Wednesday, December 31, 2008

ఓ శుక్రోరం సాయంత్రం!!

ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2009 మీకు ఆనందాన్ని కలుగజెయ్యాలని కోరుకుంటున్నా.


ఓ శుక్రోరం సాయంత్రం, మరి వైటీ(IT) జనాలకి పండగేగా శుక్రోరం అంటే, బుడ్లు తెచ్చుకుని, పేపరు పరిసి, చిప్పిసు, ఓ నాలుగు మిర్చి బజ్జీలు, ఓ సోడా, నాలుగు పొట్లాలు వేపిన మసాలా బఠాణీలు పెట్టుకుని, గుటుక్కున ఓ గుక్కేడు బుడ్లోంచి గోతులోకి ఒంపేస్కుని, గబ్బుక్కున ఈ చెత్తని నోట్టోఏస్కుని కరకరా నముల్తూ, ఆపీసోడి తొడలపైనబొక్కు (LAPTOP) లో సగవ్ సీకటెల్తుర్లో పాతకాలపు ఇషాద పాటలేస్కుని ఇలా
చౌదవిక చాంధో యా అఫ్తాభ్ హో జోభీ హొ తుం ఖుదాకి కసం లా జవాబుహో..
బహరొం ఫూలు బరసావో మెర మెహబూబు ఆయాహై మెరా మెహబూబు ఆయాహై..
అభీనజావో ఛోడ్ కర్ ఏ దిల అభీ భరా నహి..
జిందగీ భర్ నహి భూలేగి ఓ బరసాత్ కి రాత్..
హం బేఖుదీమె తుంకో పుకారే ఛలేగయే..
సుహాని రాత్ ఢల్చుకి నాజానె తుం కబావొగె..
కభీ కభీ మేరె దిల్ మే ఖయాల్ ఆతాహై..
कभी कभी मेरे दिल मैं ख्याल आता हैं
कि ज़िंदगी तेरी जुल्फों कि नर्म छांव मैं गुजरने पाती
तो शादाब हो भी सकती थी।

यह रंज-ओ-ग़म कि सियाही जो दिल पे छाई हैं
तेरी नज़र कि शुओं मैं खो भी सकती थी।

मगर यह हो न सका और अब ये आलम हैं
कि तू नहीं, तेरा ग़म तेरी जुस्तजू भी नहीं।

गुज़र रही हैं कुछ इस तरह ज़िंदगी जैसे,
इससे किसी के सहारे कि आरझु भी नहीं.

न कोई राह, न मंजिल, न रौशनी का सुराग
भटक रहीं है अंधेरों मैं ज़िंदगी मेरी.

इन्ही अंधेरों मैं रह जाऊँगा कभी खो कर
मैं जानता हूँ मेरी हम-नफस, मगर यूंही

कभी कभी मेरे दिल मैं ख्याल आता है. **

పాడుకుంటూ....ఎక్కడున్నాన్నేను...

రోజులు మారుతున్నాయ్..ఎక్కడబడితే అక్కడ ఏదిబడితే అది తింటే సస్తావ్ అని పెద్దల సామెత
ఓ శుక్రోరం సాయంత్రం ఇంటికాడ ఇట్టాజేస్కుని సూడండి:
మసాలాపాపడ్
సానా వీజి. ఆపీస్ నుంచి ఇంటికెళ్లేప్పుడు కూరగాయల కొట్టుకాడ ఓ చటాకు మిర్చి, ఓ కట్ట కొత్తిమీర, ఓ కట్ట పుదీనా, ఓ రెండు టమాటాలు, ఓ రెండు ఉల్లిగడ్డలు, ఓ నిమ్మకాయ కొనుక్కో. పక్కనే దుకాణంలో పాపడ్ కొను. ఎట్టాంటి పాపడ్, నీ రెండు అరసేతుల్నికలిపినంత పెద్దవి. ఏట్టా ఉండాల, పైన మిరియాలు ఏసిఉండాల. ఆటిని తీస్కో. ఇంటికిజేరు (బుడ్లెత్తుకెళ్లు, అదినేజెప్పాల్సిన పనిలేదనుకో).
ఇక మొదలెట్టు.
ఓ ఉల్లిపాయని సన్నగా తరుక్కో. మసాలా బండోణ్ణి గుర్తుకుతెచ్చుకో, అదే వచ్చేసుద్ది సన్నగ తరగటం. ఇప్పుడు, మిరగాయలు ఓ నాలుగు తీస్కో, కడుగు, సన్నగా తరుగు. ఇక పుదీనా తీస్కో కడుగు. సన్నగా తరుక్కో, ఇక కొత్తిమీర, బాగా కడుగు, సన్నగా తరుక్కో. ఇక మిగిలింది టమాటా, కడుక్కో ఓ సారి టమాటా ని, జాగర్తగా సన్నగా తరుక్కో, చితకిపోనీమాక ఆటిని. ఇప్పుడు, నిమ్మకాయ కోసేసి పెట్టుకో ఓ పక్కన. అన్నీ ఓ గిన్నెలో వెయ్యి, బాగాకలుపు, కొంచెం ఉప్పు వెయ్యి, కలుపు, నిమ్మకాయ పిండు. పక్కనబెట్టుకో.
ఇక పొయ్య ఎలిగించు. అప్పడాలని కాల్చు. మంట అంటీ అంటకుమండా కాలిస్తే బాగ వస్తాయ్, లేకపోతే మెలికలు తిరిగిపోయ్ బాగుండవు. మైక్రోవేవు ఉంటే, ఇంకా వీజీ. అప్పడం దాంట్లో ఎట్టేసి ఓ 30 సెకెండ్లు కొట్టావంటే తిరుగుండదు. సరే నీ తిప్పలు నువ్వు పడు. కల్చుకో మొత్తానికి, సేతులు కాదు, అప్పడం.
ఇక కుర్సో, ఓ అయిపు ఇందాకటి గిన్నెట్టుకో, ఇంకో అయిపు బుడ్డీ, ఓ సేత్తో అప్పడం. అప్పడం ఇరగ్గొట్టి గిన్నలోని మసాలో స్కూపుజేస్కుని లాగించు.
కొంతమంది అప్పడం పైన జల్లేస్కుంటారు. దానివల్ల అప్పడం మెత్తబడి, అప్పడం చపాతీ అవుతుంది.


కార్న్ మసాలా
నీలగిరీస్కో లేక ఫుడ్డు వరల్డ్కో ఎళ్లి గోయా మొక్కజొన్న టిన్ను తెచ్చుకో.
ఇందాకజెప్పిన మసాలా సిద్ధంచేస్కో. టిన్ను తెరువు. ఎలా? టిన్ను ఓపెనర్ ఉంటుంది దాంతో, బీరు ఓపెనర్తో రాదు బాబాయి, ట్రై సెయ్యటం దండగ. సరే, తెరిచాక, నీళ్లు ఒంపేసి, ఆ మొక్కజొన్నని ఓ సారి మాములు నీళ్లతో రిన్సు* చేసి పక్కన బెట్టుకో. పొయ్యి ఎలిగించు. ఓ మూకుడెట్టు. ఈ మొక్కజొన్నని ఓ సారి వేపు. వెంటనే తీసెయ్. ఉప్పు కారం వేస్కోఇందాకటి మసాలా కలుపు, నిమ్మకాయ పిండు ..ఇక లాగించు.

చెన్న మసాలా
గోయా గాడి చెన్న టిన్ను తెచ్చుకో. ఓపెనుజేసి, ఓ సారి కడుగు*. పొయ్యి ఎలిగించు. ఓ చెంచాడు నూనె వెయ్. ఎండు మిర్చి ఒకటివెయ్, ఏపు, కాంగనే ఓ వెల్లుల్లి రెబ్బ వెయ్, ఏపు, కాంగనే ఈ చెన్నా వెయ్. ఏపు, ఉప్పు కారం ఏస్కో, దీంపేసేయ్, ఇక లాగించు. ఈటినే గుగ్గిళ్లు అంటారు. ఈ పద్ధతినే శాతాలించటం అంటారు.

ఇంకోరకం చెన్నా మసాలా:
పొయ్ పెట్టు, ఓ టమాటా తరిగేసి దాంట్లో వెయ్, గంటె పెట్టి చిదుము, దాంట్లో చెన్నా వెయ్, ఉప్పు, కారం, ధనియా పొడి వేసి కుతకుతలాడంగనే దింపెయ్, దిపాక ఇందాకటి మసాలా అదేనయ్యా తరుక్కున్న ఉల్లిపాయలు కొత్తిమీర, పుదీనా, తరుక్కున్న మిర్చి, వేసేసి ఓ సారి బాగా తిప్పి నిమ్మకాయ పిండి లాగించు. దీన్నే మేము గుంటూరులో మసాలా బండోడిదెగ్గర తింటాం. ఇక్కడ చదువుకో దానిగురించి కావాలంటే.
ఈటిని తింటా ఈ పాటలు ఇనుకో!!!!!
మామా చందమామా వినరావా నా కధ..
నీలాలా నింగిలో..
నేనొక ప్రేమ పిపాసిని..
రాగాల పల్లకిలో కోయిలమ్మా..
మబ్బే మసకేసిందిలే..
కధగా కల్పనగా..
గంధము పూయరుగా..
ఓ బంగరువన్నెల చిలకా..
ఎవరికెవరు ఈ లోకంలో..
అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా..
ఏ కులము నీదంటే గోకులము నవ్విందీ..
పూలు గుస గుసలాడేనని..



* కడగటం అంటే rinse thru water అని.

Tuesday, December 16, 2008

సిక్కుడుకాయ కూర ఇదానంబెట్టిదనగా

ఇనరా తెలుగు ఈర పుత్రుడా ఈ సిక్కుడుకాయ కూర ఇదానం
తందాన తానా
"స్రోతలందరికీ నమస్కారాలు. బెమ్మసారిగా ఈ జానెడు పొట్టపడే కష్టాలకి సిక్కుడు సెల్లి సేసే సేవ ఇప్పుడు మీముంగట ఇరియబోతున్నది"
"ఆగు సోదరా ఆగు! జానెడు అన్నాడు, పొట్ట అన్నావు, అన్నా! మాకు ఇంకా ఇవరంగాజెప్పు"
"అదేరా! గదుల్లో సమయానికి తొండిలేక, కళ్లముంది పచ్చటి కూరగాయలెన్నున్నా సేస్కోటం రానోళ్లకి ఆకలి మంటేగా"
"ఈసారి అర్ధం ఐంది సోదరా, నిజంగా కష్టలే, మరి సిక్కుడుకాయ కూర ఎట్టాజేస్తారో ఇవరంగా జెప్పు"
"ఇనరా తెలుగు ఈర పుత్రుడా ఈ సిక్కుడుకాయ కూర ఇదానం"
తందాన తానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
తందానా దేవనందనానా.. తందానా దేవనందనానా
"ముంగట కిలో సిక్కుళ్లు"
"సై"
"ఇంటికి సంచిలో తెచ్చుకో"
"సై"
"సిక్కుళ్లని కదిగావా, ఒక పళ్లెమ్లో పోసావా"
"భాళా భళీ" ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"సిక్కుళ్లని కడిగావా, ఒక పళ్లెమ్లో పోసావా"
భాళా భళీ
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"ఒక్కో సిక్కుడు తీసుకో"
"సై"
"ఈనెల్ని ఇర్సుకో"
"సై"
"మూడు ముక్కలుజేసుకో"
తందాన తానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"అగ్గి పెట్టి పొయ్యి ఎలించి"
భాళా భళి
"ఓ పెద్ద గిన్నెలో నీళ్లతో"
భాళా భళి
"ఆ పొయ్యిమేద బెట్టేసి"
సై
"నీళ్లు మరగంగనే"
సై
"గిన్నెడు నీళ్లు మరగంగనే"
సై
"ఆ గిన్నెడు నీళ్లు మరగంగనే"
తందానా దేవనందనానా
"ఒక చిటికెడుపసుపుఏస్కో"
సై
"ఒక చెంచా ఉప్పు ఏసుకో"
సై
"ఆ సిక్కుడు ముక్కలు కుమ్మరించుకో"
భళా భళీరా సోదరా, బాగున్నదిరా ఈ కూరరా.హై
"మూతబెట్టి బాగా ఉడకనీ"
హై
"బాగా ఉడికినాక పొయ్యిని ఆర్పేసి"
హై
"ముక్కల్ని వడగట్టి"
హై
"ఓ పక్కన సిద్దంగా బెట్టుకో"
తందాన తానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"ఇప్పుడింకేమి సెయ్యాలో ఇవరంజెప్పు అన్నా"
"అట్టాగేరా, ఇనుకో"
సై
"అగ్గి పెట్టి పొయ్యి ఎలించి"
భళాభళి
"ఓ చెంచాడు నూనెపోసి"
భళాభళి
"తిరగమాతే వేసావా"
తందాన తానా
"తిరగమాత శిటపట అన్నదా"
తందాన తానా
"ఓ రెండు వెల్లుల్లి రెబ్బలు"
భళాభళి
"ఓ రెండు వెళ్లి రెబ్బలు"
భళాభళి
"ఓ రెండు వెళ్లి రెబ్బలు"
భళాభళి
"నలగ్గొట్టి దాంటో ఏసావా"
తందాన తానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
తందానా దేవనందనానా.. తందానా దేవనందనానా
"ఇప్పుడు కొంచెం ఉప్పేసుకో"
తందాన తానా
"కొంచెం కారం ఏసుకో"
తందాన తానా
"ఇప్పుడు ఆ సిక్కుళ్లని"
తందానా దేవనందనానా
"ఇప్పుడు ఆ సిక్కుళ్లని"
తందానా దేవనందనానా
"ఆ భాండీలో ఏసుకో"
తందానా దేవనందనానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"ఆ కూరని ఓ సారి తిప్పావా"
సై
"ఓ 5 నింషాలు పొయ్యిమీనే ఉంచావా"
సై
"ఇప్పుడింక పొయ్యినాపేసి, ఆ కూరని దింపుక్ని లాగించు"
"అయ్యింది అన్నా, బలే బాగాజెప్పావ్,కూరా సానా రుసిగా ఉంది"
"ఇందుమూలంగా యావన్మందికి నమస్కారాలతో ఇక సెలవ్ దీస్కుంటూ"
"జై హింద్"
నోట్: సిక్కుడుకాయ ఇలా జెయ్యాలి అని ఎక్కడా లేదు. ఒక్కోరోజు కారంతోబాటు కొబ్బరి తురిమేసి సేస్కుంటే, ఇంకోరోజు మాడ్చిన కారం దీన్నే మేము కారప్పొడి అంటాం - ఇదేస్కోవచ్చు, ఇంకోపూట కొబ్బరి కారం, ఇంకోసారి శనగపొడి (పుట్నాల పప్పు, ఎండు మిర్చి, ఉప్పు తిరగమాతలో వేసి దంచితే వచ్చే పొడి) ఇలా రకరకాలుగా వండుకోవచ్చు.
సిక్కుడుకాయకి ఈనెలు తియ్యటం ఎలా? ఇక్కడ సూడండి
వంట

Wednesday, December 3, 2008

పిజ్జా పురాణం

ఎందుకో ఇది రాయాలనిపించింది.
పిజ్జా (pizza; should be read as pit.tsa. In Italiano, z=ts) అనేది, దక్షిణ ఇటలీ పట్టణమైన నపొలి (దీన్నే నేపుల్స్ అని కూడా అంటారు) లో ఎప్పుడో గడచిన కాలమ్లో పేదవాడి బ్రెడ్. బ్రెడ్డు, మీద టమాటా సాసు అదీ పీజ్జా అంటే. తర్వాత్తర్వాత నపొలి కి సందర్శకులు ఎక్కవగా రావటం, దేనికంటే అదొకపెద్ద వ్యాపార కేంద్రం, అక్కడకి దెగ్గర్లో ఓ అగ్నిపర్వతం ఉండటం, కొన్ని రకాల చేపలు అక్కడ విరివిగా దొరకటం ఇలా ఎన్నోకారణాలవల్ల జనాల తాకిడి ఎక్కువకావటం, వచ్చిన వాళ్లు ఈ పేదోని ఆహారాన్ని ఇష్టపడటం అలా అలా ఇది వ్యాప్తి చెందింది. ఇప్పటికీ నపొలి పీజ్జా అంటె ఆ రుచే వేరు. ఈ బేసిక్కు పీజ్జా లో మూడు రంగులు ఉంటాయ్. అవి - టామాటా సాస్ - ఎరుపు , మొజరిల్ల ఛీజ్ - తెలుపు, బేసిల్ ఆకులు - ఆకుపచ్చ - అవే ఇటాలియన్ ఝెండా రంగులు. దీన్నే పీజ్జా మార్గరిటా అనికూడా అంటారు. ఇలాంటిదే పీజ్జా మరినారా. తేడా ఏంటి అంటే - మరినారా పీజ్జా మీద మొజరిల్లా ఛీజ్ కి బదులు వెల్లుల్లి, ఒరెగానొ వేస్తారు.

కాబట్టి నపొలి పీజ్జా అంటే - పల్చని బ్రెడ్ లేక క్రస్ట్, దానిమీదటమాటా సాసు, మొజరిల్ల ఛీజ్ మరియూ బేసిల్ ఆకులు. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటి - దీన్ని కాల్చే పద్ధతి. కట్టెలు పెట్టి, ఇటుకల పొయ్యి- బ్రిక్ ఒవెన్ - లో కాలుస్తారు. అదీ దీని అసలు రహస్యం.

ఏమాటకామాట - ఆరోజుల్లో, మా కార్యాలం నుండి రూముకి వెళ్లే దారిలో ప్రోంతో పీజ్జా అనే ఒక పిజ్జేరియా లో, ఇంటికి వెళ్తూ వెళ్తూ ఓ మీడియం పీజ్జా మార్గరిట ని ఆర్డరు జేస్కుని ఇంటికి పరిగెత్తుకుంటు వెళ్లి జ్యూసీగా ఉండె ఆ పీజ్జా ని వేడి వేడిగా లాగింస్తుంటే - అద్భుతం. అదేదో పాటలోలా "ఆరోజులు మళ్లీ రావేల నేస్తం" (అక్కినేని, ప్రభాకర్ రెడ్డి, కార్తీక్, అమల - ఏంసినిమా అబ్బా అది, ఏంపాటబ్బా అదీ? యాద్కొస్తల్లే)....

పాస్తా

ఆన్ సైట్ కి వెళ్లినోళ్లకి తిండి ఓ పెద్ద సమస్య. కొంతమంది "హా! డబ్బాలో మన వన్నం, బిర్యాని, పప్పుకూరలేస్కెళ్తే మసలా వాసన్లు వస్తాయ్, క్లైంటు దడ్చుకు సస్తాడు" అని అనుకుంటారు. నేను మా కార్యాలమ్లో నా సీట్లోనే కూర్చుని, అన్నం దోసకాయ పప్పు, ఆవకాయ వేస్కుని చేత్తో హ్యాపీగా కలుపుకుని లాగిస్తా. మా మేనేజెర్ వస్తే - ఓ సారి జూసి ఓహ్ అని వెళ్లిపోతాడు. బొంగు! మన బువ్వ మన ఇష్టం. అనిజెప్పి ఎండుచాపల పులుసు తీస్కెళ్లలేంలే.

చాలా సింపుల్గా, రుచిగా, డబ్బాలోబెట్టుకుని, మైక్రోవేవ్లో వేడిజేస్కుని తినగల్గే వంటల్లో పాస్తా ఒకటి. ఈ మధ్య మల్టై గ్రైన్ పాస్తా కూడా దొరుకుతున్నది మార్కెట్లో.
సరే పాస్తా అంటే అది మనదే. మన ఉప్మ కూడా ఓరకం పాస్తానే. ముందు ఈ పాస్తా సంగతేంటో జూద్దాం.
పాస్తా అంటే ఇటాలియన్లో "తడిపిన పిండి" అని అర్ధం, చపాతీపిండిలా. పాస్త అంటే ఇలాంటి పిండితో వండే వంటలు అనుకోవచ్చు. కొంతమంది "పాస్తాతో వండిన వంటల్ని పాస్తా" అంటారు. :):) అదేనాయనా గమ్మత్తు. అర్ధంకాకపోతే పాస్త వండుకుని హ్యాప్పీగా ఓ గళ్లాసులో దాచ్చారసం పోస్కుని పాస్తా తింటూ తాగుతూ అట్టా బైటపడే మంచు సూత్తా ఎన్సోయ్ చెయ్.

సరె మొత్తం 350 రకాలు ఉన్నాయంట పాస్తాల్లో.
స్ప్రింగుల్లాంటివి, గొట్టల్లంటివి, బొంగుల్లాంటివి, చెక్కల్లాంటివి, ముక్కల్లాంతివి, బీడీల్లాంటివి, సుట్టల్లాంటివి, తాళ్లలాంటివి, తేళ్లలాంటివి, నాలాంటివి, నీలాంటివి...et al.

తాడుల్లాంటి అదే పావులాఉండే పాస్తాని స్పగెటి అనికూడా అంటారు.

ఇంక ఈ సమాచారం సాలు, ఇసయంలోకొస్తే:-
పాస్తా సెయ్యటానికి ఏంగావాలా? పాస్తా గావాల. వాల్మార్ట్కో (సూపర్సెంటర్), లేక శాంస్కో లేక బీజేస్కో ఎళ్లినప్పుడు బరిల్లా పాస్తా కోసం వెతుకు. ఇదిగో ఇట్టాంటివి తెచ్చుకో


సరే - స్ప్రింగులు తెచ్చుకున్నావ్ అనుకుందాం.
ఇంకేంగావాలి? ఎజిటేబిళ్లు - అంటే కూరగాయలు. ఏమి కూరగాయలు - నీకు దొరికినవన్నీ - బీన్సు, క్యారెట్టు, బ్రొక్కొలి, బేబీ మొక్కజొన్న - మరియూ ఏ మరియూ ఆ మరియూ పా. ఇంకా, టమాటాలు, మిరగాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, నూనె, కొత్తిమీర.
ఏమి నూనె - నీకు తెలిస్తే ఆలివ్ ఆయిల్ (1), లేకపోతే, మనం మామూలుగా వాడుకునే నూనె.

చేసే పద్ధతి :
ఓ పెద్ద గిన్నే తీస్కో నువ్వు వండుదాం అనుకునే పాస్తా మెత్తం దాంట్లో పట్టగలిగేంత పెద్దది. పాస్తా మునగగలిగేంత నీళ్లు పొయ్. నీళ్లు సల సల కాకంగనే పాస్తా దాంట్లో వెయ్, కొంచెం ఉప్పు వెయ్ (బాసు!! ఉప్పు వెయ్, పొయ్యకు), ఓ చెంచాడు నూనె వెయ్ (2). ఇక ఉడకని. మీడియం లో పెట్టు మంటని పాస్తా గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది ఆ మంటతో.
ఇప్పుడు, ఉల్లిగడ్డ సన్నగా నిలువుగా తరుక్కో, మిరగాయ, నిలువుగా నాలుగు ముక్కలు జేస్కో, కూరగాయ ముక్కలన్ని తరుక్కో. బీన్స్, ఒక్కోటి నాలుగు ముక్కలు, బ్రొక్కొలి చిన్న చిన్న గుత్తులుగా, క్యారెట్టు చిన్న చిన్న క్యూబుల్లా తరుక్కో, టమాటా కూడా చిన్న చిన్న క్యూబుల్లా తరుక్కో, కొత్తిమీర కడుక్కో, పక్కనబెట్టు. ఈలోపల పాస్తా ఉడికిందేమో జూడు. ఎలా, ఓ పాస్తాని చెంచా పెట్టి గిన్నె గోడకేసి నొక్కు మెత్తగా విడిపోతే ఉడికినట్టు. సరే ఉడకంగనే పొయ్ ఆర్పివెయ్, ఓ జల్లెడ తీస్కో, సింకు దెగ్గరకి జల్లెడ, పాస్తా ఉడ్కబెట్టిన గిన్నే తీస్కెళ్లి, వడపొయ్ - గిన్నెని ఆ జల్లెడలో బోర్లించు. చల్లటినీళ్లని ఓసారి ఆ జల్లెడ మీడుగా పోని. పక్కనబెట్టు. ఇందాకటి గిన్నె తీస్కో, ఓ సారి కడుక్కో, మళ్ళీ పొయ్యి మీద బెట్టు. నూనె పొయ్. నూనె వేడెక్కేలోపు, వెల్లులి తీస్కో, బొటనవేలితో ఘట్టిగా నొక్కు, తొక్క తీయ్, పక్కనబెట్టు, నూనె వేడెక్కింది, దాంట్లో తరుక్కున్న మిరగాయ వెయ్, చిట్ పట్ అంటుంది, దడుసుకోకు, ఓ సారి తిప్పు, వెల్లుల్లి వెయ్, ఓ సారి తిప్పు, ఇప్పుడు - తరుక్కున్న ఉల్లిపాయలు వెయ్, వేపు - వేగినయ్ అనుకున్నాక, కూరగాయ ముక్కలు వెయ్, వేపు - వేగినయ్ అనుకున్నాక టమాట వెయ్, ఉప్పు వెయ్, ఓ సారి తిప్పు, టమాటా కొంచెం ఉడకని, ఇప్పుడు ఉడ్కబెట్టిన పాస్తావెయ్, తిప్పు, కొత్తిమీరతో ముగించు.
రిఫరెన్సు:
1. ఆలివ్ ఆయిల్ - ఇదేంటిది అనుకుంటున్నావా? అదే కహానిలో ట్విష్టు. ఆలివ్ ఆయిల్ నాలుగైదు రకాలు.
ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ - కోళ్డ్ ప్రెస్సింగ్ ద్వారా తీసేది. 0.8% ఆమ్లత్వం.
వర్జిన్ ఆలివ్ ఆయిల్ - 2% ఆమ్లత్వం. దీనికి రుచి ఎక్కువ
ప్యూర్ ఆలివ్ ఆయిల్ , ఆలివ్ ఆయిల్ - వర్జిన్ ఆలివ్ ఆయిల్ + రిఫైండ్ ఆయిల్
et al.
దీంట్లో సంగతి ఏంటంటే కొన్ని రకాల ఆలివ్ ఆయిళ్లని ఫ్రై వంటల్లో వాడకూడదు. వాటిని కేవలం డ్రెస్సింగుకి మాత్రమే ఉపయోగించాలి.
2. ఉడుకుతున్నవాటిల్లో నూనె దేనికి? అన్నంలో కూడా ఓ బొట్టు నెయ్యి వేస్తే - అన్నం పొడిపొడిలాడుతుంది. అట్టానే ఇక్కడకూడా నూనె వేస్తే పాస్తా కరుచుకోకుండా విడివిడిగా ఉంటాయ్.

నోట్: పాస్తా చేసే విధానం ఇది అని ఎక్కడా లేదు. ఐతే - ప్రాంతాలవారీగా ఫేమసు ఐన విధానాలు ఉన్నయ్. అంటే గోల్కొండ నవాబులు ఒకలా, పల్నాటి వీరులు ఇంకోలా, విశాఖ అరసం సభ్యులు ఇంకోలా చేస్కుంటారు.

మరి ఇంక ఆలస్యం దేనికి లాగించండి.

Friday, November 21, 2008

OnDemand (TM) పై ఈ కింది వంటకం

నా నిన్నటి పోష్టు - కాఫీ లో నన్ను ఓ బ్లాగరి ఇలా సవ్వాల్జేసారు:
పప్పు వొప్పు దేముంది ఎవుడైన జేస్తాడు, దమ్ముంటే గింబళి తేగలరా(మాయాబజార్ నుండీ కాపీకొట్టా) అన్నట్టు - గుత్తి వంకాయ ఎవరైనా చేస్తారు కానీ,మీ నలభీమ పాకం లో , గుత్తి గుమ్మడి కాయ, గుత్తి సొర కాయ(ఆనప కాయ) కూరల రెసిపీలు (కూడా?) ఇద్దురూ ?

అహా!! ఛాలెంజ్లు నేనె ఎప్పుడూ స్వీకరిస్తా: కాస్కో- ఇదే గుత్తి గుమ్మడికాయ కూర:-
ఓ "గుమ్మ"డికాయ తీస్కో - మంచిగుమ్మడనుకుంటున్నా - అడ్డంగా రెండు ముక్కలుజేయ్. దానిపొట్టలోని ఇత్తనాలు తీసెయ్, పైన తొక్క ఒలిచెయ్. పక్కన పెట్టు. మొన్న చేస్కున్న బంగాళదుంప కూర ఉందిగా అది తీస్కో, ఇందాక చేసిన గుమ్మడికాయ రెండుముక్కల్లో కిందముక్క తీస్కో, ఈ కూరతో దాన్ని నింపు పక్కనబెట్టు. పైముక్క తీస్కో, కూరతో నింపు - కిందముక్కని పైముక్కతో కూరకిందపడకుండా మూసేయ్. ఇప్పుడు ఓ తాడు తీస్కో, దాన్ని కట్టేసేయ్.
ఓ పెద్ద భాండీ తీస్కో, గుమ్మడికాయని దాంట్లో పెట్టగలిగేంత పెద్దది. పొయ్ వెలిగించు, ఆభాండీ పెట్టు, ఓ నాలుగు చుక్కలు నూనెపొయ్, నూనె కాగంగనే ఈ గుమ్మాడికాయ దాంట్లో వెయ్, ఇక వేయించు, గుమ్మడికాయ రంగు మారంగనే (అసలు రంగునుంచి ఏరంగుకైనా) ఉప్పు కారం, కొంచెం కారప్పొడి జల్లు, ఆ తాడు కోసేయ్, ఇక లాగించు.
పక్కనోళ్లకి మాత్రం పెట్టకు. పాపం, వాళ్లనొగ్గేయ్.

ఇది కేవలం పిల్లాట

Monday, November 17, 2008

కాఫీ

రూమ్ముల్లో ఉండే పోరగాండ్లకి కాఫీ/చాయ్ గంట గంటకీ పడకపోతే పిచ్చిడాట్కోడాటిన్ ఎక్కుంతుంటుంది. అంటే పెళ్లైనోళ్లకి ఇలా ఉండదూ అని కాదు - సరే బేరం దేనికీ - కొందరికీ కాఫీ గంట గంటకీ పడుతుండాలి. నేను మాఆవిడాతో "ఒక చిన్న హెల్ప్" అని అనంగనే "ఏంటి ఓ కమ్మని కాఫీకావాలా!!" అని రెప్లై ఇచ్చేస్తుంది.

అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావ్ దెగ్గర ఎవరైనా పొరబాటున "బం" అని అనీఅనకుండానే మీది బందరా అన్నట్టు, నా దెగ్గర ఎవరైనా కా అంటే చాలు, కాఫీ కొడదామా అనేస్తా. అదినా వీక్నెస్సు. :)
ముందు ఈ కాఫీ కధేంటో చూద్దాం.
ఎవుడు కనిపెట్టాడు, మనదా, అఫ్రికాదా..కన్నా..నాకు తెల్సింది చెప్తా.
కాఫీని రకరకాలుగా జేస్తారు. నాకు తెలిసి ఇటాలియన్లు కాఫీ తెయ్యారుచేసే విధానాన్ని బజ్జీ (MASTER) కొట్టారు.
సరే మనోళ్లు యుగ యుగాలుగా "పిల్టర్ కాపీ" ని తయ్యారు చేస్తూనే ఉన్నారు. ఆనాటి అర్జునుడుకూడా కురుక్షేత్ర సంగ్రామమ్లో పీకల్లోతు యుద్ధమ్లో ఉండికూడా, కాఫీ బ్రేక్ అని అరిచి అటైపోళ్లకీ ఇటైపోళ్లకీ పిల్టర్ కాఫీ పోయించేవాడని కాఫీపురాణామ్లో రాశుంది.

హా!! కాఫీలు రకరకాలు -
కాఫీ, బుర్రు కాఫీ, బ్రూక్బాండ్ కాఫీ, ఇత్తడి కాఫీ, కాఫీడే కాఫీ, హిమగిరి కాఫీ, నీలగిరి కాఫీ...పిల్లాట (కిడ్డింగ్)

ఎస్ప్రెస్సో, కపూచ్చినో, మోకా, లత్తే, మక్కియాతో, మోకచ్చినో, ఫ్రప్పే, లుంగో అమెరికానో, రిస్త్రెత్తో, పిల్టర్ కాఫి.

ఎస్ప్రెస్సో
ఒక కప్పులో కాఫీ పొడి వేసి, వేడి వేడినీటిని దాణిగుండా పంపిస్తే వచ్చేదే ఎస్ప్రెస్సో.

కపూచ్చినో
ఒకట్లో మూడుపాళ్లు ఎస్ప్రెస్సో, మూడుపాళ్లు "స్టీండ్" పాలు, మిగతాది పాల నురగ.

లత్తే
అంటే పాలు అని లాటిన్లో. ఎస్ప్రెస్సో కాఫీ లో వేడి పాలు. ఇది మన కాఫీకి దెగ్గరగా ఉంటుంది.

మోకా
లత్తే లో చిక్కొలాతో అంటే చాకోలేట్ వేసి కలిపితే మోకా.

మక్కియాతో
ఎస్ప్రెస్సో మీద ఒక స్పూన్ నురగ వేస్తే మక్కియాతో.

మోకచ్చినో
ఒకటికి నాలుగోవంతు చిక్కటి ఎస్ప్రెస్సో, ఇంకో నాలుగోవంతు చాకొలేట్, మిగతాది పాలు, పాల నురగ.

ఫ్రప్పే
నాకు బాగా గుర్తూ!! ఏథెన్స్ లో నా మొట్టమొదటిరోజు, నాపక్కన కూర్చునే దిమిత్రిగాడు నన్ను మా కార్యాలయం వంటగదికి తీస్కెళ్లి, నెస్కఫే ఓ స్పూన్, పందార, నీళ్లు ఓ లోటాలో పోసి, గిలక్కోట్టే మరతో ఓసారి దాన్ని బాగా గొలక్కొట్టి ఐసుముక్కలేసి ఇక లాగీ అన్నాడు. ఏందిరా మియా అది అంటే ఓర్నీ!!! ఇది తెలియదా!! హా!! దీన్నే ఫ్రప్పే అంటారు అని పోజుకొట్టాడు.
ఫ్రప్పేని గ్రీకులు ఎండ్లకాలం బాగా తాగుతారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం తాగుతున్నార్లే.

అమెరికానో - లుంగో
పేరులోనే ఉంది. అమెరికన్ ఇష్టైల్ కాఫీ అని. నీళ్ల నీళ్లగా ఉండే కాఫీ - లుంగో అంటే లాంగ్ అని, అంటే ఓ పెద్ద లోట అని. దీన్నె ఇక్కడ రెగ్యులర్ కాఫీ అంటాం. నల్ల తుర్రునీళ్ల దికాక్షన్ అన్నమాట.

రిస్రెత్తో
అంటే రిస్ట్రిక్టెడ్ అని, అంటే కొంచెం లేక షార్ట్ అనికూడా అనుకోవచ్చు. లేకపోతే అతి తక్కువ నీళ్లతో ఎస్ప్రెస్సో. ఒక చుక్క గొంతులోఏస్కుంటే చేదు నషాలానికి అంటాలి. అంతే, ఒకేఒక షాట్ టకీలాలాగా.

పిల్టర్ కాఫీ
హమ్మయ్య..వచ్చేసా మనదెగ్గరకి.
ఎలా చేస్కోవాలి?
కావాల్సినవి - ఓ ఫిల్టర్. ఇదిగో ఇలాంటిది (వికీ నుంచి లాక్కొచ్చా ఈసిత్రాన్ని)

బహుసా ఓ 100 కి మంచిదే దొరకొచ్చు.

ఇంకా, పాలు, పందార (నేను పందార లేకుండా తాగుత)
మరియూ నీళ్లు, ఓ పొయ్య్, గిన్నె, నువ్వు, నేను మరియూ కాఫీపొడి.

బ్రూక్బాండ్ గ్రీన్లేబుల్ తెచ్చుకో.

ముందుగా పొయ్ వెలిగించు, నాలుగు గళాసుల నీళ్లుపొయ్. మరిగించు. మరిగాక, పొయ్ ఆర్పివెయ్. పిల్టర్ తీస్కో. పిల్టర్ కి మొత్తం 4 పార్ట్స్ ఉంటాయ్. కిందది కలెక్టరు, పైన కంటైనరు, లోపల పిల్టర్, పైన మూత. ముందు పిల్టర్ సెటప్ సరిగ్గా ఉందోలేదో జూడు. కింద కలెక్టరు, దానిపైన సరిగ్గా ఇన్స్టాల్ చేసిన పై కంటైనరు - అదీ బేస్ సెటప్. పైన కంటైనర్లో పిల్టర్ సరిగ్గా పెట్టావో లేదో చూడు. ఒక స్పూన్ కాఫీపొడి వెయ్, ఒక చిటికెడు పందార వెయ్, మళ్లీ ఇంకో రెండు స్పూన్లు కాఫీపొడి వెయ్. ఎన్ని స్పూన్లు వెయ్యాలి? నీకు ఎంత స్ట్రాంగ్ కావాలి? అనేదాన్ని బట్టి. నేను స్ట్రాంగు, నేను తాగే కాఫీకూడా అనుకుంటే ఓ 4 చెంచాలు వేస్కో. ఇప్పుడు, ఆ వేడి వేడి నీళ్లు నెమ్మదిగా పైకంటైనెర్లో, నీళ్లు పొడిని తడుపుకుంటూ పైదాకా వచ్చేదాకా పొయ్. నీళ్లు పైకి వచ్చాక, మూత పెట్టు. అట్టావెళ్లి ఓ రౌండు పేపరో గట్రానో చదివిరా. ఒక్కో చుక్కా ఒక్కోచుక్కా కిందకి దిగితూ ఉంటుంది కాఫీ. మళ్లీరా, పైన మూత తీ, నీళ్లుపొయ్. మూతపెట్టు. కొంచెంసేపు ఆగు.
ఇప్పుడు, కిందకి కొంత డికాక్షన్ దిగే ఉంటుంది. రెండు గుడ్డలు తేస్కో, ఓ గుడ్డతో కింద కలేక్టర్ని పట్టుకో, ఇంకో గుడ్డతో పైకంటైనర్ ని పట్టుకుని, పుల్లని విరిచినట్టు చిన్నగా నీ వైపుకి కాకుండా, నీకు వ్యతిరేక దిశలో వంచు. కంటైనెర్ పైకిలేచి కలెక్టర్ తెర్చుకుంటుంది. ఓ గ్లాస్ తీస్కో, ఓ చేత్తో పైన కంటైనర్ ని పట్టుకుని, రెండో చేత్తో కింద కలెక్టర్లోంచి డికాక్షన్ ని ఆ గ్లాస్ లోకి వంపేసి మళ్లీ పిల్టర్ ని యధావిధిగా పెట్టేయ్.

పాలు కాచుకో. ఈ డికాక్షన్లో వేడిపాలు పోశ్కో. రంగు చూస్కో మరీ నల్లగా ఉన్నాయ్ అంటే పాలు ఇంకొంచెం పోస్కో. ఓసారి తిరగొట్టు.

ఘుమ ఘుమ లాడే కాఫీ రెడీ.......

బ్రూక్బాండ్ కాఫీలో: కాఫీ ౫౪% యాభైనాలుగు శాతం, మిగతాది చికోరి. చికోరీ ఓరకమైన కాఫీ.
గుంటూర్ లో ఆంధ్రా కాఫీ లాంటి కొట్టుకి వెళ్తే మన ఇష్టం వచ్చిన రీతిలో కాఫీపొడి పట్టించుకోవొచ్చు.
కొంతమంది చెప్పటం - చికోరి మంచిదికాదు అని.
సో సివరాకరికి - ఎంజా = ఎంజాయ్ :):)

Wednesday, October 29, 2008

గోంగూర పప్పు - కుంపటి.

నేపధ్యం : 2008 వేసవి కాలం మేము, సరదాగా కుంపటి మీద గోంగూర పప్పు వండాం. అమెరికా లో కుంపటా అని అనుకుంటున్నరా? అవును. కుంపటే.
ఇదిగో మా కుంపటి. నాటు కుంపటి.
ఎలా చేసా? వాల్మార్ట్ లో ఒక టెర్రకోట కుండీ తెచ్చా. అక్కడే తెల్ల ఇసుక తెచ్చా. కుండీ కింద బొక్కని ఒక అట్ట ముక్క పెట్టి మూసేసి ఇసుక పోసా. కుంపటి తయ్యారు. బొగ్గులు తెచ్చా, ఒక మూట, ఇసుక మీద కావాల్సినన్ని పేర్చా. వెలిగించా. ముందుగా మొక్కజొన్నలు కాల్చుకున్నాం, తర్వాత ఉల్లిగడ్డలు, తర్వాత చిక్కుడు కాయలు. మా బుడ్డోడు ఎంజోయ్ చేసాడు, నేనూ కేరింతలు కొట్టా. సేఫ్టీ గానే ఉంచాలేండి.
ఓరోజు మాఆవిడ దం బిర్యాని వండింది. నేనూ ఇంకో రోజు రొట్టెల మీద అదే అదే నిప్పుల మీద రొట్టెలు కాల్చా.
ఒకానొక రోజునగోంగూర పప్పు వండాం కూడా. వాహ్...వాహ్..వాహ్....క్యా బోలూం మియా...క్యా బాత్ హై....ఫాంటాష్టిక్కు, అదుర్స్ కెవ్వు కేక, మేక తోక...
ఈ కుంపటి అడ్వాంటేజ్ ఏంటంటే, వంట తంటా అయ్యాక ఇసుకని బొగ్గుల మీద కప్పేస్తే వెంటనే నిప్పు ఆరి పోతుంది.
అదీ కధ.

పెద్దలు చెప్పినట్టు పప్పుని కుక్కర్లో పెడితే పెద్ద బావోదు. బయటే వండాలి. ఐతే ఇది తీరిక సమయాల్లో మాత్రమే. ఎనిమిదింటికి ఆఫీస్కెళ్లాలి, పొయ్యిమీద పప్పు పడేయ్, రేపొద్దునకి తయ్యారు అవుతుంది..అలా కాదు. లిమిటెడ్ టైం లో ఇలాంటివి పెట్టుకోవద్దు..ఆరాం గా ఉన్నప్పుడు ఇలాంటివి.

సరే ఇంకో మాట. ఉద్యోగం లేని బ్యాచిలర్స్కి - పొట్ట ముఖ్యం. కమ్మగా వండుకుని తిన్న ఒక్క ముద్దైనా కమ్మగా తింటే ఒక సాటిస్ఫాక్షను వల్ల, జావానో డాట్ నెట్టు మీదనో ఏకాగ్రతతో కుస్తీ పడొచ్చు. చాలా మంది కమ్మగా తింటే నిద్ర పోతాం అనుకుంటారు. కానీ, పొట్ట పగల తింటే నిద్రొస్తుంది, కమ్మగా కాదు..
వస్తువులు:
కుంపటి,
బొగ్గులు,
అగ్గిపెట్టె (జేబులోంచి లైటర్లాగు బైటికి),
కిరసనాయిలు.
మందపాటి గిన్నె - మా ఇంట్లో రాచ్చిప్ప గిన్నె, రాచ్చిప్ప గంటే అని ఉండేవి, కేవలం కుంపటి మీద వంటకోసం (రాచ్చిప్ప = రాతి చిప్ప)
గోంగూర పప్పుకి కావాల్సినవి:
గోంగూర - ఒక కట్ట (10 గోగికాడలు).
కంది పప్పు - మనుషుల్ని బట్టి. నాలుగు గుప్పిళ్ళు.
ఉల్లిగడ్డ - ఒకటి
పచ్చిమిరపకాయలు - 4
తిరగమాత గింజలు, ఉప్పు గిప్పు ...

విధానం - గోంగూర కి వెళ్లు ఇందిరా నగర్లో,100 ft రోడ్డు పక్కన !! గోంగూర పప్పు పార్సిలు తెచ్చుకో మింగు...కాదు
కుంపటిరా జెయ్యి - అంటే వెలిగించు. ఎలా? బొగ్గులు వెయ్. ఎన్ని? కొన్ని. కిరసనాయిలు కొన్ని చుక్కలు అన్ని బొగ్గుల మీద పడేట్టు జల్లు (చేతికి కిరసనాయిలు అంటానీమాక). అగ్గిపుల్ల గీ, దానిమీద పడేయ్. అంటుకుంటుంది. భగ్గున మంట వొస్తుంది. భయపడకు. వెంటనే తగ్గిపోతుందిలే. బొగ్గులు ఆ మంటకి అంటుకుంటై. నిప్పు రాజుకున్నదాకా ఇసెనకఱ్ఱతో ఇసరతా ఉండు. అన్నీ బొగ్గులు రాజుకునేలోపు,
గిన్నెలో కందిపప్పు వెయ్, కడుగు, ఒకటికి మూడు నీళ్లు పోయి. పక్కన పెట్టు. నిప్పులు అన్నీ రాజుకున్నాయా చూడు, గెన్నె దాని మీద బెట్టు. చిటికెడు పసుపు వెయ్. మూత బెట్టు.

గోంగూర కడుగు, పక్కన బెట్టు.
ఉల్లిగడ్డ మిలువునా నాలుగు ముక్కలు జెయ్యి, పక్కన బెట్టు.
పచ్చిమిరగాయలు తొడిమలు తీయ్, పక్కన బెట్టు.
అలా గిన్నె వైపు చూస్తూ వుండు. పొంగు వస్తుంది కొంచెం సేపు ఐతే. అప్పుడు మూత తీ, గోగూర, ఉల్లి, మిర్చి వెయ్. ఓరగా మూతబెట్టు. నిప్పులు ఉన్నయో లేదో చూస్తూ ఉండు. ఉప్పు కారం వెయ్యి. అప్పుడప్పుడు విసెనెకఱ్ఱతో వీస్తా ఉండు.
పప్పు ఉడికిందో లేదో ఎలా తెల్సుకోవటం, చెంచాబెట్టి ఒక పప్పు తీస్కుని నలిపి జూడు. మెత్తగా నలిగింది అంటే ఉడికినట్టు.

తిరగమాత :- ముందు పప్పు గిన్నె తీసి పక్కన బెట్టు చిప్ప గంటె తీస్కో, పొయ్యి మీద పెట్టు. కొంచెం నూనె వెయ్. 3 చెంచాలు. నూనె కాగినాక ముందు (మందు కాదు బాబు - ముందు) మినప్పప్పు వెయ్, తర్వాత ఆవాలు మెంతులు వెయ్, చిట్పట్ అనగానే జీలకర చిటికెడు ఎండుమిరపకాయ ఒకటి చేత్తో విరగ్గొట్టి వెయ్, ఒక్క 10 సెకండ్లు ఆగు, కర్వేపాకు వెయ్, ఇంగివ జల్లు, పప్పులో వేసేయ్..
మళ్లీ పప్పు గిన్నె పొయ్యిమీద పెట్టు. ఒక్క నిమిషం ఉంచు..దింపేసేయ్. కుంపట్లో నిప్పులు ఆర్పెయ్...లేకపోతే ఇల్లు కుంపటే...
ఇంక లాగించు.
బాబూ!!! కాంబినేషన్ తెల్సుకో. గోంగూర పప్పు లోకి ఉప్పుమిరపకాయలు అదుర్స్. బైట కొనకు, మీ ఇంటినుండి తెచ్చుకో ఈసారి ఎళ్లినప్పుడు. బయట కొన్నవాటిల్లో మజ్జిగ కంటెంటు బగా తక్కువ, ఉప్పు కంటెంటు ఎక్కువ.

Thursday, October 23, 2008

డేగిషాడు ముప

ఏంది? అర్ధం కాలా?

మరి రూముల్లో, ఎంతమంది వస్థారో తెలీదు, ఎంత తింటామో తెలీదు, మందుకొడ్తుంటే తినలేకపోవొచ్చు, మామూలుగుంటే కుమ్మేయొచ్చు.

మరలాంటప్పుడు డేగిషానిండా వండుకోవాల్సిందేగా.

ముప అంటే? ఇది మానాన్న డైలాగు. తను ఎప్పుడు పిల్లల్ని ఏడిపించేప్పుడు వాడుతుండేవాడు. ఒరేయ్ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఎంతరా? ఏ స్క్వేర్ .. ఓహ్.. తర్వాత.. ప్లస్ బీ స్క్వేర్...ఒహ్హ్...గుడ్. అంతేకదా..అంతే..ఇల పిల్లోళ్ళని భయాపెట్టి "ముప లటాలటా లాగించటం కాదు లెక్కలంటే" అని ఏడిపిస్తుండేవారు. ఇంతకీ ముప అంటే "ముద్ద పప్పు" అని.

రూముల్లో మరి వారాంతాలకి నెమ్మదిగా పస్కుండింటికి లేచి వోహ్ ఈయ్యాల వంటసేస్కుతిందాం అని భయంకరమైన నిర్ణయం తీసేసుకుని పప్పు జేద్దాం అనుకునే మగానుభావులకి ఇది.
ఇది అన్నగారు (కొత్త పాళీ అన్నగారు చెప్పాక వెలిగిన లైటు)హింటినాక జత చేసింది:
అసలు ముద్ద పప్పు అంటే:
ముద్ద పప్పు అని. :):) ముద్దైన పప్పు.

పప్పు వండటం చాలా తేలిక:
ఒక డేగిశాలో, పప్పు డబ్బాడో 4 డబ్బాలో, పోయి. శుభ్రంగా (నాయనా చేతులు, ఏటి చేతులు ముందు కడుక్కోపో నాయనా) కందిపపుని కడుగు. ఎంత పప్పు పోశవో ఇంటు మూడు నీళ్ళు పోయ్. అంటే ఒక డబ్బాకి 3 డబ్బాల నీళ్ళు. ఇంటో కుక్కరు ఉన్నోళ్ళు ఒకటికి రెండు పోస్తే సాలు. పొయి ఎలిగించు. మీడీయం మంట మీద డేగిషానిబెట్టు. చిటికెడు పసుపు వెయ్. మూత కొంచెం ఓపెన్ చేసి పెట్టు. దాని మానాన అది ఉడుకుతూ ఉంటుంది. పప్పు పొంగొస్తుందేమో చూడు. మూత తీ. కొంచెం పెంచు మంట. ఒక పప్పు టీ స్పూంతో తీ, షేపు మారిందేమోజూడు. మారితే (కందిపప్పు అంచులు గుండ్రంగా ఉందా లేక పగిలిపోయిందా అనేది లెక్క),ఉప్పు వేస్కో. నీళ్లు ఇంకిపోయ్యాయో లేదో చూడు. ముద్ద పప్పు గట్టిగా ఉండాలి. దింపేసేయ్. ముద్దపప్పు తాయారు..
ఇదీ ముద్ద పప్పు వండే పద్ధతి. కొంతమంది ముద్ద పప్పులో తిరగమాత వేస్తారు, కొంతమందినీళ్లు నీళ్లుగా చేస్కుంటారు. మా ఇంట్లో మాతర్మ్ ఇలా ఘట్టిగా ఉండేది ముద్ద పప్పు.
టిప్పు: ఉప్పు ఎప్పుడు వెయ్యాలి? ఉడికేప్పుడు ఉప్పేస్తే ఉడకదు అంటారు. అందుకే దాదాపు ఉడికింది అనే స్థితిలో ఉప్పేస్కోటం భేషు.


ముద్దపప్పుని బేస్ గా జేస్కొని కొన్ని ఎక్ష్టెంషన్లు:
రామ్ములక్కాయ పప్పు :- ఈ పద్ధతిని కొందరు దాల్ ఫ్రై అంటారు.
ఒక ఉల్లిగడ్డ, 2 రామ్ములక్కాయలు, 4 మిరగాయలు, 2 వెల్లుల్లి రెక్కలు, కొత్తి మీర తీస్కో. ఉల్లిపాయలు నీ సైజుని బట్టి తరుగు, పక్కన బెట్టు, వెల్లుల్లి నలిపేయ్, తెల్సుగ, బొటనవేల్తో నొక్కు, పక్కనబెట్టు, మిరగాయ్ నిలువునా ఛీరేయ్, పక్కన బెట్టు.

భాండి పెట్టు, పోపు వేయ్. పోపు ఐపోతుంది అనేలోపు ఇంగువ వెయ్ (ఆప్షనల్). పోపు చిటచిటా లాడంగనే మిరగాయలు వేయ్, తర్వాత నలగొట్టిన వెల్లుల్లి వెయ్. 1 నిముషమాగు. ఇప్పుడు ఉల్లిపాయ కోసావ్గా ఇందాక అది వెయ్. వేయించు. అప్పుడు రామ్ములక్కాయ వేయ్, మూత పెట్టు, 5 నిమిషాలు ఆగు. ఈలోపల పప్పు ఐందిగా, దాన్ని దింపు పొయ్ మీదనుండి. చేత్తో పట్టుకోకు కాలుద్ది. గుడ్డ గుడ్డ పెట్టి పట్టుకో. బుఱ్ఱ పెట్టండి (శనివారం అది పంజేయ్యదు - నాకు తెల్సనుకో). ఉప్పు కారం వేస్కో, ఈ పప్పుని దాంట్లో వేసేయ్, కొంచెం నీళ్లు పోయ్. ఓసారి కలిపు. కుత కుత లాడంగనే దింపు. కొత్తిమీర వెయ్, మూత పెట్టు.

గమనిక : ఒక్కో ఇంటో ఒక్కోలా వండుతారు. టొమాటో పప్పులో సానా మంది ఉల్లిగడ్డ వేస్కోరు. రూముల్లో ఇలాంటి స్టాండర్డ్స్ ఉండవు. "టమాటా" పప్పులో కాకరకాయ కూడా వేస్కోవచ్చు :) మన ఇష్టం (పొరబాటూన వేసేరు)

Monday, September 29, 2008

టమాటా నువ్వు; టమాటా నేను

ఇంతక ముందు టపాలో రాసిన టమాటా కూర ని "బేర్బోన్స్" టమాట కూర అనుకుందాం.

ఇప్పుడు ఇంతక ముందు చెప్పినట్టు, టమాటా - వంకాయ, టమాటా - చిక్కుడుకాయ, టమాటా - గుడ్డు, టమాటా - బంగాళాదుంప, టమాటా - నేను, టమాటా - నువ్వు ఇలా ఎలా చెయ్యాలో చూద్దాం.
(టమాటా కూర కావాల్సిన వస్తువుల టెంప్లేట్ -
2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, మిరగాయలు 4( నీకు దమ్మున్నన్ని), 4 వెల్లుల్లి రేకులు,చిటెకెనవేల్లో పావంత అల్లం, కొత్తిమీర కొంచెం, తిరగమాత లేక పోపు పెట్టె వస్తువులు.
ఉల్లిపాయలు తరుగు, పక్కనబెట్టు
మిరగాయలు తరుగు, పక్కనబెట్టు
వెల్లుల్లి రెక్కలు తీస్కో బొటనవేల్తో ఘాట్టిగా నొక్కు, పైన పొట్టుతీ, పక్కనబెట్టు,
అల్లం పైన తొక్కతీ, సన్నని ముక్కలుగా తరుగు, ఎంత సన్నవి? 1 యం.యం * 1 యం.యం. ఇందాకటి వెల్లుల్లి రెక్కలు, ఈ అల్లం ముక్కలు రెంటినీ కలిపేసి చిప్పగంటెతో బాగా నూరు - అల్లం వెల్లుల్లి పేస్టు తాయారు, మీరు తాయారా. టమాటాలు ఓసారి కడిగి, సన్నగా తరుక్కో.
)
(టొమాటో కూర చేసే విధానం టెంప్లేట్-
భాండి దీస్కో, పొయ్యి మీదపెట్టూ, మంట మధ్యంతరంగా ఉంచు.
3-4 చెంచాలు నూనె పొయ్యి. వేడెక్కినాక పోపు పెట్టు. పోపు చిటపట్లాడినాక పసుపు వెయ్, వెంటనే తరుక్కున మిరగాయలు వెయ్, కొంచెం వేయించు, వేగాక తరుక్కున్న ఉల్లిపాయలు వెయ్, అవి కొంచెం రంగు మారంగనే అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్..కొంచెం తిప్పు. )
(ముగింపు టెంప్లేట్ -3 నింషాలు ఆగి మూత తీయ్,నీళ్ళు సరిపడా ఉన్నాయోలేదో చూడు. లేకపోతే కొంచెం ఓ అరగ్లాసు నీళ్ళుపొయి. ఉప్పు, కావాల్సినంత కారం వేయ్. మూతపెట్టు. ఈలోపల, కొత్తిమీర కడుగు, సన్నగా తరుక్కొ. 3 నింషాల తర్వాత మూత తీయ్, కొత్తిమీర దాంట్లో కుమ్ము. ఓసారి అంతా కలుపు. నీళ్ళు ఇంకిపోతున్నాయ్ అనిపిస్తే ఆపేయ్ పొయ్యి. మూత పెట్టి అట్టా ఉంచు కొసేపు.
)
1. టమాటా - మర్చిపొయ్యానండోయ్... మునక్కాయ:
వహ్..వాహ్..స్స్కహ్..
కావాల్సినవి: టమాటా కూరకి కాల్సినవన్ని, మరియూ మునక్కాయలు..లేతవి..నవనవలాడుతున్నవి....
పద్ధతి:
టమాటా కూర కావాల్సిన వస్తువుల టెంప్లేట్+
మున్నక్కాయల్ని కడుగు. ఎన్ని? రెండో మూడో..దొరికినదాన్ని బట్టి, కూర రుచిగా వస్తే మళ్ళి మళ్ళి తినాలనిపించందనుకో రెండు పక్కనబెట్టుకుంటే మంచిదికదా..అప్పుడప్పుడు నవ్వుతుండు, కొంపలేమి మునగ-వ్.
మునక్కాయని కోసే పద్ధతి:
కాయని తీస్కో, ఒక్కో తరుక్కి రెండు రెండు విత్తనాలొచ్చేలా తరుక్కో. రబ్బరుట్యూబ్ ని కోస్తున్నట్టు అనుకొ. ఐతే కొన్ని ముదిరిన మునక్కాయలు కూడా వస్తాయి. మనం మునక్కాయలశాస్త్రమ్లో నిష్ణాతులం కాదుకదా. అలా ముదిరినవి ఒక పట్టాన తెగవు. పర్లేదు. పానిక్ కాకు. ఎక్కడదాకా తెగిందో అక్కడ్నుంచి లాగేసేయ్ చెరుకుగడ పైన గట్టిని లాగేసినట్టు.
ఇప్పుడు టమాటా కూర చేసే విధానం టెంప్లేట్ +అయ్యాక, టమాటాలు కుమ్ముతావ్కదా, ఆటితోపాటు మునక్కాయలు కూడా కుమ్ము. ఐతే కొంచెం నీళ్ళు పొయ్. లేకపోతే మునక్కాయలు ఉడకవ్. ముగింపు టెంప్లేట్ ని ఇంప్లిమెంటు చెయ్. ముక్క కొంచెం చిట్లింది అనిపించాక ఇంకో 5నిమిషాలు ఉంచి దింపేసి, ఆరగించు.
కీ: లేత మునక్కాయ. కోసేప్పూడు, ఒకవైపు ఓపెన్ ఉంటే మునక్కాయ తొందరగా ఉడుకుతుంది. ఎలా? కోసేప్పుడు చివరకంటా కొయ్యకుండ కొంచెం ఉంచుకున్నావనుకో పీకేసేయొచ్చు.

#2. టమాటా గుడ్డు (గుద్దు కాదు - టమాటా ని గుద్దితే చిట్లిపోతుంది):
దీన్ని రకరకాలుగా చేస్కోవచ్చు. టమాటాపగలొగగొట్టిన గుడ్డు, టమాటా బాయిల్డ్ గుడ్డు, టమాటా స్లైసెద్ బాయిల్డ్ గుడ్డు ఇలా...:)
టమాటా ఉడ్కబెట్టిన గుడ్డుకూర ఎలా?
టమాటా కూర కావాల్సిన వస్తువుల టెంప్లేట్ + దనియా పొడి + గుడ్లు. ఎన్ని? సరిపోయినన్ని!!
గుడ్లని ముందుగా ఉడకబెట్టండి. ఎలా ఉడకబెట్టాలి? ఒక గిన్నె తీస్కుని, గుడ్లని (ఒక 5 అడుగుల ఎత్తునుండి దాన్లో వేసి) దాన్లో పెట్టి, గుడ్లు మునిగేదాకా నీళ్ళు పోసి, మంట కొంచెం ఎక్కువలో పెట్టి, అటువెళ్ళి చాయ్ లాగించి దమ్ముకొట్టొచ్చి, రాంగనే నీళ్ళున్నాయోలేదోజూస్కుని "(అట్టా సూత్తా సాయంత్రానికి "హబ్బ) ఉడికినై" అనుకున్నాక, గిన్నెగిన్నెని చల్లనీళ్ళకిందబెట్టి, ఒక్కోగుడ్డు "పగ్ల" కొట్టి, పెంకుతీసేసి పక్కనబెట్టుకోండి.
టొమాటో కూర చేసే విధానం టెంప్లేట్ + తరుక్కున్న టమాటాలు వెయ్, అలానే, ఉడికించిన గుడ్లు, ఒక్కోటి తీస్కో, ఒక చిన్న గాటు పెట్టు, వెయ్, తీస్కో గాటు వెయ్ ఇంకోటి తీస్కో గాటూ వెయ్.. గేందివయా ఎంతసేప్జెప్తవ్..ఛల్..ముంద్కెళ్ళెవానే...గట్లనే..అన్నీ గుడ్లు వెయ్..ధనియా పొడి వెయ్. నీళ్ళు సర్పోనున్నయోలేదోజూడి. మూతపెట్టుడి.
ముగింపు టెంప్లేట్ ఫాలో గాండ్రి..
ఘుమ ఘుమలాడే టమాటా కోడి గుడ్డుకూర రెడీ....

Friday, September 26, 2008

టమాటా అంటే ఇష్టం

అదేదో సిన్మా లో "బెల్లం అంటే ఇష్టం"లా, బెమ్మచారులకి అత్యంత తేలికైన, బహు ఇష్టమైన కూరగాయ "టమాటా" లేక మన భాషలో "రామ్ములక్కాయ".
దీంతో కూర, పప్పు, పచ్చడి, రసం, సాం"బారు" ఎన్నైనా జేస్కోవచ్చు.
రమ్ములక్కాయ ప్రత్యేకత ఏంటంటే, దీంతోజేసిన కూరలో ఏమైనా వేస్కోవచ్చు. టమాటా - వంకాయ, టమాటా - చిక్కుడుకాయ, టమాటా - గుడ్డు, టమాటా - బంగాళాదుంప, టమాటా - నేను, టమాటా - నువ్వు ఇలా.

ముందుగా నోరూరించే టమాటా ఇగురు ఎలాజేస్తారో చూద్దాం :
అసలు ఇగురు అంటే ఏంది? ఇగురు అంటే ఇంకిపోయిన దాన్ని ఇగురు అంటారు. నీళ్ళ నీళ్ళగా ఉన్న పదార్ధంలోంచి నీళ్ళు ఇంకిపోయేంతవరకూ దాన్ని పొయ్యిమీదనేబెట్టటం.
టమాటా ఇగురు కి కావాల్సింది:
కొంచెం తెలివి, ఒక కంప్యూటారు, ఇంటర్నెట్ కనెక్షను, మంటనక్క లేక ఐ.ఈ...కాదు
2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, మిరగాయలు 4( నీకు దమ్మున్నన్ని), 4 వెల్లుల్లి రేకులు,చిటెకెనవేల్లో పావంత అల్లం, కొత్తిమీర కొంచెం, తిరగమాత లేక పోపు పెట్టె వస్తువులు.

ముందుగా...
ఉల్లిపాయలు తరుగు, పక్కనబెట్టు
మిరగాయలు తరుగు, పక్కనబెట్టు
వెల్లుల్లి రెక్కలు తీస్కో బొటనవేల్తో ఘాట్టిగా నొక్కు, పైన పొట్టుతీ, పక్కనబెట్టు,
అల్లం పైన తొక్కతీ, సన్నని ముక్కలుగా తరుగు, ఎంత సన్నవి? 1 యం.యం * 1 యం.యం. ఇందాకటి వెల్లుల్లి రెక్కలు, ఈ అల్లం ముక్కలు రెంటినీ కలిపేసి చిప్పగంటెతో బాగా నూరు - అల్లం వెల్లుల్లి పేస్టు తాయారు, మీరు తాయారా. టమాటాలు ఓసారి కడిగి, సన్నగా తరుక్కో.

భాండి దీస్కో, పొయ్యి మీదపెట్టూ, మంట మధ్యంతరంగా ఉంచు.
3-4 చెంచాలు నూనె పొయ్యి. వేడెక్కినాక పోపు పెట్టు. పోపు చిటపట్లాడినాక పసుపు వెయ్, వెంటనే తరుక్కున మిరగాయలు వెయ్, కొంచెం వేయించు, వేగాక తరుక్కున్న ఉల్లిపాయలు వెయ్, అవి కొంచెం రంగు మారంగనే అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్..కొంచెం తిప్పు. ఇంక, ఆ తరుక్కున్న టమాటాలు దీంట్లో వెయ్, ఓసారి కలుపు, మూతపెట్టు. 3 నింషాలు ఆగి మూత తీయ్,నీళ్ళు సరిపడా ఉన్నాయోలేదో చూడు. లేకపోతే కొంచెం ఓ అరగ్లాసు నీళ్ళుపొయి. ఉప్పు, కావాల్సినంత కారం వేయ్. మూతపెట్టు. ఈలోపల, కొత్తిమీర కడుగు, సన్నగా తరుక్కొ. 3 నింషాల తర్వాత మూత తీయ్, కొత్తిమీర దాంట్లో కుమ్ము. ఓసారి అంతా కలుపు. నీళ్ళు ఇంకిపోతున్నాయ్ అనిపిస్తే ఆపేయ్ పొయ్యి. మూత పెట్టి అట్టా ఉంచు కొసేపు.

దింపుకుని లాగించు. అన్నంలోకైనా, రొట్టెలోకైనా, బ్రెడ్డులోకైనా దేంట్లోకైనా రెడీ.

అదీ కధ

నోట్: కీ ఏంటంటే - అల్లంవెల్లుల్లి. కొత్తిమీర ముందుగా కడుక్కోవాలి. లేకపోతే ఇసుక వస్తుంది, కూర కసకస లాడుతుంది. పోపు మాడకుండాజూస్కోండి.
టమాటాల్ని తరిగే పద్ధతి: కత్తి పెట్టి నిన్ను తరుగుతా అంటే టమాటా నవ్వుతుంది. టమాటాని నుంచోబెట్టి నిలువుగా తరుగు. తర్వాత, తరిగిన వైపునుంచి (తొక్కవైపు కాకుండా) ఇంకా సన్నగా తరుక్కో.

అత్యంత తేలికైన కూర ఇది.

Thursday, September 25, 2008

నా ఈ బ్లాగు లక్ష్యం

ముందు మాట
(ఎవుడయ్యా అది, నేను సరిగానే అన్నా, నువ్వే మందుమాట అని విన్నావ్)


సోదరులారా (సోదరీమణులారా)
నా ఈ బ్లాగు లక్ష్యం - రూముల్లో ఉంటూ ఇంటి వంటని ఎలా ప్రాక్టీసు చేయ్యొచ్చు, తేలికైన వంటలు, శులభమైన పద్ధతులు, మరియూ ఇత్యాదివి.
నేను ఒకప్పుడు రూములో ఉన్నోడ్నే. నాకుతెల్సు ఎలా ఉంటుందో ఆ జీవితం. ఆ జీవితంలో చాలా ఆనందాలు, కష్టాలు, నష్టాలు గట్రా ఉంటయి. మిగతావి ఎట్టా ఉన్నాఫుడ్డు మాత్రం కొంచెం కష్టమే. వంటకి కావాల్సింది సమయం, పప్పు, ఉప్పు, పొయ్యి, మంటా కాదు - ప్యాషన్, ఓపిక, జిహ్వ. ఇవి ఉంటే మిగతావి వాటంతట అవే సమకూరుతాయి.

ఇప్పటికింతే.

భాస్కర్