ఇదిగో మా కుంపటి.
ఓరోజు మాఆవిడ దం బిర్యాని వండింది. నేనూ ఇంకో రోజు రొట్టెల మీద అదే అదే నిప్పుల మీద రొట్టెలు కాల్చా.
ఒకానొక రోజునగోంగూర పప్పు వండాం కూడా. వాహ్...వాహ్..వాహ్....క్యా బోలూం మియా...క్యా బాత్ హై....ఫాంటాష్టిక్కు, అదుర్స్ కెవ్వు కేక, మేక తోక...
ఈ కుంపటి అడ్వాంటేజ్ ఏంటంటే, వంట తంటా అయ్యాక ఇసుకని బొగ్గుల మీద కప్పేస్తే వెంటనే నిప్పు ఆరి పోతుంది.
అదీ కధ.
పెద్దలు చెప్పినట్టు పప్పుని కుక్కర్లో పెడితే పెద్ద బావోదు. బయటే వండాలి. ఐతే ఇది తీరిక సమయాల్లో మాత్రమే. ఎనిమిదింటికి ఆఫీస్కెళ్లాలి, పొయ్యిమీద పప్పు పడేయ్, రేపొద్దునకి తయ్యారు అవుతుంది..అలా కాదు. లిమిటెడ్ టైం లో ఇలాంటివి పెట్టుకోవద్దు..ఆరాం గా ఉన్నప్పుడు ఇలాంటివి.
సరే ఇంకో మాట. ఉద్యోగం లేని బ్యాచిలర్స్కి - పొట్ట ముఖ్యం. కమ్మగా వండుకుని తిన్న ఒక్క ముద్దైనా కమ్మగా తింటే ఒక సాటిస్ఫాక్షను వల్ల, జావానో డాట్ నెట్టు మీదనో ఏకాగ్రతతో కుస్తీ పడొచ్చు. చాలా మంది కమ్మగా తింటే నిద్ర పోతాం అనుకుంటారు. కానీ, పొట్ట పగల తింటే నిద్రొస్తుంది, కమ్మగా కాదు..
వస్తువులు:
కుంపటి,
బొగ్గులు,
అగ్గిపెట్టె (జేబులోంచి లైటర్లాగు బైటికి),
కిరసనాయిలు.
మందపాటి గిన్నె - మా ఇంట్లో రాచ్చిప్ప గిన్నె, రాచ్చిప్ప గంటే అని ఉండేవి, కేవలం కుంపటి మీద వంటకోసం (రాచ్చిప్ప = రాతి చిప్ప)
గోంగూర పప్పుకి కావాల్సినవి:
గోంగూర - ఒక కట్ట (10 గోగికాడలు).
కంది పప్పు - మనుషుల్ని బట్టి. నాలుగు గుప్పిళ్ళు.
ఉల్లిగడ్డ - ఒకటి
పచ్చిమిరపకాయలు - 4
తిరగమాత గింజలు, ఉప్పు గిప్పు ...
విధానం - గోంగూర కి వెళ్లు ఇందిరా నగర్లో,100 ft రోడ్డు పక్కన !! గోంగూర పప్పు పార్సిలు తెచ్చుకో మింగు...కాదు
కుంపటిరా జెయ్యి - అంటే వెలిగించు. ఎలా? బొగ్గులు వెయ్. ఎన్ని? కొన్ని. కిరసనాయిలు కొన్ని చుక్కలు అన్ని బొగ్గుల మీద పడేట్టు జల్లు (చేతికి కిరసనాయిలు అంటానీమాక). అగ్గిపుల్ల గీ, దానిమీద పడేయ్. అంటుకుంటుంది. భగ్గున మంట వొస్తుంది. భయపడకు. వెంటనే తగ్గిపోతుందిలే. బొగ్గులు ఆ మంటకి అంటుకుంటై. నిప్పు రాజుకున్నదాకా ఇసెనకఱ్ఱతో ఇసరతా ఉండు. అన్నీ బొగ్గులు రాజుకునేలోపు,
గిన్నెలో కందిపప్పు వెయ్, కడుగు, ఒకటికి మూడు నీళ్లు పోయి. పక్కన పెట్టు. నిప్పులు అన్నీ రాజుకున్నాయా చూడు, గెన్నె దాని మీద బెట్టు. చిటికెడు పసుపు వెయ్. మూత బెట్టు.
గోంగూర కడుగు, పక్కన బెట్టు.
ఉల్లిగడ్డ మిలువునా నాలుగు ముక్కలు జెయ్యి, పక్కన బెట్టు.
పచ్చిమిరగాయలు తొడిమలు తీయ్, పక్కన బెట్టు.
అలా గిన్నె వైపు చూస్తూ వుండు. పొంగు వస్తుంది కొంచెం సేపు ఐతే. అప్పుడు మూత తీ, గోగూర, ఉల్లి, మిర్చి వెయ్. ఓరగా మూతబెట్టు. నిప్పులు ఉన్నయో లేదో చూస్తూ ఉండు. ఉప్పు కారం వెయ్యి. అప్పుడప్పుడు విసెనెకఱ్ఱతో వీస్తా ఉండు.
పప్పు ఉడికిందో లేదో ఎలా తెల్సుకోవటం, చెంచాబెట్టి ఒక పప్పు తీస్కుని నలిపి జూడు. మెత్తగా నలిగింది అంటే ఉడికినట్టు.
తిరగమాత :- ముందు పప్పు గిన్నె తీసి పక్కన బెట్టు చిప్ప గంటె తీస్కో, పొయ్యి మీద పెట్టు. కొంచెం నూనె వెయ్. 3 చెంచాలు. నూనె కాగినాక ముందు (మందు కాదు బాబు - ముందు) మినప్పప్పు వెయ్, తర్వాత ఆవాలు మెంతులు వెయ్, చిట్పట్ అనగానే జీలకర చిటికెడు ఎండుమిరపకాయ ఒకటి చేత్తో విరగ్గొట్టి వెయ్, ఒక్క 10 సెకండ్లు ఆగు, కర్వేపాకు వెయ్, ఇంగివ జల్లు, పప్పులో వేసేయ్..
మళ్లీ పప్పు గిన్నె పొయ్యిమీద పెట్టు. ఒక్క నిమిషం ఉంచు..దింపేసేయ్. కుంపట్లో నిప్పులు ఆర్పెయ్...లేకపోతే ఇల్లు కుంపటే...
ఇంక లాగించు.
బాబూ!!! కాంబినేషన్ తెల్సుకో. గోంగూర పప్పు లోకి ఉప్పుమిరపకాయలు అదుర్స్. బైట కొనకు, మీ ఇంటినుండి తెచ్చుకో ఈసారి ఎళ్లినప్పుడు. బయట కొన్నవాటిల్లో మజ్జిగ కంటెంటు బగా తక్కువ, ఉప్పు కంటెంటు ఎక్కువ.