Monday, March 30, 2009

టమాటా, బేబీమొక్కజొన్న, మొలకెత్తిన సోయా గింజలు

ముందుగా దేంతోనో మొదలుపెట్టా కానీ, మొత్తం పెట్టా. అర్ధంకాలేదా??
మొన్న వారాంతానికి, తను పిల్లలతో సతమతమౌతుంటే, నేను రంగంలోకి దూకా. అసలు ఆలోచన, లేక నా మినిస్టరు యొక్క ఆర్డర్స్, తను ముందుగానే సోయా ఇంకేవో మొలకెత్తిన గింజల్ని ఉడ్కబెట్టింది, వాటితో కూరచెయ్యి అని. మనం మొదలుపెడుతుండగానే ఓ మెరుపు ఆలోచన వచ్చింది. మనోళ్లకి "తరగటం" మీద ఓ డెమో ఇస్తే వీడియో రూపంలో ఆనందిస్తారు కదా అని. ఠడా వెంటనే మన చిన్ని డిజిటల్ కెమెరా తెచ్చి ఎలానో కాఫీ పిల్టర్ మీద నిలబెట్టి మొదలెట్టా. అయితే ఈ వీడియోలో నెర్రేషన్ లేదు. ఆ సమయంలో మాట్టాడితే మావాడు వెంటనే యట్రాక్ట్ అయ్యి, నే తీస్తా వీడియో, నే తీస్తా వీడియో అని లాక్కెళ్లే ప్రమాదం ఉన్నందున, ఇది ఒకరకంగా "పుష్పక విమాణం" సినిమా లాంటిది అనుకోండి. అలా మొదలు పెట్టి, కూర విధి విధానంతో సహా లాగించేసా. అయితే, కొన్ని కొన్ని సాంకేతిక సమస్యలవల్ల నేననుకున్న విధంగా తీయలేకపొయ్యా. ఎలా అంటే, తరిగేటాప్పుడు ఒక కోణంలో పెట్టా కెమేరాని, అయ్యాక పందార డబ్బా మీద పెట్టా, బెమ్మాణంగా వస్తుంది అనుకున్నా, కానీ పందార డబ్బా మోసం చేసింది. భాండీ తప్ప అన్నీ పడ్డాయ్ వీడియోలో.

సరే సంగంతేంటంటే, చెప్పిందేచెప్పరా కాదు కాదు వినరా పాచిపళ్ళ దాసుడా. అనగా, మళ్లీ టమాటా కూరే.
ఐతే ఈ సారి వెరైటీగా -
టమాటా, బేబీమొక్కజొన్న, మొలకెత్తిన సోయా మరియూ ఇంకేదో గింజ. మొన్న మా లోకల్ కూరలషాపుకి వెళ్లినప్పుడు ఈ డబ్బా చూసా, మొలకెత్తిన సోయా+ఇవి. ఏంపర్లేదు కూరచేసి అవతల నూకచ్చు అని తీస్కున్నా.
ఒక మాట - అపరాలు అనగా, పెసలు, కందులు, శనగలు ఇలాంటివి. వీటిల్లో మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తినటం మంచిది. ఇక్కడ మల్టై గ్రైన్స్ ఉన్న బ్రెడ్ అవి ఇవి దొరుకుతుంటాయ్ కూడా. మొలకెత్తినవి ఏవైనా సరే పిరికిడిలో పట్టినన్ని మాత్రమే తినాలి(హి హీ, ఎవ్వని పిరికిడీ అంటున్నావా!! నీదేనోయి నాగన్నా/నాగక్కా) ఎక్కువ తింటే "అతి సర్వత్రా.." తెలుసుగా.
ఈ కూరకి కావాల్సినవి -
టమాటాలు ఎరడు
ఒందు ఉల్లిపాయ
నాల్కు వెల్లుల్లి
నాల్కు మిర్చి
ఏళు బేబీమొక్కజొన్న
ఒందు మొలకెత్తిన ఇత్తనాల డబ్బా
ఒందు కొత్తిమీర కట్ట
నాల్కు చెంచాల నూనె. నేను ఈ మధ్య వంటలకి ఆలివ్ ఆయిల్ నూనె వాడుతున్నా.
ఇక మొదలుపెడదామా!!
ముందుగా ఆ మొలకెత్తిన విత్తనాలని ఉడ్కబెట్టుకో కొంచెం ఉప్పేసి.


పైన వీడియోకి నెర్రేషన్ -

వెల్లుల్లి రెబ్బల్ని కుక్కు, వాటిపై తొక్కలు తియ్యి. ఇక వాటిని సన్నగా తరుగు. పక్కకి పెట్టుకో. తర్వాత, అల్లం తొక్క తీస్కుని, సన్నగా తరుక్కో. అయ్యాక, బేబీమొక్కజొన్నలని నాలుగు భాగాలుగా తరుక్కో. ఇప్పుడు ఉల్లిపాయని నిలువుగా తరిగి, వాటిపైన తొక్కని తీసేసి నిలువుగా సన్నగా తరుగు. అయ్యాక, టమాటాలని శుభ్రంగా కడుక్కుని, సన్నగా తరుక్కో. ప్క్కనబెట్టు.
ఇప్పుడు, భాండీ తీస్కో, పొయ్యిమీదపెట్టు, వెలిగించు, నూనెపొయ్యి. తిరగమాట వెయ్యి. అయ్యాక మిర్చి, అల్లం, వెల్లుల్లి బేబీ మొక్కజొన్న ముక్కలు వేసేయ్, వేగినాక, కొంచెం పసుపు వెయ్యి. అయ్యాక, ఇప్పుడు ఉల్లిపాయలు వెయ్యి. వేయించు.
ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగుకి మారేలోపు, కొత్తిమీర శుభ్రంగా కడుక్కుని, తరుక్కొ. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ లోకి మారినియేమో చూడు. మారితే టమాటాలు వేసేయ్యి, నేనైతే టమాటాలతోపాటు ఓ చెంచా టమాటా ప్యూరీ కూడా వేస్తా.
ఇప్పుడు, ఇందాకటి మొలకెత్తిన గింజలు వాటిని ఉడ్కబెట్టుకున్న నీళ్లతోబాటి వేసేసెయ్. చాలినన్ని నీళ్లు లేకపోటే ఓ అరగ్లాసు నీళ్లు మళ్లీ పోస్కోవచ్చు. ఓ సారి మొత్తం కలియతిప్పి, కావాల్సినంత ఉప్పు, కారం వేసి మూతబెట్టు. ఇందాక ఫైన్లీ ఛాప్ చేసిన కొత్తిమీర జల్లు, ఓ సారి కూరని మళ్లీ తిప్పి మూతపెట్టి సన్నని మంటపై అలా ఓ పావుగంట ఉంచు...
వేడివేడి కూరని లాగించు - అన్నంలో అయినా లేక రొట్టెల్లోకైనా ...

Friday, March 27, 2009

ఉగాది పచ్చడి

బ్రహ్మాండమంతటికీ విరోధీ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఓఉషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది.ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఓఉషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని,ఆయుర్వేదానికి ఆహారానికి గల సంభందాన్ని చెప్పాడమే కాక హిందూ పండుగలకు,ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.
[http://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%97%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF]

ఇంతకీ ఉగాది పచ్చడి ఎలా చెయ్యాలి :-
మంచి నవనవ లాడే మామిడికాయ (ఓ మాదిరి పరిమాణం కలది), ఓ పదిహేను వందల వేపుపుతకాడలు, గోలీ అంత కొత్త చింతపండు, కొత్త బెల్లం, రెండు పచ్చిమిరపకాయలు, ఒక అరటిపండు మరియూ ఉప్పు, నీళ్లు (వంద మిల్లీ లీటర్లు).

తయారీ విధానం:
ముందుగా, వేపపూతని కాడల నుండి వేరు చేస్కుని, పూతలోంచి చిన్న చిన్న అప్పుడప్పుడే బయటకి వస్తున్న వేపకాయల్ని వేరుచేస్కోవాలి. కాబట్టి, ఒక పెద్ద సంచినిండా పూత తెస్తే ఓ దెసెడు నిజమైన పూత వస్తుంది. సరే ఈ పూతని సిద్ధంగా పెట్టుకో.
అయ్యాక, మామిడికాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కో. గోలీ అంత చింతపండులో ఒక ౧౦౦ మిల్లీలీటర్ల నీళ్ళు పోసి నానబెట్టు. ఒక పసినిమిషాల తర్వాత పిసికేసి, పిప్పి పారేసి ఆ చింతపండు గుజ్జుని పక్కనపెట్టుకో. ఇప్పుడు బెల్లాన్ని గుండ్రాయితో బాగా నలిపివెయ్యి. దాన్ని చింతపండు గుజ్జులో కలిపేసేయి. అయ్యక, మిర్చిని సన్నగా తరుక్కో. అరటిపండు తొక్క తీసేసి ద్వారం దగ్గర పడేయ్. బయటకి వెళ్ళేప్పుడు సరదాగా జారిపడొచ్చు. అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా తరిగేస్కో. ఇప్పుడు ఆ చింతపండు, బెల్లం గుజ్జులో మిగతా పదార్ధాలన్ని వేసి ఒక అరస్పూన్ ఉప్పు వేసి కలుపు. లాగించు. అందరికీ పెట్టు. పెట్టి పారిపో లేకపోతే ఇది పచ్చాడా అని నాలుగిస్తారు.

Monday, March 16, 2009

On Demand (TM) పండుమిరపకాయల కారం

బ్లాగ్ మహిళామణులు, బ్లాగ్ వాగ్గేయకారులు, బ్లాగ్ శాస్త్రవేత్తలు, బ్లాగరులు, వాళ్లూ వీళ్లూ అందరూ -
అయ్యా, మరి ఎండా కాలం వచ్చేసింది. పండుమిరపకాయలు నవనవలాడుతూ కళ్లముందు కదులుతున్నాయ్. వాటితో, పఛ్చడి ఎలా చేయాలో చెప్పి మమ్మానందింపజేయి, రంజింపజేయి అని వ్యాఖ్యానించిని పిదప, సదరు వ్యాఖ్యలను శిరోధార్యంగా భావించి, ఆ ఎర్రని పండుమిరపాకయలని ఓ సారి స్వప్నముననే దర్శించుకుని, ఇక మొదలుపెడాదాం అని ఉద్యుక్తుణ్నౌతున్న నాకు, మా మాత దూరవాణిద్వారా, కుమారా, మోర్జంపాడు నుండి కాశయ్య ఇప్పుడే ఓ నాలుగు రధాల నిండా పండుపిరపకాయల పఛ్చడి ఇచ్చి వెళ్లాడు అని తెలియజేసింది. ఈ పఛ్చడి కోసం, మందుకొట్టకుండా, బాగా నీరుపెట్టి కోసిన పండుమిరపకాయలతో, కమ్మటి మామిడల్లం, గండ్ల ఉప్పు, మాంచి చింతపండుతో "రుబ్బింగు వెయ్యబడును" లో వేసి రుబ్బించి అందించి వెళ్లాడు అనే కమ్మని వార్తని విన్న నేను, అహా హతవిధి, ఇది కమ్మని వార్త ఎలా అవుతుంది, ఈ సప్త సముద్రాలు ఎలా ఒక్క దూకులో దాటి, ఇంటిపై వాలి, ఓ చేతితో ఆ సదరు రధాలని, వాటిని లాగుతున్న గుర్రాలనీ దొరకబుచ్చుకుని ఒక్క దూకుతో అమెరికాలో వాలిపోగలను? అని నన్ను నేను ప్రశ్నించుకుని, నోటియందూరిన లాలాజలమును ఇదియే ఆ పదార్ధమూ అని ఊహించుకుని, నాలుగు గుటకలు మింగి నిగ్రహించుకుని ఇలా ఈ ఉత్తరం రాస్తున్నాను.

త్వరలో మీ అందరి కోసం పండుమిరపకాయల కారం !!!
కానీ ముందు -
నైంటీన్ హండ్రెడ్ అండ్ యైటీఫైవ్!! మోర్జంపాడు, ఎ స్మాల్ విల్లేజ్, పికిల్ టేస్టింగ్స్ అర్రేంజ్డ్, ఐ వాంటెడ్ టు సీ ది పికిల్, నాట్ పాసిబుల్. ఓకే ఓకే ఫాదర్ మదర్ మై ఎగ్రీడ్, జార్(1) బిల్డ్. టూ వీక్స్ హ్యాపీ. థర్డ్ వీక్ స్టార్టెడ్ ట్రబుల్. వై? ల్యాంగ్వేజ్ ప్రాబ్లమా, ఎందుకు పండుమిరపకాయల కారం తిందాం అనుకుంటున్నావ్? ఐ కొసెన్, యూ ఆన్సర్.

1 - జార్ = పచ్చళ్ల జాడి

Thursday, March 12, 2009

తాజా వంట! తాజా వంట!! తాజా వంట!!!

ఇదెంటిది, తాజావార్త లా తాజా వంటా అనుకుంటున్నారా?
ఔనండీ! తాజా వంటే. నిన్న ఇంటికెళ్లంగనే మా ఆవిడ గోబి, ఉల్స్, మిర్చ్స్ అన్నీ ముందేసుకుని తరగటానికి "ఉద్యుక్తురాలు" అవుతోంది. ఠడా! వెంటనే మనం రంగంలోకి దూకామ్, "నువ్వు తప్పుకో" అనేసి, కత్తి సుత్తీ అన్నీలాగేస్కుని, గుంజేస్కుని, నరికెయ్యడం మొదలుపెట్టాం.

గియ్యాల గేంద్వయ్యా దావత్ అంటే - గోబీ టమాటా కూర. దీన్ తండ్రి తీ, తీ కలం తీ, కాయితం తీ, రాయి ఏమ్గావాల్నో సప్పుడుజెయ్యకుండా -
ఫూల్ గోబీ - క్యాలీఫ్లవర్
రెండు టమాటాలు - పండువి. పచ్చితెచ్చుకున్నవనుకో, తిరిగి నన్నే అడుగుతవ్, అన్నా పచ్చివితెచ్చిన్నే ఏంజెయ్యాలే. గప్పుడు, బిడ్డా పచ్చి టమాటాతో పచ్చడి రేపు రాస్తలే అని నీకోశం మళ్లీ రాయాలె ఇంకోపోస్టు.
చెటాకు మిర్చి.
నాల్గు వెల్లుల్లి
రెండుగ్రాములు అల్లం.
ఒక గ్రాము మినుములు.
రెండుగ్రాములు పచ్చిశనగపప్పు.
అయిదు కర్వేపాకులు.
ముఫై ఎనిమిది కొత్తిమీర కాడలు.
ఒక ఎండు మిర్చి.
ఒక గ్రాము ఆవాలు.
రెండు గ్రాములు జిలకర.
15.78 మిల్లీలీటర్ల పల్లీ నూనె.
చిటికెడు పసుపు.
ఎనిమిది గ్రాముల కారం.
ముఫై నాలుగు గ్రాముల ఉప్పు, కూరలోకి, ౨౪.౫ ( ఇరవైనాలుగు.అయిదు) గ్రాములు పువ్వుని ఉడ్కబెట్టటానికి.
ఒక మూకుడు, ఒక చట్టి. మూకుడు చట్టి దొరక్కపోతే, ఓ డేగిషా, ఓ సిబ్బిరేకు సిద్ధం చేస్కో.
ఒక గ్యాస్ పొయ్యి.
ఒక అగ్గిపెట్టె.
ఒక అగ్గిపుల్ల.
ఒక గంటె.
ఒక తలకాయ (అఫ్కోర్స్ నీదే)
ఒక మటన్ కొట్టు మస్తాన్ కత్తి. (గమనిక :- కత్తి లేకపోతే కత్తిపీట వాడకూడాదు. కత్తిపీటకీ ఫూల్గోబీకి పడదు)
ఒక పీట. (పైనవన్నీ నరకటానికి)

ముందుగా -
cauliflower ని తెలుగులో ఏమంటారు? కోసుపువ్వు అంటారు. క్యాబేజ్ ని కోసుగడ్డ అంటారు. టామాటాని మావైపు రామ్ములక్కాయ అంటారు. మిగతాప్రాంతాల్లో ఏమంటారో మరి, తెల్వదీ.

సరే -

ముందుగా -
కోసుపువ్వుని కత్తిపెట్టి, ఒక్కోపువ్వుని తరిగేస్కో.
అయ్యాక, ముందు, మిర్చిని సన్నగా ఛాప్, అదేలేగురు హోజాషురూ, తరుక్కో. తర్వాత, అరచేతినిబెట్టి, వెల్లుల్లి రెబ్బల్ని కుక్కు (క్రష్), అప్పుడు వాటిపైన తొక్కతీసేసి సన్నగా ఛాప్ చేసి పక్కన్బెట్. అల్లం, పైన తొక్క తోసేసి, సన్నగా తర్క్స్, పక్కన్బెట్స్.
From tomato_cauli


ఇప్పుడు, ఓ డేగిషాలో నీళ్లు తీస్కో, మరగ్గాయి. మరిగాక పసుపువెయ్యి, ఓ ౨౪.౫ (ఇరవైనాలుగు.అయిదు) గ్రాముల ఉప్పు వెయ్యి. ఇప్పుడు పువ్వుని ఆ మరిగే నీళ్లల్లో వేసి, పొయ్యి ఆర్పివెయ్యి. మూతపెట్స్. ఫైవ్ మినిట్స్ అయ్యాక, డ్రెయిన్ వాటర్. అంటే కోశుపువ్వుని వేడినీళ్లలోనుండి వేరుచేసి, పక్కనబెట్టు అని.
From tomato_cauli

ఉల్లిపాయని సన్నగా తరుక్కో, ఆ రెండు, పేపర్లని దిబ్బలో కొట్టు, ఊప్స్, స్టడీ, ఆ రెండు రామ్ములక్కాయల్ని ఛాప్ చేస్కో. (ఆ రెండు అనంగనే పేపర్లు అనే స్పురిస్తోంది ఈమధ్య)
From tomato_cauli

From tomato_cauli

పొయ్యి వెలిగించు, చట్టి పెట్టు అదే, డేగిషా.
నూనె పొయ్యి. కాగంగనే మినుములు, పచ్చిశనగపప్పు, ఎండు మిర్చి, ఆవాలు, జిలకర, చివరాకరికి కర్వేపాకులు లతో తిరగమాత వేసేయ్. ఓ చెటికెడు పసుపు వెయ్యి. ఇప్పుడు మిర్చి, వెల్లుల్లి వెయ్యి. ఓ సారి బాగా కలుపు. ఇప్పుడు ఉల్స్ వెయ్యి, డీప్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించు.
అయ్యిందా, ఇప్పుడు తరుక్కున్న రాములక్కాయలు వేసేయి. కలుపు లేక గంటే బెట్టి తిప్పు - తిప్పు అంటే త్రిపురసుందరి కాదు, తిప్పు అంటే తిప్పడం. అయ్యాక ఇందాకటి కోశుపువ్వు వేసేయ్, ఉప్పు, కారం వెయ్యి కలియ తిప్పు, మూతెట్టు. గ్రేవీ అంటే నీళ్లు సరిపోను లేవు అనుకుంటే ఓ గళాసు పోస్కో (ఆంటే అవసరాన్ని బట్టి అని)
ఉడకనీ ఇక.
ఉడికినాక, కొత్తిమీర (పైన్లీ వాష్డ్ అండ్ ఛాప్ప్డ్ - శుభ్రంగా కడిగిన మరియూ సన్నగా తరిగిన) జల్లు -
From tomato_cauli

(పైన ఫోటోని అలా చూడకు, అదేంటి కూరా లేక సాంబారా అని, పొరపాటున కొంచెం నీళ్లెక్కువైనై)
చివరాకర్న, లాగించటం మర్చిపోకు.

మీ ఇంట అన్నీ శుభకార్యాలకి, కార్యాలు కరామత్తులకీ క్యాటరింగు చెయ్యబడును-
సంప్రదించండి - నల భీమ. ఒకళ్లే వంట చేస్తారు, ఇంకోకళ్లు సోఫాలో కూర్చుని ఐఫోన్లో గేమ్స్ ఆడుతుంటారు.
From tomato_cauli


కొన్ని మిక్స్డ్ డైలాగులు- నువ్వు సరిగ్గా గమనించావోలేదో (గురుగారు రావ్ గోపాల్ రావ్ గారి స్టైల్ - ఛాలంజ్), మనం వోల్ మొత్తం ఎడంసేతి సంగం పెసినెంటు (మాడా స్టైల్ - ముత్యాలముగ్గు)