Monday, June 8, 2009

గోంగోర రోటి పచ్చడి.

మొత్తానికి మా దేశీ కొట్టోడు గోంగోర మహా వృక్షాలని తెచ్చాడు మొన్న. సూడంగనే పాణం గిలగిల్లాడి, ఓ నాలుగు డాలర్లు పోతే పోనీ దీనెక్క గోంగోర తిన్ని బతుకెందుకు అనేసి, ఓ నాలుగు వృక్షాలను లారీకేసి తోలకొచ్చా. ఆదివారం, కుంపటెట్టి గోంగోర పప్పు తవండుకోవాలని ముందు ప్రణాళికేస్కున్నా, సమయాభావం పిల్లల డిమ్యాండ్ల వల్ల పప్పుగిన్నె కుంపట్లోంచి మామూలు పొయ్యిమీదకి మారింది. పప్పులో ఎయ్యంగా మరో రెండు వృక్షాలు మిగిల్నై. ఏటిసేయ్యాల్రా బగమంతుడా అంది మావిడ పిల్లని సంకనేస్కుని. వెనువెంటనే, పచ్చడి నూరూ అని నోట్ళోంచి, మన ప్రమేయంలేకుండా జాలువార్చింది నాలుక ఇంత నీళ్ళు నోట్లో ఊర్చుకుంటూ. అటులనే మాహారాజా అనేసి ఆ ప్రాణి రోలు కడగటం మొదలెట్టింది (రోలు అనగా గ్రైండరు)
ఇంతక మునుపు జరిగిన గోగుల యుద్ధంలో నే చెప్పినట్టుగా, గోంగోరతో పచ్చళ్ళు రకరకాలు.
సరే గోంగోరతో చేసే ఈ పచ్చడికి కావాల్సింది, నేను తెచ్చినట్టుగా గోంగోర మహా వృక్షాలు కాదు. ఏక్ దం ఫ్రెష్, నవనవ లాడే గోంగోర మరియూ, అప్పటికప్పుడు కోస్కొచ్చిన పచ్చిమిరగాయలు. ఓర్నీఇంట వాన కురవా, యాడ దొరకతన్నాయ్ ఇయ్యాల్రేపు "ప్రెష్" సరుకు అని అనుకోవచ్చు అందరూ, అబ్బా చోద్యం అనుకోనూ వచ్చు. అలాంటి ఆకుతో మిరగాయల్తో సేత్తే ఆ రుచే ఏరు అని నా అర్ధం.
సరే, ఓ కట్ట గోంగోర, ఓ అరడజను మిర్చి, రెండు ఎండు మిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, అరచెంచా మెంతులు, తిరగమాత సామాన్లు, ఓ చెంచా నూనె.
ముందుగా గోంగూర. మిరగాయలు ఉడకబెట్టి పక్కనెట్టుకోవల. అయినాక,
భాండీ ఎట్టి తిరగమాత ఏసేసి, దాంట్లోనే మెంతులేసేసి, చిట్పట్ అన్నాక ఎల్లుల్లి ఏసేసి ఏపాల. అయినాక ఆ ఉడకబెట్టిన గోంగోర, మిరగాయల్ని ఇందలో ఏసేసి ఓ సారి ఏయించి (నీళ్ళు ఉంటే అయి ఇంకిపోయిందాక పొయ్యిమీనే ఉంచాల), ఉప్పు ఏసేసి, రోట్లో ఏసుడు, నూరుడు. అంతమెత్తగా ఉండాల్సినపన్లా. కచ్చాపచ్చీగా ఉండా పర్లా.

దీనికి కీ - మిర్చీ, గోంగోర ఆటి వాసన్ని కోల్పోకుండా చూడాల. కాబట్టి మోడరేట్ గా వేయించుకోండా.
ఈ పచ్చడి ఎక్కువకాలం ఉండదు. కేవలం రెండు మూడ్రోజులు మాత్రమే.

ఇక దీంట్లో ఎన్ని కేలరీలు ఉంటాయో నాకు పెద్ద తెలియదు. కానీ బలమైన ఆహారమే. కారణం దీంట్లో కేవలం ఒక స్పూను నూనె, రుచుకి ఉప్పు, మిగతావి ఆరోగ్యకరమైనవే. గోంగోరలో ఇనుము అధికశాతం ఉంటుంది.

నేను ఈ రోజు రాగిజావలో దీన్నేస్కుని ఓ కుమ్ముడు కుమ్మాను.
మీరూ ఆనందించండి.

[సర్లే బాసూ అంతా బాగనే ఉంది, మరీ ఏంది అంత కొంచెం అయ్యింది పచ్చడీ అనుకుంటున్నారా? రుసి సూద్దాం అని నోట్టో ఏస్కున్నామయ్యా, ఏందంట, సగం అయిపోయింది :):)]

Friday, May 22, 2009

పళ్ళెం పద్ధతి - ఒక వివరణ

ఈ మధ్య నేను ప్రచురించిన గోధుమరవ్వ ఉప్మా పోస్టుకి మన బ్లాగ్ సోదరుడు "నెమలికన్ను" మురళి, మధుమేహ వ్యాధి గ్రస్తులు తినగలిగే కొత్త రకం వంటల గురించి రాయమని సూచించారు.
ఆ దిశగా ఈ ప్ర్రయత్నం, పోస్టు.
మధుమేహ వ్యాధిక్రస్తులకి చాలా అపోహలు, చాలా అపనమ్మకాలు, భయాలు అవీ ఇవీ ఉంటాయి. ఏది తినొచ్చు, ఏది తినకూడదూ. హమ్మో అది తింటె ఎలా, ఇది తింటే ఎలా...లాంటి ఎన్నో అలోచనలతో భయపడుతూ ఉంటారు.

గూగుల్లో గెలుకుతూ ఉంటే ఈ క్రింది సమాచారం తగిలింది. ఉపయోగపడుతుందీ జనాలకి అని ఇక్కడ పెడుతున్నా.
ప్లేట్ మెథడ్ - అనగా పళ్ళెం పద్ధతి -
అంటె భోజనంలో ఏమి తినొచ్చు అని.
ఈ క్రింది బొమ్మని చూడండి.


ఇది మీరు భోజనం చేసే పళ్లెం అనుకుందాం. పళ్ళెం అంటే, అర్ధవంతంగా ఉన్న సైజులో అని. పళ్లెం అనగా స్థాభాళం కాదు.
ఇప్పుడు, ఆ పళ్ళాన్ని, పైన చెప్పిన విధంగా మూడు భాగాలు చేస్కోండి. అంటే రంపం తెచ్చి కోస్కోండి అనికాదు, మూడు భాగాలు చేసాం అని ఊహించుకోండి. అనగా, ముందుగా, అడ్డంగా ఒక గీత గీయండి. పళ్ళెం రెండు భగాలయ్యింది. ఇప్పుడు కింది భాగంలో నిలువుగా ఒక గీత గీయండి.
ఇప్పుడు పైన ఉన్న సగభాగం అనగా సింహ భాగం NS పదార్ధాలు, మిగతా దాంట్లో ఒక సగం S పదార్ధాలు, మిగతా P పదార్ధాలు తినాలి. దీంతో పాటు తక్కువ లేక అస్సలు కొవ్వు లేని పాలు ఒక కప్పు, పండ్ల ముక్కలు ఒక కప్పు తీస్కోవాలి.
NS పదార్ధాలు అనగానేమీ?
NS = నాన్ స్టార్చీ అని. గంజి లేని పదార్ధాలు. ఉదాహరణకి
పాలకూర, క్యారెట్లు, లెట్యూస్, గ్రీన్స్, కోసుగడ్డ, బోక్చోయ్ (చీనా కోసుగడ్డ అంటారు)
గ్రీన్ బీన్స్, బ్రొక్కొలి, కోసుపువ్వు, రామ్ములక్కాయ
పండ్ల రసాలు, సల్సా, ఉల్లి, దోసకాయ, బీట్రూట్, బెండ
పుట్టగొడుగులు, మిర్చి, టర్నిప్ (ముల్లంగి లాంటిది)
S పదార్ధాలు అనగానేమీ?
S = స్టార్చీ అని. అనగా గంజిగల పదార్ధాలు. ఉదాహరణకి -
ముడి ధాన్యాలు లేక వాటి ఉత్పత్తులు - హోల్ వీట్ బబ్రెడ్డు.
ఎక్కువ పీచుగల పదార్ధాలు - అనగా తృణధాన్యాలు.
ఓట్మీల్, గ్రిట్స్(thick maize-based porridge), హోమిన్య్ లేక క్రీం ఆఫ్ వీట్.
వరి, పాస్తా (హోల్ గరిన్ పాస్తా) , రొట్టెలు,
మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి,
ఉడకబెట్టిన బీన్స్ - సోయా బీన్స్, బఠాణి, కిడ్నీ బీన్స్, లెంటిల్స్, పుల్లశనగ, ఇత్యాదివి.

ఇక P పదార్ధాలు -
మాంసాహారం లేక ఎక్కువ ప్రొటీను గల శాకాహారం.

మధుమేహ ఆహార పిరమిడ్

అలానే కొన్ని ఉపయోగపడే తీగలు -
https://www.diabetes.org/food-nutrition-lifestyle/nutrition/meal-planning/create-your-plate.jsp

కాబట్టి ఏమి తిన్నా, సరైన రీతిలో తినాలి అనేది పాయింటు. పళ్ళు తినకూడదా? మామిడి పండు తినకూడదా? తినొచ్చు. ఎంత అనేది ప్రశ్న.
ఇలా ఎప్పుడైనా మంచి సమాచారమ్ దొరికితే ఇక్కడ పెడుతుంటా.

Monday, April 27, 2009

దోసకాయ పప్పు - కుంపటి

మాష్టారూ మీరు మరీను. దోసకాయ పప్పుకి ఒక పోస్టా అనొచ్చు. కానీ రాయాలనిపించింది. పంచుకోవాలనిపించింది.
హఖహ!! (గొంతు సవరణ)
ఇంతకీ కధ ఏమనగా
మాకూ స్ప్రింగు వచ్చిందీ, మేమూ ధైర్నంగా ఇంటోంచి బయటికి వస్తున్నం, హీటర్లు గట్ర ఆపేసినం. మా దేశీ కొట్టోడు దోస్కాయలు దెచ్చిండు. వండుకున్నం. ఏముందీ గురూ అంటావా? కుంపటిమీన వండినం. :):)
From దోసకాయ పప్పు

మరీ పైన బొమ్మలో ఉన్నంత తాజా మాల్ కాదుగానీ పర్లేదు, ఓ మోస్తరి తాజా దోసకాయలు తెచ్చాడు మావాడు.
సరే మొన్న ఇరవై ఐదు కి వచ్చింది వేడి. బిలబిల మంటూ జనాలు బయటకి వచ్చేసారు. నేనూ ఇక కుంపటి వెలిగిద్దాం అని మొదలిబెట్టా.
ముందుగా దోసకాయ పప్పు చెయ్యటానికి కావాల్సిన వస్తువులు -
దోసకాయ.
మిర్చి కొన్ని.
కర్వేపాకు.
కందిపప్పు.
ఉప్పు గట్ర........

ముందుగా దోసకాయకి చెక్కుతీసి సన్నని ముక్కలుగా తరుక్కోవాలి.
From దోసకాయ పప్పు


కుంపటి రా చెయ్యి. అనగా, బొగ్గులు కుంపట్లో వేసి, కిరసనాయిలు పోసి, వెలిగించి సిద్ధం చేస్కో.
ఇప్పుడు ఒక గిన్నెలో కందిపప్పు ఓ గిద్దెడు, పోసి ఒకసారి కడిగి, ఒకటికి రెండు చొప్పున నీళ్ళు పోసి కొంచెం పసుపువేసి కుంపటి మీద పెట్టు. మూతపెట్టు. కొంచెంసేపయ్యాక పొంగొస్తుంది పప్పు, మూతని ఓరగా పెట్టు ఇక ఉడకనీ
From దోసకాయ పప్పు

కందిపప్పు ఒక గింజ ఒత్తిచూడు, మెత్తగా నలిగిందీ అన్నప్పుడు దోసకాయ, మిర్చి, కర్వేపాకు వేసేయ్. మూతపెట్టు.
From దోసకాయ పప్పు

బాగా ఉడకనీ ఇక. అప్పుడప్పుడూ నీళ్ళు ఉన్నాయో లేదో చూస్తుండూ. నీళ్ళు తగ్గితో ఓ అరగ్లాసు పొయ్యి. ఏంకాదు.
From దోసకాయ పప్పు

అప్పుడప్పుడూ మూత తీసి చూస్తుండూ ఏంటీ పరీస్తితీ అని.
ఇక దోసకాయ ముక్క ఉడికిందీ అన్నప్పుడు ఉప్పూ కారం వేసేయ్.
From దోసకాయ పప్పు

ఓ సారి మొత్తం కలియతిప్పి, తిరగమాత వేసి, కొంచెం కొత్తిమీర జల్లు.
From దోసకాయ పప్పు

ఓ సారి మొత్తం కలిపి, దింపెయ్.
దింపినాక, ఓ నిమ్మకాయ పిండు.
వేడి వేడి దోశకాయ పప్పు నెయ్యితో కుమ్ము.
కొంతమంది నిమ్మకాయ బదులు చింతపండు వాడతారు. నాకు మిమ్మకాయ నచ్చుతుంది. కొంతమంది కారం బదులు మిర్చి పేస్ట్ వాడతారు అనగా ఓ నాలుగు మిర్చిని గ్రైండ్ చేసి కుమ్మటమే. ఐతే మిర్చీ పేస్ట్ వేస్తే అది పచ్చివాసన పొయ్యేదాకా ఉడకనివ్వాలి.

కాంబినేష్నన్స్ తెల్సుకో - పప్పులో పచ్చడి కలుపుకుని తినే అలవాటు ఉంటే, దోసకాయ పప్పులోకి సరైన కాంబినేషన్ కొత్త ఆవకాయ.
కుమ్ము ఇక.

మా దేశి కొట్టోడు ఎల్.బికి మూడు డాలర్లు నూకాడు.
నాకు బాగా గుర్తు, మా ఊళ్ళో, దోసకాయలు ఎలా అమ్ముతారూ అంటే, ఎద్దుల బండ్లకి ముందున్న జల్లలో దోసకాయలు తెచ్చి ఊళ్ళో ఒకచోట ఆపుతారు. ఊరి ఎట్టోడు తప్పెట తో వస్తాడు, రచ్చబండాకాడాకి దోస్కాయల బండ్లొచ్చినై. ఎత్తు రూపాయ అని. ఎత్తు అనగా మూడు కిలోలు. జనాలు ఎళ్ళి మూడో నాలుగో ఎత్తులు తెచ్చుకుంటారు. రాళ్ళలా ఉండేవి ఆ దోసకాయలు. పెద్దపెద్దవి. వెతికి చూద్దాం అన్నా కుక్కమూతులు ఉండేవి కావు. పప్పు, కూర, పచ్చడి, చారు, పులుసు వీటిల్లోనే కాకుండా దోసకాయని నిలువునా కోసి ఉప్పు కారం అద్దుకుతింటే మహా రుచిగా ఉంటుంది. ఐతే దోసకాయ తిన్న పొట్ట దొంగలుపడిన ఇంటితో సమానం. మా ఊరిబయట ఎక్కడ చూసినా దోసకయ చెట్లే.
బళ్ళో నెలకోసారి బోర్డు క్లీనింగు కార్యక్రమం. దానికి బడికి ఎళ్ళేప్పుడే చొక్కా నిండా ఈ దోసాకు నింపుకుని, బడికెళ్ళినాక దులిపి, దోసాకూ బొగ్గు బాగా నూరి బోర్డుకి పట్టిస్తే, భలే వొచ్చేవి బోర్డులు.

Friday, April 24, 2009

పాస్తా రివిజిటెడ్ బొమ్మలు సెలనసిత్రాలతో

ఇయ్యాల మా ఇంటో పాస్తా చేస్కున్నం.
దాని ఇది ఇదానం ఈడాబెడతన్నా, బొమ్మలు, సెలన సిత్రాలతో.
ఇంతకముందరే జెప్పా, పాస్తా వీజీ అని.
ఇయిగో ఇయ్యి కావాల ముందు.
From పాస్తా

సన్నంగ అన్నీ తరుక్కునే లోపు,
పాస్తాని ఏడినీళ్ళల్లో ఎయ్యాల
From పాస్తా

ఈ లోపల, ఎర్రయి, ఆకుపచ్చయ్యి, పసుప్పచ్చయి బెంగుళూరు మిరగాయలు, ఉల్లిపాయలు, మిర్చి, అల్లం, వెల్లుల్లి, రాములక్కాయ అన్ని తరుక్కుని పక్కనెట్టుకోవాల.
From పాస్తా

ఇంక, ఆ ఉడుకుతున్న పాస్తాలో ఓ చెంచా ఉప్పు, ఓ చెంచా నూనె ఎయ్యాల
From పాస్తా

అయి ఉడికినాక, ఆటిని వడపోసి ఓ సారి సల్లనీళ్ళకింద పెట్టాల.
భాండీ పెట్టి ఓ ఐదు సెంచాల నూనె పొయ్యాల. నూనె కాగంగనే, మిర్చి, వెల్లుల్లి, అల్లం ఏసి ఏపాల, ఏగినాక ఉల్లిపాయలు నూకాల.
From పాస్తా

ఉల్లిపాయలు ఏగినాక, బెంగుళూరు మిర్చి ఎయ్యాల, మళ్ళీ ఏపాల
From పాస్తా

ఇయ్యీ ఏగినాక, రాములక్కాయలు ఏసి, రామ్ములక్కాయ గుజ్జు ఓ నాలుగు సెంసాలు ఏసి ఏపాల. ఓ సెంసా ఉప్పేసి రామ్ములక్కాయలు ఉడికినయి అన్నాక పాస్తా ఏసి బాగా తిప్పాల.
From పాస్తా

మద్దెలో రాములక్కాయ గుజ్జు సాలకపోతే ఇంకొంచెం ఎయ్యాల.
అయినాక, కొత్తిమీర ఎసేసి ఓ సారి తిప్పేసి
From పాస్తా

పొయ్యి ఆపేసి, నిమ్మకాయ పిండాల.

ఇప్పుడు ఏడి ఏడిగా లాగించాల.
అదీ కత.

Monday, April 13, 2009

గోధుమరవ్వ ఉప్మా

చాలా సందర్భాలలో అనగా పెళ్ళిళ్లకీ పేరంటాలకీ ఇలాంటి అన్నీ కార్యాలకి ముంబాయిరవ్వ (బొంబాయి పేరు మార్చటమైనది) ఉప్మా చేస్తుంటారు.
అలానే ఇంట్లో కూడా చాలామంది ముంబాయి రవ్వ ఉప్మా నే చేస్కుంటుంటారు. గోధుమరవ్వ ఉప్మా సరైన పద్ధతిలో చేస్కుంటే చాలా రుచిగా ఉంటుంది మరియూ ఆరోగ్యం కూడా.
కావాల్సిన పదార్ధాలు -
గోధుమరవ్వ. ఇక్కడ దీన్ని బ్రోకెన్ వీట్ అంటారు.
From ఉప్మా

మన ఊళ్ళో బన్సీ గోధుమరవ్వ దొరుకుతుంది, దాని రుచి అత్భుతం.
సరే, ఇంకా ఒక ఉల్లిపాయ, నాలుగు మిర్చి, ఓ గుప్పెడు వేరుశనగలు, నాలుగు రెబ్బలు కర్వేపాకు, ఒక క్యారెట్టు, ఒక బంగాళదుంప, ఒక పది-పదిహేను గ్రాముల అల్లం ముక్క. తిరగమాత గింజలు, ఓ నాలుగు చంచాల నూనె.
పద్దతి -
ముందుగా మిర్చి, అల్లం, ఉల్లిపాయ, క్యారెట్టు, బంగాళదుంప తరుక్కో ఇలా
From ఉప్మా

అయ్యక, భాండీ పెట్టి నూనె పోసి కాగంగనే తిరగమాత గింజలతోపాటు పల్లీ వేసి వేగాక కర్వేపాకు వేసి చిట్పట్ మన్నాక తరుక్కున్న మిర్చీ, అల్లం వేసేయ్. వేగినాక ఉల్లిపాయలు వెయ్యి. ఉల్లి గోల్డెన్ బ్రౌన్ కి రాంగనే
From ఉప్మా

ఇందాక తరుక్కున్న క్యారెట్టు, బంగాళదుంప వేసేయ్. వేగనీ.
ఈలోపల ఓ నాలుగు గిద్దెల నీళ్లు సిద్ధం చేస్కో. దుంప, క్యారెట్టు వేగంగనే ఈ నీళ్లు పోసెయ్యి ఆ భాండీలో.
నాలుగు గిద్దెలు ఏమిలెక్క? లెక్కేంటంటే, ఒకటికి రెండు. అనగా ఒక పార్టు రవ్వ ఉడకటనికి రెండు పార్టుల నీరు అవసరం. కాబట్టి రెండు గిద్దెల రవ్వ కొల్చుకుని పక్కన సిద్ధంగా పెట్టుకో.
భాండీలోని నీళ్లు తెర్లుతున్నప్పుడు ఒక చెంచాడు ఉప్పేసేయ్.
From ఉప్మా

ఇప్పుడు ఆ తెర్లుతున్న నీళ్లలో ఇందాక సిద్ధంగా పెట్టుకున్న రవ్వని నెమ్మదిగా పోస్తూ కలతిప్పుతూ పూర్తిగా పేసేసాక మొత్తం ఓ సారి కలిపేసి మూతపెట్టి, తక్కువమంటపై ఉంచు. ఉడకనీ.
ఓ ఐదు నిమిషాలకి మూతతీసి చూడు ఉడికిందేమో.
From ఉప్మా


ఉడికే ఉంటుంది. మంట ఆపేసి ఆరగించు.
నేను చేసినదాంట్లో కొంచెం నీళ్లు తక్కువ అయినై మరియూ కొంచెం లవణం తగ్గింది.
గమనిక -
౧. గోధుమరవ్వ మధుమేహ వ్యాధిగ్రస్తులకి చాలా మంచిది. వారికే కాకుండ ఎవ్వరికైనా మంచిదే మరియూ తొందరగా జీర్ణం అవుతుంది కూడా.

Wednesday, April 8, 2009

కోసుగడ్డ ఇగురు

ఇది సెయ్యటానికి కావాల్సినవి
ఓమాదిరి సైజు కోసుగడ్డ ఒకటి.
ఓ నాలుగు పచ్చిమిరపకాయలు.
ఐదురూపాయల నాణెం అంత అల్లం.
ముఫైఎనిమిది.నాలుగు గ్రాముల ఆవుదం సమించండి గుర్గారు నూనె.
తిరగమాత గింజలు.
మరియూ ఇంగువ.
ఓ చెంచా ఉప్పు.
ఓ అరచెంచా కారం.
ఈ విధానం బెంగళూరు పద్దతి.
ఏటయ్యా అంటే -
ముందుగా మిరిచి నిలువునా చేరేసి పక్కనెట్టు.
అల్లం సిన్న సిన్న ముక్కలుగా తరుక్కో పక్కనెట్టేయ్.
ఇప్పుడు కూసుగడ్డని సన్నగా తరిగేస్కో.

భాండీ ఎట్టు. నూనెపొయ్యి, వేడెక్కినాక తిరగమాత వెయ్యి. చిట్పట్ అన్నాక ఇంగువ వెయ్యి. అయ్యాక పసుపు చిటికెడు వేసేయ్. తిరగమాత మాడకముందే అల్లం మిర్చి వేసేయ్యి. వేయించు. ఓ నిమిషం అయ్యాక తరుక్కున్న కోసుగడ్డ వేసేయ్. ఓసారి మొత్తం తిప్పి మూతెట్టు.
గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపు, ఉప్పు కారం వేయ్యి.
దింపి లాగిఉంచు వేడి వేడి అన్నం, నెయ్యి వేస్కుని.

ఈ కూరలో కీ - ఇంగువ. తిరగమాతలో వేసే ఎండుమిర్చి ఇంగువలో వేగుట. ఈ కూర తినునప్పుడు ఈ ఎండు మిర్చీని కొరుక్కుంటు ఆస్వాదించు.
సరే అలానే - పురజనుల కోరికపై కోసుగడ్డ అనగా కోసేసిన గడ్డ కాదు, క్యాబే-జీ. అబ్బే, అదేంతిట్టు కాదబ్బాయ్ క్యాబేజీ అని.

Friday, April 3, 2009

వడపప్పు, పానకం

జగమెల్లరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

మరి శ్రీరామనవమి రోజున, పందిళ్లలో జెగ్గులకొద్దీ పానకం, దోసిళ్లకొద్దీ వడపప్పు తినకపోతే మహా పాపం.
అసలు ఏంటివి? ఎలా చేస్తారు?
శ్రీరామనవమి చైత్రమాసం కాబట్టి, ఎండలు ముదురుతుంటాయి. తాపాన్ని తట్టుకుని, కాస్త చలువచేసేవి తినండి అని అంతర్లక్ష్యం.
పానకం తయ్యారీ విధానం -
కావాల్సినవి -
ఓ కూజాడు నీళ్లు.
ఓ వంగ గ్రా।। బెల్లం.
నాలుగు యాలుకలు.
నాలుగు మిరియాలు.
విధానం-
యాలుకల పైన తొక్క తీసేసి, ఆ గింజల్ని ఓ చిప్పగంటె నూరుకుని నీళ్లల్లో వేసేయి.
మిరియాలని, చిప్పగంటె తో బాగా నూరుకుని నీళ్లల్లో కలిపేయ్.
బెల్లాన్ని బాగా చిప్పగంటెతో నలిపేసి నీళ్లలో వేసేయి.
బాగా కలుపు, బెల్లం కరిగిందాకా. అయ్యాక, తడిగుడ్డని చుట్టు జగ్గుకి. చల్లబడతాయ్ నీళ్లు.

వడపప్పు -
పెసరపప్పు ఒక కప్పుడు.
ఒక గంట నీళ్లలో నానబెట్టిన పెసరపప్పే వడపప్పు. కొందరు దీనికి చిటికెడు ఉప్పు కలుపుతారు. కొందరు కొబ్బరి తురుము ఒక అరచెంచా, కొత్తిమీర ఒక అరచెంచా, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ఒక అరచెంచా, కలుపుతారు. మన ఇష్టం, సౌకర్యం.

ముందుగా వీటిని, ఆ సీతారామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టి, ఓ పట్టుపట్టటమే, భక్తికి భక్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
అదీ కధ.