Monday, February 16, 2009

కొ.మా (కొబ్బరి - మా...)

అర్ధం అయిపోయిందేం!! ఇట్టే పట్టేసావన్నమాట.
నాకు అత్యంత ఇష్టమైన, చాల రుచికరమైన, చాలా అది అయిన, చాలా ఇది అయిన పచ్చడి - కొబ్బరి పచ్చడి. అందునా సింతపండు బదులు మామిడికాయ వేసిజేస్తే, అహాహా, ఓహోహో!!
రుచి చూడ తరమా,
ఈ పచ్చడి రుచి చూడ త ర మా ఆ ఆ ఆ
రుచి చూడ తరమా!!!!
కావాల్సిందల్లా మంచి కొబ్బరిచిప్ప ఒహటి, పుల్లని మామిడి ఒహటి. ఎక్కడ ఉంటుంది మామిడికాయ?
గున్నమామిడి చెట్టుమీద కాయలు రెండున్నాయి
ఒక కాయ పచ్చనిది ఇంకోటి ఎర్రనిది
పచ్చనిదేమో పుల్లనిదీ
ఎర్రనిదేమో తీయ్యనదీ
గున్నమామిడి చెట్టుమీద కాయలు రెండున్నాయి

సరే, పుణ్యం పురుషార్ధం, గుడికెళ్లి దర్శనం గట్రా సేసేకుని ఓ కొబ్బరికాయకొట్టి ఓ సిప్పతెచ్చుకో. పక్కనోళ్లని అడుగు ఇంకో సిప్పకోసం. సరే. తెచ్చుకున్నావా?
మార్కెట్టుకెళ్లి, ఏటి, మార్కేట్టుకెళ్లి ఓ మాంచి మావిడికాయ, ఏటి, మాంఛి ఆకుపచ్చరంగులోది, అట్టానే ఓ కట్ట కొత్తిమీర, ఓ అరడజను పచ్చిమిరపకాయలు పట్రా (అరడజను మిర్చీ కుమ్ము గురూ అని అడిగావనుకో - ఏటీ కొత్తా అంటాడు - ఓ వందగ్రావుల్తెచ్చుకో)
ఆ మట్టన్ కొట్టు మస్తాన్ కత్తి ఉందిగా, దాంతో కొబ్బరిసిప్పని ఇరగ్గొట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కో కొబ్బరిని. ఓ నాలుగు ముక్కలూ, ఓ బెల్లం గడ్డ నోట్టో కుమ్ముకో, ఏంపర్లేదు. కొబ్బరి సాలకపోతే మన గుడి ఉండనే ఉందిగా. పూజారికి కన్నుకొట్టి, ఓ నవ్వేస్కో సిప్పసేతిలో పెట్టేస్తాడు. ఏంపర్లేదు.

అయ్యాక, మావిడికాయని సన్నటి ముక్కలుగా కోసేస్కో. ఓ నాలుగు ముక్కలు, పులుపుజూట్టానికి నోట్టో ఏస్కో, లేక ఉప్పుకారం అద్దుకుని రుచి చూడు. కాయ అయిపోయిందా, ఇంకోటి తెచ్చుకో. ఏటిసేత్తాం, కలికాలం, రుసిసూట్టానికే ఓ కాయ అయిపోతే ఎలారా రాంసోవి.(శ్రీవారి శోభనం సినిమాలో హీరోవిన్ను బామ్మ గుర్తుకొచ్చింది. పెళ్లి చూపులకి గారెలు చేస్తుంది ఆమె. పెళ్లివాళ్లు వస్తారు. గారెలు పట్రా అంటాడు పెళ్లికూతురి తండ్రి. వంటగదిలోకెళ్లేసరికీ గారెల గిన్నెలో ఒకే గారె ఉంటుంది. ఇదేందిదీ అంటే, రుచి చూద్దామని నోట్టో ఏస్కున్నా, ఇట్టే కరిగిపొయ్యినయ్యి అని ఆమె సిగ్గుపడుతూ చెప్తుంది - జంధ్యాలకి ఓ సారి జై)
ఇప్పుడు, ఓ అరడజను పచ్చి మిర్చీ, ఓ అరడజను ఎండుమిర్చీ, ఓ నాలుగు మెంతులు, ఓ నాలుగు జీలకర్రలు పక్కనెట్టుకుని, భాండీ ఎట్టి, సెంచాడు నూనెబోసి, ఏడి కాంగనే ఆ జీలకర్రలు, మెంతులూ ఎండుమిర్చీ ఏసి, సిటపటలాడంగనే పచ్చిమిర్చీ ఏసేసి ఏయించు. పక్కనెట్టుకో.
ఇప్పుడు ఆ కొబ్బరి ముక్కల్ని మావిడికాయ ముక్కల్ని రుబ్బింగు వేయబడునులో వెయ్యి. రుబ్బింగు కాంగనే, నీక్కావాల్సినంత ఉప్పు ఏస్కుని, ఈ ఏపిన మిర్చి గట్రా దాంట్లో ఏసి, మళ్లీ ఓ పాలి రుబ్బింగు వెయ్యి. బాగామెదిగిందాకా రుబ్బింగు ఏసేస్కుని, అయ్యాక, భాఘా ఇంగువదట్టించి తిరగమాత వేసి, శుభ్రంగా నాయనా, శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కున్న కొత్తిమీర తగిలించి లాగించునాయనా..

ఆ పాతరోజులు: ఒకానొక కాలంలో కొబ్బరి తురమటానికి ఓ ప్రత్యేక పరికరం ఉండేది. దాని పేరే కొబ్బరి తురుం. దానికో పీట, పైన ఓ ఇరుసు, ఓ వైపు ఓ ఎళ్ మార్కు తిప్పేది, ఇటువైపు పళ్ల గుత్తి. చిప్పని ఆ గుత్తికెపెట్టి ఇటు ఎల్ మార్కుని తిప్పుతుంటే ఆ పళ్ళు కొబ్బరిని తురుముతై. అసలు సంగతేంటాంటే ఆ తురుముతో వచ్చిన రుచి. మేబీ, ఆ కొబ్బరి పాలు తురుముతోబాటే ఉండటామో మరేదో. ఆ తురుము అప్పటికప్పుడు ఓ చెంచాడు పందారతో లాగిస్తే - నోరూరుతోంది, వెళ్లి ఓ లోటా నీళ్లు గొంతులోపోస్కొస్తా!!!

Monday, February 9, 2009

మినప పచ్చడి

మీకు తెలుసా మినప పచ్చడి చేస్కోవచ్చనీ?

ఇదో కమ్మని పచ్చడి. ఈ పచ్చడి చెయ్యటానికి తపనిసరిగా మిక్సీ లేక రోలు ఉండాలి.

కావాల్సిన పదార్ధాలు: మినుములు లేక మినప్పప్పు, ఎండు మిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి.
మినుములు లేక మినప్పప్పు: ఎలాంటివి? పొట్టు మినప్పప్పు అంటారు. అవీ!!

ముందుగా, మినప్పప్పుని వేయించి పక్కనబెట్టుకోవాలి. ఎలా? భాండీ పెట్టి, భాండీ వేడయ్యాక మినప్పప్పు వేసి వేపటమే.
From వంట

అయ్యాక, ఒక అరగ్లాసు నీళ్లలో ఓ పెద్ద గోలీ అంత చింతపండు నానబెట్టుకో. అలా అది నానుతూ ఉండనీ.
ఇప్పుడు, మళ్లీ భాండీ పెట్టు, ఓ రెండు చెంచాలు నూనె పొయ్యి. వేడి అయ్యాక, ఓ పావు గుప్పెడు "జీల్కర", ఓ ఎనిమిది మెంతులు వెయ్యి నూనెలో, వేగంగనే ఓ 10/15 తొడిమలు తీసిన ఏండుమిరపగాయలు వెయ్యి, వేపు, అయ్యాక ఓ సిబ్బిరేకులో పోస్కో, లేకపోతే ఆ కోరుతో భయపడి మీ చుట్టుపక్కనోళ్లు అగ్నిమాపక యంత్రాన్ని పిలుస్తారు.
From వంట

ఇందాక చింతపండు నానబెట్టుకున్నావుగా, దాన్ని బాగా చెయ్యిపెట్టి పిసికి, చింతపండు పిప్పి తీసేయ్యి.
ఇప్పుడు, ఈ ఎండుమిరపగాయలు, మిన్పప్పప్పు, చింతపండు గుజ్జు, ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బింగు వెయ్యి. అయ్యాక ఓ చెంచాడు ఉప్పువేసి మళ్లీ రుబ్బింగు వెయ్యి.
From వంట


రుబ్బింగు వెయ్యగా వచ్చిన పచ్చడినే మినపప్పు పచ్చడి అంటారు. ఇక లాగించు.

అదీ కధ