన్నగా తరుగు. పక్కకి పెట్టుకో. తర్వాత, అల్లం తొక్క తీస్కుని, సన్నగా తరుక్కో. అయ్యాక, బేబీమొక్కజొన్నలని నాలుగు భాగాలుగా తరుక్కో. ఇప్పుడు ఉల్లిపాయని నిలువుగా తరిగి, వాటిపైన తొక్కని తీసేసి నిలువుగా సన్నగా తరుగు. అయ్యాక, టమాటాలని శుభ్రంగా కడుక్కుని, సన్నగా తరుక్కో. ప్క్కనబెట్టు.
ఇప్పుడు, భాండీ తీస్కో, పొయ్యిమీదపెట్టు, వెలిగించు, నూనెపొయ్యి. తిరగమాట వెయ్యి. అయ్యాక మిర్చి, అల్లం, వెల్లుల్లి బేబీ మొక్కజొన్న ముక్కలు వేసేయ్, వేగినాక, కొంచెం పసుపు వెయ్యి. అయ్యాక, ఇప్పుడు ఉల్లిపాయలు వెయ్యి. వేయించు.
ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగుకి మారేలోపు, కొత్తిమీర శుభ్రంగా కడుక్కుని, తరుక్కొ. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ లోకి మారినియేమో చూడు. మారితే టమాటాలు వేసేయ్యి, నేనైతే టమాటాలతోపాటు ఓ చెంచా టమాటా ప్యూరీ కూడా వేస్తా.
ఇప్పుడు, ఇందాకటి మొలకెత్తిన గింజలు వాటిని ఉడ్కబెట్టుకున్న నీళ్లతోబాటి వేసేసెయ్. చాలినన్ని నీళ్లు లేకపోటే ఓ అరగ్లాసు నీళ్లు మళ్లీ పోస్కోవచ్చు. ఓ సారి మొత్తం కలియతిప్పి, కావాల్సినంత ఉప్పు, కారం వేసి మూతబెట్టు. ఇందాక ఫైన్లీ ఛాప్ చేసిన కొత్తిమీర జల్లు, ఓ సారి కూరని మళ్లీ తిప్పి మూతపెట్టి సన్నని మంటపై అలా ఓ పావుగంట ఉంచు...
వేడివేడి కూరని లాగించు - అన్నంలో అయినా లేక రొట్టెల్లోకైనా ...

Friday, March 27, 2009

ఉగాది పచ్చడి

బ్రహ్మాండమంతటికీ విరోధీ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఓఉషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది.ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఓఉషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని,ఆయుర్వేదానికి ఆహారానికి గల సంభందాన్ని చెప్పాడమే కాక హిందూ పండుగలకు,ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.
[http://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%97%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF]

ఇంతకీ ఉగాది పచ్చడి ఎలా చెయ్యాలి :-
మంచి నవనవ లాడే మామిడికాయ (ఓ మాదిరి పరిమాణం కలది), ఓ పదిహేను వందల వేపుపుతకాడలు, గోలీ అంత కొత్త చింతపండు, కొత్త బెల్లం, రెండు పచ్చిమిరపకాయలు, ఒక అరటిపండు మరియూ ఉప్పు, నీళ్లు (వంద మిల్లీ లీటర్లు).

తయారీ విధానం:
ముందుగా, వేపపూతని కాడల నుండి వేరు చేస్కుని, పూతలోంచి చిన్న చిన్న అప్పుడప్పుడే బయటకి వస్తున్న వేపకాయల్ని వేరుచేస్కోవాలి. కాబట్టి, ఒక పెద్ద సంచినిండా పూత తెస్తే ఓ దెసెడు నిజమైన పూత వస్తుంది. సరే ఈ పూతని సిద్ధంగా పెట్టుకో.
అయ్యాక, మామిడికాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కో. గోలీ అంత చింతపండులో ఒక ౧౦౦ మిల్లీలీటర్ల నీళ్ళు పోసి నానబెట్టు. ఒక పసినిమిషాల తర్వాత పిసికేసి, పిప్పి పారేసి ఆ చింతపండు గుజ్జుని పక్కనపెట్టుకో. ఇప్పుడు బెల్లాన్ని గుండ్రాయితో బాగా నలిపివెయ్యి. దాన్ని చింతపండు గుజ్జులో కలిపేసేయి. అయ్యక, మిర్చిని సన్నగా తరుక్కో. అరటిపండు తొక్క తీసేసి ద్వారం దగ్గర పడేయ్. బయటకి వెళ్ళేప్పుడు సరదాగా జారిపడొచ్చు. అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా తరిగేస్కో. ఇప్పుడు ఆ చింతపండు, బెల్లం గుజ్జులో మిగతా పదార్ధాలన్ని వేసి ఒక అరస్పూన్ ఉప్పు వేసి కలుపు. లాగించు. అందరికీ పెట్టు. పెట్టి పారిపో లేకపోతే ఇది పచ్చాడా అని నాలుగిస్తారు.

Monday, March 16, 2009

On Demand (TM) పండుమిరపకాయల కారం

బ్లాగ్ మహిళామణులు, బ్లాగ్ వాగ్గేయకారులు, బ్లాగ్ శాస్త్రవేత్తలు, బ్లాగరులు, వాళ్లూ వీళ్లూ అందరూ -
అయ్యా, మరి ఎండా కాలం వచ్చేసింది. పండుమిరపకాయలు నవనవలాడుతూ కళ్లముందు కదులుతున్నాయ్. వాటితో, పఛ్చడి ఎలా చేయాలో చెప్పి మమ్మానందింపజేయి, రంజింపజేయి అని వ్యాఖ్యానించిని పిదప, సదరు వ్యాఖ్యలను శిరోధార్యంగా భావించి, ఆ ఎర్రని పండుమిరపాకయలని ఓ సారి స్వప్నముననే దర్శించుకుని, ఇక మొదలుపెడాదాం అని ఉద్యుక్తుణ్నౌతున్న నాకు, మా మాత దూరవాణిద్వారా, కుమారా, మోర్జంపాడు నుండి కాశయ్య ఇప్పుడే ఓ నాలుగు రధాల నిండా పండుపిరపకాయల పఛ్చడి ఇచ్చి వెళ్లాడు అని తెలియజేసింది. ఈ పఛ్చడి కోసం, మందుకొట్టకుండా, బాగా నీరుపెట్టి కోసిన పండుమిరపకాయలతో, కమ్మటి మామిడల్లం, గండ్ల ఉప్పు, మాంచి చింతపండుతో "రుబ్బింగు వెయ్యబడును" లో వేసి రుబ్బించి అందించి వెళ్లాడు అనే కమ్మని వార్తని విన్న నేను, అహా హతవిధి, ఇది కమ్మని వార్త ఎలా అవుతుంది, ఈ సప్త సముద్రాలు ఎలా ఒక్క దూకులో దాటి, ఇంటిపై వాలి, ఓ చేతితో ఆ సదరు రధాలని, వాటిని లాగుతున్న గుర్రాలనీ దొరకబుచ్చుకుని ఒక్క దూకుతో అమెరికాలో వాలిపోగలను? అని నన్ను నేను ప్రశ్నించుకుని, నోటియందూరిన లాలాజలమును ఇదియే ఆ పదార్ధమూ అని ఊహించుకుని, నాలుగు గుటకలు మింగి నిగ్రహించుకుని ఇలా ఈ ఉత్తరం రాస్తున్నాను.

త్వరలో మీ అందరి కోసం పండుమిరపకాయల కారం !!!
కానీ ముందు -
నైంటీన్ హండ్రెడ్ అండ్ యైటీఫైవ్!! మోర్జంపాడు, ఎ స్మాల్ విల్లేజ్, పికిల్ టేస్టింగ్స్ అర్రేంజ్డ్, ఐ వాంటెడ్ టు సీ ది పికిల్, నాట్ పాసిబుల్. ఓకే ఓకే ఫాదర్ మదర్ మై ఎగ్రీడ్, జార్(1) బిల్డ్. టూ వీక్స్ హ్యాపీ. థర్డ్ వీక్ స్టార్టెడ్ ట్రబుల్. వై? ల్యాంగ్వేజ్ ప్రాబ్లమా, ఎందుకు పండుమిరపకాయల కారం తిందాం అనుకుంటున్నావ్? ఐ కొసెన్, యూ ఆన్సర్.

1 - జార్ = పచ్చళ్ల జాడి

Thursday, March 12, 2009

తాజా వంట! తాజా వంట!! తాజా వంట!!!

ఇదెంటిది, తాజావార్త లా తాజా వంటా అనుకుంటున్నారా?
ఔనండీ! తాజా వంటే. నిన్న ఇంటికెళ్లంగనే మా ఆవిడ గోబి, ఉల్స్, మిర్చ్స్ అన్నీ ముందేసుకుని తరగటానికి "ఉద్యుక్తురాలు" అవుతోంది. ఠడా! వెంటనే మనం రంగంలోకి దూకామ్, "నువ్వు తప్పుకో" అనేసి, కత్తి సుత్తీ అన్నీలాగేస్కుని, గుంజేస్కుని, నరికెయ్యడం మొదలుపెట్టాం.

గియ్యాల గేంద్వయ్యా దావత్ అంటే - గోబీ టమాటా కూర. దీన్ తండ్రి తీ, తీ కలం తీ, కాయితం తీ, రాయి ఏమ్గావాల్నో సప్పుడుజెయ్యకుండా -
ఫూల్ గోబీ - క్యాలీఫ్లవర్
రెండు టమాటాలు - పండువి. పచ్చితెచ్చుకున్నవనుకో, తిరిగి నన్నే అడుగుతవ్, అన్నా పచ్చివితెచ్చిన్నే ఏంజెయ్యాలే. గప్పుడు, బిడ్డా పచ్చి టమాటాతో పచ్చడి రేపు రాస్తలే అని నీకోశం మళ్లీ రాయాలె ఇంకోపోస్టు.
చెటాకు మిర్చి.
నాల్గు వెల్లుల్లి
రెండుగ్రాములు అల్లం.
ఒక గ్రాము మినుములు.
రెండుగ్రాములు పచ్చిశనగపప్పు.
అయిదు కర్వేపాకులు.
ముఫై ఎనిమిది కొత్తిమీర కాడలు.
ఒక ఎండు మిర్చి.
ఒక గ్రాము ఆవాలు.
రెండు గ్రాములు జిలకర.
15.78 మిల్లీలీటర్ల పల్లీ నూనె.
చిటికెడు పసుపు.
ఎనిమిది గ్రాముల కారం.
ముఫై నాలుగు గ్రాముల ఉప్పు, కూరలోకి, ౨౪.౫ ( ఇరవైనాలుగు.అయిదు) గ్రాములు పువ్వుని ఉడ్కబెట్టటానికి.
ఒక మూకుడు, ఒక చట్టి. మూకుడు చట్టి దొరక్కపోతే, ఓ డేగిషా, ఓ సిబ్బిరేకు సిద్ధం చేస్కో.
ఒక గ్యాస్ పొయ్యి.
ఒక అగ్గిపెట్టె.
ఒక అగ్గిపుల్ల.
ఒక గంటె.
ఒక తలకాయ (అఫ్కోర్స్ నీదే)
ఒక మటన్ కొట్టు మస్తాన్ కత్తి. (గమనిక :- కత్తి లేకపోతే కత్తిపీట వాడకూడాదు. కత్తిపీటకీ ఫూల్గోబీకి పడదు)
ఒక పీట. (పైనవన్నీ నరకటానికి)

ముందుగా -
cauliflower ని తెలుగులో ఏమంటారు? కోసుపువ్వు అంటారు. క్యాబేజ్ ని కోసుగడ్డ అంటారు. టామాటాని మావైపు రామ్ములక్కాయ అంటారు. మిగతాప్రాంతాల్లో ఏమంటారో మరి, తెల్వదీ.

సరే -

ముందుగా -
కోసుపువ్వుని కత్తిపెట్టి, ఒక్కోపువ్వుని తరిగేస్కో.
అయ్యాక, ముందు, మిర్చిని సన్నగా ఛాప్, అదేలేగురు హోజాషురూ, తరుక్కో. తర్వాత, అరచేతినిబెట్టి, వెల్లుల్లి రెబ్బల్ని కుక్కు (క్రష్), అప్పుడు వాటిపైన తొక్కతీసేసి సన్నగా ఛాప్ చేసి పక్కన్బెట్. అల్లం, పైన తొక్క తోసేసి, సన్నగా తర్క్స్, పక్కన్బెట్స్.
From tomato_cauli


ఇప్పుడు, ఓ డేగిషాలో నీళ్లు తీస్కో, మరగ్గాయి. మరిగాక పసుపువెయ్యి, ఓ ౨౪.౫ (ఇరవైనాలుగు.అయిదు) గ్రాముల ఉప్పు వెయ్యి. ఇప్పుడు పువ్వుని ఆ మరిగే నీళ్లల్లో వేసి, పొయ్యి ఆర్పివెయ్యి. మూతపెట్స్. ఫైవ్ మినిట్స్ అయ్యాక, డ్రెయిన్ వాటర్. అంటే కోశుపువ్వుని వేడినీళ్లలోనుండి వేరుచేసి, పక్కనబెట్టు అని.
From tomato_cauli

ఉల్లిపాయని సన్నగా తరుక్కో, ఆ రెండు, పేపర్లని దిబ్బలో కొట్టు, ఊప్స్, స్టడీ, ఆ రెండు రామ్ములక్కాయల్ని ఛాప్ చేస్కో. (ఆ రెండు అనంగనే పేపర్లు అనే స్పురిస్తోంది ఈమధ్య)
From tomato_cauli

From tomato_cauli

పొయ్యి వెలిగించు, చట్టి పెట్టు అదే, డేగిషా.
నూనె పొయ్యి. కాగంగనే మినుములు, పచ్చిశనగపప్పు, ఎండు మిర్చి, ఆవాలు, జిలకర, చివరాకరికి కర్వేపాకులు లతో తిరగమాత వేసేయ్. ఓ చెటికెడు పసుపు వెయ్యి. ఇప్పుడు మిర్చి, వెల్లుల్లి వెయ్యి. ఓ సారి బాగా కలుపు. ఇప్పుడు ఉల్స్ వెయ్యి, డీప్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించు.
అయ్యిందా, ఇప్పుడు తరుక్కున్న రాములక్కాయలు వేసేయి. కలుపు లేక గంటే బెట్టి తిప్పు - తిప్పు అంటే త్రిపురసుందరి కాదు, తిప్పు అంటే తిప్పడం. అయ్యాక ఇందాకటి కోశుపువ్వు వేసేయ్, ఉప్పు, కారం వెయ్యి కలియ తిప్పు, మూతెట్టు. గ్రేవీ అంటే నీళ్లు సరిపోను లేవు అనుకుంటే ఓ గళాసు పోస్కో (ఆంటే అవసరాన్ని బట్టి అని)
ఉడకనీ ఇక.
ఉడికినాక, కొత్తిమీర (పైన్లీ వాష్డ్ అండ్ ఛాప్ప్డ్ - శుభ్రంగా కడిగిన మరియూ సన్నగా తరిగిన) జల్లు -
From tomato_cauli

(పైన ఫోటోని అలా చూడకు, అదేంటి కూరా లేక సాంబారా అని, పొరపాటున కొంచెం నీళ్లెక్కువైనై)
చివరాకర్న, లాగించటం మర్చిపోకు.

మీ ఇంట అన్నీ శుభకార్యాలకి, కార్యాలు కరామత్తులకీ క్యాటరింగు చెయ్యబడును-
సంప్రదించండి - నల భీమ. ఒకళ్లే వంట చేస్తారు, ఇంకోకళ్లు సోఫాలో కూర్చుని ఐఫోన్లో గేమ్స్ ఆడుతుంటారు.
From tomato_cauli


కొన్ని మిక్స్డ్ డైలాగులు- నువ్వు సరిగ్గా గమనించావోలేదో (గురుగారు రావ్ గోపాల్ రావ్ గారి స్టైల్ - ఛాలంజ్), మనం వోల్ మొత్తం ఎడంసేతి సంగం పెసినెంటు (మాడా స్టైల్ - ముత్యాలముగ్గు)

Monday, February 16, 2009

కొ.మా (కొబ్బరి - మా...)

అర్ధం అయిపోయిందేం!! ఇట్టే పట్టేసావన్నమాట.
నాకు అత్యంత ఇష్టమైన, చాల రుచికరమైన, చాలా అది అయిన, చాలా ఇది అయిన పచ్చడి - కొబ్బరి పచ్చడి. అందునా సింతపండు బదులు మామిడికాయ వేసిజేస్తే, అహాహా, ఓహోహో!!
రుచి చూడ తరమా,
ఈ పచ్చడి రుచి చూడ త ర మా ఆ ఆ ఆ
రుచి చూడ తరమా!!!!
కావాల్సిందల్లా మంచి కొబ్బరిచిప్ప ఒహటి, పుల్లని మామిడి ఒహటి. ఎక్కడ ఉంటుంది మామిడికాయ?
గున్నమామిడి చెట్టుమీద కాయలు రెండున్నాయి
ఒక కాయ పచ్చనిది ఇంకోటి ఎర్రనిది
పచ్చనిదేమో పుల్లనిదీ
ఎర్రనిదేమో తీయ్యనదీ
గున్నమామిడి చెట్టుమీద కాయలు రెండున్నాయి

సరే, పుణ్యం పురుషార్ధం, గుడికెళ్లి దర్శనం గట్రా సేసేకుని ఓ కొబ్బరికాయకొట్టి ఓ సిప్పతెచ్చుకో. పక్కనోళ్లని అడుగు ఇంకో సిప్పకోసం. సరే. తెచ్చుకున్నావా?
మార్కెట్టుకెళ్లి, ఏటి, మార్కేట్టుకెళ్లి ఓ మాంచి మావిడికాయ, ఏటి, మాంఛి ఆకుపచ్చరంగులోది, అట్టానే ఓ కట్ట కొత్తిమీర, ఓ అరడజను పచ్చిమిరపకాయలు పట్రా (అరడజను మిర్చీ కుమ్ము గురూ అని అడిగావనుకో - ఏటీ కొత్తా అంటాడు - ఓ వందగ్రావుల్తెచ్చుకో)
ఆ మట్టన్ కొట్టు మస్తాన్ కత్తి ఉందిగా, దాంతో కొబ్బరిసిప్పని ఇరగ్గొట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కో కొబ్బరిని. ఓ నాలుగు ముక్కలూ, ఓ బెల్లం గడ్డ నోట్టో కుమ్ముకో, ఏంపర్లేదు. కొబ్బరి సాలకపోతే మన గుడి ఉండనే ఉందిగా. పూజారికి కన్నుకొట్టి, ఓ నవ్వేస్కో సిప్పసేతిలో పెట్టేస్తాడు. ఏంపర్లేదు.

అయ్యాక, మావిడికాయని సన్నటి ముక్కలుగా కోసేస్కో. ఓ నాలుగు ముక్కలు, పులుపుజూట్టానికి నోట్టో ఏస్కో, లేక ఉప్పుకారం అద్దుకుని రుచి చూడు. కాయ అయిపోయిందా, ఇంకోటి తెచ్చుకో. ఏటిసేత్తాం, కలికాలం, రుసిసూట్టానికే ఓ కాయ అయిపోతే ఎలారా రాంసోవి.(శ్రీవారి శోభనం సినిమాలో హీరోవిన్ను బామ్మ గుర్తుకొచ్చింది. పెళ్లి చూపులకి గారెలు చేస్తుంది ఆమె. పెళ్లివాళ్లు వస్తారు. గారెలు పట్రా అంటాడు పెళ్లికూతురి తండ్రి. వంటగదిలోకెళ్లేసరికీ గారెల గిన్నెలో ఒకే గారె ఉంటుంది. ఇదేందిదీ అంటే, రుచి చూద్దామని నోట్టో ఏస్కున్నా, ఇట్టే కరిగిపొయ్యినయ్యి అని ఆమె సిగ్గుపడుతూ చెప్తుంది - జంధ్యాలకి ఓ సారి జై)
ఇప్పుడు, ఓ అరడజను పచ్చి మిర్చీ, ఓ అరడజను ఎండుమిర్చీ, ఓ నాలుగు మెంతులు, ఓ నాలుగు జీలకర్రలు పక్కనెట్టుకుని, భాండీ ఎట్టి, సెంచాడు నూనెబోసి, ఏడి కాంగనే ఆ జీలకర్రలు, మెంతులూ ఎండుమిర్చీ ఏసి, సిటపటలాడంగనే పచ్చిమిర్చీ ఏసేసి ఏయించు. పక్కనెట్టుకో.
ఇప్పుడు ఆ కొబ్బరి ముక్కల్ని మావిడికాయ ముక్కల్ని రుబ్బింగు వేయబడునులో వెయ్యి. రుబ్బింగు కాంగనే, నీక్కావాల్సినంత ఉప్పు ఏస్కుని, ఈ ఏపిన మిర్చి గట్రా దాంట్లో ఏసి, మళ్లీ ఓ పాలి రుబ్బింగు వెయ్యి. బాగామెదిగిందాకా రుబ్బింగు ఏసేస్కుని, అయ్యాక, భాఘా ఇంగువదట్టించి తిరగమాత వేసి, శుభ్రంగా నాయనా, శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కున్న కొత్తిమీర తగిలించి లాగించునాయనా..

ఆ పాతరోజులు: ఒకానొక కాలంలో కొబ్బరి తురమటానికి ఓ ప్రత్యేక పరికరం ఉండేది. దాని పేరే కొబ్బరి తురుం. దానికో పీట, పైన ఓ ఇరుసు, ఓ వైపు ఓ ఎళ్ మార్కు తిప్పేది, ఇటువైపు పళ్ల గుత్తి. చిప్పని ఆ గుత్తికెపెట్టి ఇటు ఎల్ మార్కుని తిప్పుతుంటే ఆ పళ్ళు కొబ్బరిని తురుముతై. అసలు సంగతేంటాంటే ఆ తురుముతో వచ్చిన రుచి. మేబీ, ఆ కొబ్బరి పాలు తురుముతోబాటే ఉండటామో మరేదో. ఆ తురుము అప్పటికప్పుడు ఓ చెంచాడు పందారతో లాగిస్తే - నోరూరుతోంది, వెళ్లి ఓ లోటా నీళ్లు గొంతులోపోస్కొస్తా!!!

Monday, February 9, 2009

మినప పచ్చడి

మీకు తెలుసా మినప పచ్చడి చేస్కోవచ్చనీ?

ఇదో కమ్మని పచ్చడి. ఈ పచ్చడి చెయ్యటానికి తపనిసరిగా మిక్సీ లేక రోలు ఉండాలి.

కావాల్సిన పదార్ధాలు: మినుములు లేక మినప్పప్పు, ఎండు మిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి.
మినుములు లేక మినప్పప్పు: ఎలాంటివి? పొట్టు మినప్పప్పు అంటారు. అవీ!!

ముందుగా, మినప్పప్పుని వేయించి పక్కనబెట్టుకోవాలి. ఎలా? భాండీ పెట్టి, భాండీ వేడయ్యాక మినప్పప్పు వేసి వేపటమే.
From వంట

అయ్యాక, ఒక అరగ్లాసు నీళ్లలో ఓ పెద్ద గోలీ అంత చింతపండు నానబెట్టుకో. అలా అది నానుతూ ఉండనీ.
ఇప్పుడు, మళ్లీ భాండీ పెట్టు, ఓ రెండు చెంచాలు నూనె పొయ్యి. వేడి అయ్యాక, ఓ పావు గుప్పెడు "జీల్కర", ఓ ఎనిమిది మెంతులు వెయ్యి నూనెలో, వేగంగనే ఓ 10/15 తొడిమలు తీసిన ఏండుమిరపగాయలు వెయ్యి, వేపు, అయ్యాక ఓ సిబ్బిరేకులో పోస్కో, లేకపోతే ఆ కోరుతో భయపడి మీ చుట్టుపక్కనోళ్లు అగ్నిమాపక యంత్రాన్ని పిలుస్తారు.
From వంట

ఇందాక చింతపండు నానబెట్టుకున్నావుగా, దాన్ని బాగా చెయ్యిపెట్టి పిసికి, చింతపండు పిప్పి తీసేయ్యి.
ఇప్పుడు, ఈ ఎండుమిరపగాయలు, మిన్పప్పప్పు, చింతపండు గుజ్జు, ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బింగు వెయ్యి. అయ్యాక ఓ చెంచాడు ఉప్పువేసి మళ్లీ రుబ్బింగు వెయ్యి.
From వంట


రుబ్బింగు వెయ్యగా వచ్చిన పచ్చడినే మినపప్పు పచ్చడి అంటారు. ఇక లాగించు.

అదీ కధ

Thursday, January 22, 2009

పొపెప

ఈ సారి మంచి రంజైన వంట చేద్దాం. దీనిపేరు పొపెప.

ఇంతకీ పొపెప అంటే ఏంటి అనుకుంటున్నారా?
పొ.పె.ప = పొట్లకాయ పెరుగు పచ్చడి.

దీన్ని చెయ్యటానికి కావాల్సింది పొట్లకాయ, పెరుగు మరియూ పచ్చడి(??ఏం పచ్చడి అనకూ, సదువ్)!!!

ఎట్లాంటి పొట్లకాయ? నవనవలాడుతుండాలి. ఇక్కడ బొమ్మలో పెట్టిన లాంటివి బాగుండవు.
From వంట
కానీ మాకు ఇవే దొరుకుతాయి కాబట్టి సరిపెట్టుకున్నాం.
ఇంకా, పెరుగు, మిర్చి, కొత్తిమీర, అల్లం, తిరగమాత గింజలు,మరియూ మెంతులు.
From వంట

ముందుగా పొట్లకాయల్ని శుభ్రంగా కడుక్కో, చిన్న చిన్న ముక్కల్ గా నరిక్కో ఇక్కడ కింద జూపెట్టినట్టుగా:
From వంట

ఇలా నరికేసిన ముక్కల మీన ఉప్పేసి బాగా కలిపి కొంచెంసేపు పక్కనబెట్టు (1). ఈలోపల, ఓ భాండీ తీస్కో, నూనె ఓ రెండు చెంచాలు పొయ్, తిర్గమాత వేస్కో. తిరగమాత చిట్పట్ లాడుతున్నప్పుడు, ఉప్పేసిపిసికి పెట్టిన పొట్లకాయ ముక్కల్ని చేతినిండా తీస్కో, ఘట్టిగా పిండు, తిర్గమాతలో వెయ్, అట్లా మొత్తం ముక్కలు చేతిలోకి తీస్కొనుడు, పిండుడూ ఏసుడు ఇట్టా:
From వంట

అయ్యాక ఓ సారి మొత్తం కలిపేసి మూతపెట్టు (2).
ఇప్పుడు ఓ చిన్న చిప్ప గంటె తీస్కో మెంతులు వేపు, వేపరా చిన్నా మాడ్చకు, బంగారం బ్రౌను రంగుదాకా (నీకో సీక్రెటు రహస్యం, మెంతులు వేపక ముందుకూడా అదే రంగులో ఉంటాయ్). మిర్చీ, కొత్తిమీర, అల్లం, ఈ వేపిన మెంతులు మొత్తం ఓ సారి రుబ్బు (దీన్ని ఓ పెద్ద గిన్నెలో వేసి రుబ్బింగు వెయ్యబడును దెగ్గరకి వెళ్లావనుకో ఆడు నవ్వుతాడు, కాబట్టి ఇంటోనే వేస్కో). రుబ్బటానికి మిక్సీ లేకపోతే ఎలా? ఇలా చెయ్యి. మిరగాయల్ని సన్నగా తరుగు, అల్లం కూడా, కొత్తిమీరనికూడా (కొత్తిమీర ని కడగటం మర్చిపోకు) చాలా సన్నగా తరుక్కో. ముందు మెంతుల్ని కూరగాయల్ని నరికే చెక్కమీద చిప్ప-గంటె తో బాగా నలుపు. అయ్యాక మిర్చి మిగతావి వేసి నలపటాం మొదలుపెట్టు - ఠడా!! లేకపోతే, చపాతీకఱ్ఱతో చెయ్యోచ్చు ఈ పని. సరే ఎలానో ఓలా తిప్పలుపడు, ఈ ముద్దని రెడీజేస్కో. ఈలోపల పొట్లకాయ మాడిందేమో జూస్కో. మాడకుండా ఉంటే, ముందు ఈ ముద్దని పెరుగులో వేస్కో, తర్వాత ఆ పొట్లకాయ కూరని వెయ్యి, ఓ సారి కలుపు. ఇక లాగించు.
From వంట


1. పొట్లకాయ, దొండకాయ ఇలాంటివాటిని ముందుగా ఉప్పులో నానబెట్టుకోవాలి
2. ఈ కూరలు మూతబెట్టకపోతే ఉడకవు. చలా మంది మూతబెట్టి పైన నీళ్లు కూడా పోస్తారట.
టిప్పు: పెరుగు ఎంత ఫ్రెష్ అయితే అంత రుచి.
త్వరలో పొపెప పాడ్కాస్ట్ మీరు ఊహించని రీతిలో :):)

Thursday, January 8, 2009

ఈహూ!!! ఠరడం డం డం!!!

ఢం ఢం ఢం ఢంకచిక్కర ఢం ఢం ఢం ఢంకచిక్క ఢం ఢం ఢం ఢంకచిక్కర
ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయుట ఏమనగా
నలభీమ పాడ్కాస్టుని యాపిల్ గాడు ఆమోదించాడహో!!!
ఇకపై వెలువడే ప్రతీ వంటకం, బ్లాగులో, మరియూ, పాడ్కాస్ట్ రూపంలో మీ ఐట్యూన్స్లోకి దింపేస్కోవచ్చని తెలియజేయ్యటానికి నలుడు, భీముడు ఇద్దరూ చాలా ఆనందిస్తున్నారహో!!!
మీరు నలభీమ పాడ్కాస్ట్కి సబ్బుస్రైబు చేస్కోవాలనుకుంటె ఇక్కడ నొక్కోచ్చహో!!
ఢం ఢం ఢం ఢం!!!!!!!!