Friday, March 27, 2009

ఉగాది పచ్చడి

బ్రహ్మాండమంతటికీ విరోధీ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు.ఋతు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఓఉషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది.ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు,చింతపండు,బెల్లం,పచ్చిమిరప కాయలు,మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఓఉషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని,ఆయుర్వేదానికి ఆహారానికి గల సంభందాన్ని చెప్పాడమే కాక హిందూ పండుగలకు,ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.
[http://te.wikipedia.org/wiki/%E0%B0%89%E0%B0%97%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF]

ఇంతకీ ఉగాది పచ్చడి ఎలా చెయ్యాలి :-
మంచి నవనవ లాడే మామిడికాయ (ఓ మాదిరి పరిమాణం కలది), ఓ పదిహేను వందల వేపుపుతకాడలు, గోలీ అంత కొత్త చింతపండు, కొత్త బెల్లం, రెండు పచ్చిమిరపకాయలు, ఒక అరటిపండు మరియూ ఉప్పు, నీళ్లు (వంద మిల్లీ లీటర్లు).

తయారీ విధానం:
ముందుగా, వేపపూతని కాడల నుండి వేరు చేస్కుని, పూతలోంచి చిన్న చిన్న అప్పుడప్పుడే బయటకి వస్తున్న వేపకాయల్ని వేరుచేస్కోవాలి. కాబట్టి, ఒక పెద్ద సంచినిండా పూత తెస్తే ఓ దెసెడు నిజమైన పూత వస్తుంది. సరే ఈ పూతని సిద్ధంగా పెట్టుకో.
అయ్యాక, మామిడికాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కో. గోలీ అంత చింతపండులో ఒక ౧౦౦ మిల్లీలీటర్ల నీళ్ళు పోసి నానబెట్టు. ఒక పసినిమిషాల తర్వాత పిసికేసి, పిప్పి పారేసి ఆ చింతపండు గుజ్జుని పక్కనపెట్టుకో. ఇప్పుడు బెల్లాన్ని గుండ్రాయితో బాగా నలిపివెయ్యి. దాన్ని చింతపండు గుజ్జులో కలిపేసేయి. అయ్యక, మిర్చిని సన్నగా తరుక్కో. అరటిపండు తొక్క తీసేసి ద్వారం దగ్గర పడేయ్. బయటకి వెళ్ళేప్పుడు సరదాగా జారిపడొచ్చు. అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా తరిగేస్కో. ఇప్పుడు ఆ చింతపండు, బెల్లం గుజ్జులో మిగతా పదార్ధాలన్ని వేసి ఒక అరస్పూన్ ఉప్పు వేసి కలుపు. లాగించు. అందరికీ పెట్టు. పెట్టి పారిపో లేకపోతే ఇది పచ్చాడా అని నాలుగిస్తారు.

7 comments:

మధురవాణి said...

ఉగాది పచ్చడి ఎలా చేయాలో వివరంగా చెప్పి పుణ్యం కట్టుకున్నారు. ధన్యవాదాలు. మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు.

Anonymous said...

నాన్న గారూ ఇది ఉగాది పచ్చడా???????????
ఇప్పుడు నేను చెప్తాను కాసుకోండి. ఒక కేజి పిక్క తీసిన చింతపండు ని మలమల కాగే నీళ్ళు పోసి నాల్గ్గంటలు నానపెట్టుకోవాలి. దీనికి ఎనిమిదొంతులు అంటే ఎనిమిది కేజీల బెల్లం సన్నగా గుండలా తరు క్కోవాలి. బాగా నానిన చింతపండుని పప్పుల జల్లెడలో వేసి బాగా పామితే మెత్తటి గుజ్జు జల్లెడకింద గిన్నెలోకి వస్తుంది. ఈ గొజ్జులో బెల్లం తరుగు వేసి గ్రైండర్లో వేసి రెండూ బాగా కలిసేవరకూ రుబ్బి తియ్యాలి. ఆ......ఇదిగో ఇప్పుడు మీరు చెప్పిన మిగతా సరుకులు కలుపుకోవాలి ఒక్క ఉప్పుతప్ప. గుల్ల సెనగపప్పు (పుట్నాలపప్పు) చెరుకు ముక్కలు, మామిడిముక్కలు ,కొబ్బరి ముక్కలు ఇవన్నీ సెనగపప్పు సైజులో తరుక్కొని కలుపుకోవాలి. మర్చేపోయాను వేప పువ్వు రెక్కలు ఓ గుప్పెడు వేసేయండి. అరటిపండు మాత్రం ఎప్పటికప్పుడే కలుపుకోవాలి. ఇల చేసిన ఉగాదిపచ్చడి సాయంత్రం దాకా ఇంటికొచ్చిన అందరికీ పెట్టి, మిగిలినది పొడి సీసా లో తీసి నిల్వ చేసుకుంటే నాలుగు నెలలైనా భేషుగ్గా వుంటుంది. వేసవిలో పెరుగు అన్నం తరువాత ఒక చెంచా పచ్చడి తింటే మీరు చెప్పిన ఆ మాయదారి రోగాలన్నీ దరిదాపులకి కూడా రావు. ఇక కేజీ చింతపండూ, ఎనిమిది కేజీల బెల్లం అన్నది మా ఇంట్లో లెక్క. మరి మీ ఇంట్లో మీ ఇష్టం,

జ్యోతి said...
This comment has been removed by the author.
జ్యోతి said...

మరి అచ్చమైన తెలంగాణా పచ్చడి చెప్పనా...

లెక్కలు మనకు కావలసినట్టుగా. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ..

పల్చని చింతపండు నీళ్లు + బెల్లం నానబెట్టి వడగట్టిన నీళ్లు, తురిమిన మామిడికాయ, ఎండుకొబ్బరి, కొంచెం వేప పూత, కాసిన్నిగసగసాలు, పుట్నాలపప్పు, కొంచెం సోంపు, జీలకర్ర, యాలకులు కలిపి చేసుకున్న పొడి. ఇవన్నీ కలిపి కొత్త కుండలో పోసి పెట్టుకోవాలి. పూజ అయ్యేవరకు అది చల్లగా అవుతుంది. ఇక షర్బత్ తాగినట్టు గ్లాసునిండా పోసుకుని తాగడమే. సాయంత్రం కుండలో నుండి తీసి ఫ్రిజ్ లో పెట్టుకుని మరునాడు మాత్రమే తాగొచ్చు.. అసలైతే కొలతలు ఉండవు. సుమారుగా వేసుకోవడమే వస్తువులన్నీ.

బుజ్జి said...

@jyothigaru,
mafriend dani meeda jokulestoo untundi, adi ugadi pachadi kadu, ugadi pulusu ani..

జ్యోతి said...

బుజ్జిగారు,
ఎవరి పద్ధతి ప్రకారం వారు చేస్తారు, జోకులేయడం. వెక్కిరించడం మంచిది కాదు.

madhu said...

భలే భలే ! పసందైన ఉగాది పచ్చడి,పానకం ,వడపప్పు రెసిపీ !

అదేంటో, అన్ని పచ్చళ్ళలో నాకు ఉగాది పచ్చడంటే బోల్డు ఇష్టం ! మా ఇంట్లో నాకు భీముడికి పెట్టినట్టు బోల్డు పచ్చడి పెట్టేసి,(నాకు బోల్డు ఇష్టం కనుక ) అందరు తినాలి అన్నట్టు కూసింత తినే వాళ్ళు... మా అమ్మ గారు బాగా చేసేవారు ఆ పచ్చడి ...

మీకు..మీ కుటుంబానికీ..ఉగాది ఉగాది, శ్రీరామ నవమి శుభాకాంక్షలు !