Friday, September 26, 2008

టమాటా అంటే ఇష్టం

అదేదో సిన్మా లో "బెల్లం అంటే ఇష్టం"లా, బెమ్మచారులకి అత్యంత తేలికైన, బహు ఇష్టమైన కూరగాయ "టమాటా" లేక మన భాషలో "రామ్ములక్కాయ".
దీంతో కూర, పప్పు, పచ్చడి, రసం, సాం"బారు" ఎన్నైనా జేస్కోవచ్చు.
రమ్ములక్కాయ ప్రత్యేకత ఏంటంటే, దీంతోజేసిన కూరలో ఏమైనా వేస్కోవచ్చు. టమాటా - వంకాయ, టమాటా - చిక్కుడుకాయ, టమాటా - గుడ్డు, టమాటా - బంగాళాదుంప, టమాటా - నేను, టమాటా - నువ్వు ఇలా.

ముందుగా నోరూరించే టమాటా ఇగురు ఎలాజేస్తారో చూద్దాం :
అసలు ఇగురు అంటే ఏంది? ఇగురు అంటే ఇంకిపోయిన దాన్ని ఇగురు అంటారు. నీళ్ళ నీళ్ళగా ఉన్న పదార్ధంలోంచి నీళ్ళు ఇంకిపోయేంతవరకూ దాన్ని పొయ్యిమీదనేబెట్టటం.
టమాటా ఇగురు కి కావాల్సింది:
కొంచెం తెలివి, ఒక కంప్యూటారు, ఇంటర్నెట్ కనెక్షను, మంటనక్క లేక ఐ.ఈ...కాదు
2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, మిరగాయలు 4( నీకు దమ్మున్నన్ని), 4 వెల్లుల్లి రేకులు,చిటెకెనవేల్లో పావంత అల్లం, కొత్తిమీర కొంచెం, తిరగమాత లేక పోపు పెట్టె వస్తువులు.

ముందుగా...
ఉల్లిపాయలు తరుగు, పక్కనబెట్టు
మిరగాయలు తరుగు, పక్కనబెట్టు
వెల్లుల్లి రెక్కలు తీస్కో బొటనవేల్తో ఘాట్టిగా నొక్కు, పైన పొట్టుతీ, పక్కనబెట్టు,
అల్లం పైన తొక్కతీ, సన్నని ముక్కలుగా తరుగు, ఎంత సన్నవి? 1 యం.యం * 1 యం.యం. ఇందాకటి వెల్లుల్లి రెక్కలు, ఈ అల్లం ముక్కలు రెంటినీ కలిపేసి చిప్పగంటెతో బాగా నూరు - అల్లం వెల్లుల్లి పేస్టు తాయారు, మీరు తాయారా. టమాటాలు ఓసారి కడిగి, సన్నగా తరుక్కో.

భాండి దీస్కో, పొయ్యి మీదపెట్టూ, మంట మధ్యంతరంగా ఉంచు.
3-4 చెంచాలు నూనె పొయ్యి. వేడెక్కినాక పోపు పెట్టు. పోపు చిటపట్లాడినాక పసుపు వెయ్, వెంటనే తరుక్కున మిరగాయలు వెయ్, కొంచెం వేయించు, వేగాక తరుక్కున్న ఉల్లిపాయలు వెయ్, అవి కొంచెం రంగు మారంగనే అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్..కొంచెం తిప్పు. ఇంక, ఆ తరుక్కున్న టమాటాలు దీంట్లో వెయ్, ఓసారి కలుపు, మూతపెట్టు. 3 నింషాలు ఆగి మూత తీయ్,నీళ్ళు సరిపడా ఉన్నాయోలేదో చూడు. లేకపోతే కొంచెం ఓ అరగ్లాసు నీళ్ళుపొయి. ఉప్పు, కావాల్సినంత కారం వేయ్. మూతపెట్టు. ఈలోపల, కొత్తిమీర కడుగు, సన్నగా తరుక్కొ. 3 నింషాల తర్వాత మూత తీయ్, కొత్తిమీర దాంట్లో కుమ్ము. ఓసారి అంతా కలుపు. నీళ్ళు ఇంకిపోతున్నాయ్ అనిపిస్తే ఆపేయ్ పొయ్యి. మూత పెట్టి అట్టా ఉంచు కొసేపు.

దింపుకుని లాగించు. అన్నంలోకైనా, రొట్టెలోకైనా, బ్రెడ్డులోకైనా దేంట్లోకైనా రెడీ.

అదీ కధ

నోట్: కీ ఏంటంటే - అల్లంవెల్లుల్లి. కొత్తిమీర ముందుగా కడుక్కోవాలి. లేకపోతే ఇసుక వస్తుంది, కూర కసకస లాడుతుంది. పోపు మాడకుండాజూస్కోండి.
టమాటాల్ని తరిగే పద్ధతి: కత్తి పెట్టి నిన్ను తరుగుతా అంటే టమాటా నవ్వుతుంది. టమాటాని నుంచోబెట్టి నిలువుగా తరుగు. తర్వాత, తరిగిన వైపునుంచి (తొక్కవైపు కాకుండా) ఇంకా సన్నగా తరుక్కో.

అత్యంత తేలికైన కూర ఇది.

15 comments:

సుజాత said...

చాలా సరదాగా రాస్తున్నారండి!(వంటకం సీరియస్ గానే ఉంది)

భాస్కర్ రామరాజు said...

@ సుజాత గారు:
:)

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

టమాటా ఇగురును వండే విధానాన్ని బాగా నేరేట్ చేసారు. ఇంత తేలికా అనిపించేలా ఉంది. బాచిలర్ పక్షులకి ఉపయోగపడేలా "నోట్" ఇవ్వడం ఇంకా బాగుంది.

మీ బ్లాగు టేగ్ లైన్ అదిరింది.

కొత్త పాళీ said...

మరిన్ని రెసిపీలు మీదైన శైలిలో పోపు బెట్టాలి

భాస్కర్ రామరాజు said...

@బ్రహ్మన్న:
థాంక్సులు

@కొత్తపాళీ గారు:
తప్పకుండా అండి. (ఇప్పుడే వస్థా - తర్వాతి రెసిపీ ఏంటో మా ఆవిడని కనుక్కొవాలిగా :))

MURALI said...

భాస్కర్ గారు,
నెనర్లు. మరిన్ని వంటలకై ఎదురుచూస్తున్నాం.

రాధిక said...

మీ వంటకం ఘుమ ఘుమలు ఇక్కడిదాకా వస్తున్నాయి.పోపు అదిరింది.

teresa said...

మీ వంటకమూ, చెప్పిన తీరూ కూడా పసందుగా ఉన్నాయి. పనిలోపనిగా 'తిరగమోత' వెయ్యడం కూడా నేర్పించేస్తే బావుండేదేమో!

వేణూ శ్రీకాంత్ said...

భలే వ్రాసారండీ. ప్రత్యేకించి మీరు ఇచ్చిన టిప్స్ మొదటి సారి వంట చేస్కునే బ్రహ్మ చారులకి ఎక్కడా దొరకవ్. వంట లో మసాలాలతో పాటు మీ కామెడీ ని కూడా మేళవించి చెప్తుంటే బాగున్నాయ్. ఇంకా మరిన్ని వంటకాలని పరిచయం చేయండి.

సుజాత said...

మన పండు మిరపకాయల పచ్చడి రెసిపీ ఇచ్చి బ్లాగ్లోకాన్ని ఘాటుతో అదరగొట్టాలి తొందరలోనే! కారంపూడి, గురజాలల మధ్య కుంకుమ పరిచినట్లుండే ఎర్రెర్రని చేలు గుర్తొస్తున్నాయి తల్చుకుంటేనే!

రిషి said...

Haahaa...good one.

టమాటా - నేను, టమాటా - నువ్వు :)

జ్యోతి said...

రాజుగారు,

ఆదిలోనే హంసపాదు అనుకోకండీ. పోపు అన్నారు మరి అది ఎలా పెట్టాలో కూడా చెప్పాలిగా.

నేను కాస్త స్పెషల్ టచ్ ఇవ్వనా ఈ కూరకి.. చివరగా అందులో గుడ్లు కొట్టివేసి, ఉడికాక, కొంచెం గరం మసాలా పొడి వేస్తే అదుర్స్ అనుకోండి.

అవును మీరు అన్నీ మీ ఆవిడను అడిగి రాస్తుంటే, కొంప కొల్లేరవగలదు జాగ్రత్త. మీ టైమ్ బాగోలేక ఆవిడే తన స్వంత బ్లాగు మొదలెట్టిందో మీ పని గోవింద.అసలైన వంటకాలు తన బ్లాగులో పెట్టి, అన్నీ తికమక రెసిపీలు మీకిస్తే.. ఒక్కసారి ఆలోచించండి..

భాస్కర్ రామరాజు said...

@రాధిక గారు, మురళీ భాయి: థాంక్సులు
@తెరెసా: "తిరగమోత" తొందర్లో
@వేణు: 2004 లో ఓసారి పేట - చేజెర్ల - కారంపూడి - మాచెర్ల వచ్చాం. మాచెర్లకొచ్చేసరికి ఆకలి నకనకలాడ్డం మొదలెట్టింది. ఒక హోటల్కి వెళ్ళాం. విస్తళ్ళు వేశాడు. వేడి వేడి అన్నం, గుత్తి వంకాయ కూర - గొడ్డుకారం వెల్లుల్లి తో చేఐంది, పప్పు, నెయ్యి పోశాడు. బ్రదర్, నా జీవితంలో అలాంటి రుచిని నేనెప్పుడూ తినలా. ఆ హోటలు ఓనరు, మా నాన్న ఒకళ్ళనొకళ్ళు విచిత్రంగా జూస్కుంటున్నారు. మా నాన్న ఉండబట్టాలేక నువ్వు పలానా కదా అని అదిగేసాడు. అతనూ నువ్వు పలానా కదా ఆని. ఇద్దరూ చిన్నప్పుడు కల్సి చదువుకున్నారు "పాలవాయి"లో.

@సుజాత గారూ: మా బుడ్డోడికి పండుమిరపకాయల కారం అంటే అమితమైన ఇష్టం. అప్పుడప్పుడూ ఫ్రిజ్జి లోంచి బయటకి అపురూపంగా తీసి, వెల్లుల్లి, ఉల్లిపాయ గట్రా వేసి మాఆవిడ "పండుమిరపకాయల కారం" నూరుతుంటుంది. నోట్టో నీల్లు ఊరి ఏరులై పారుతున్నై..

@రిషి: థాంక్సులు

@జ్యోతి గారు:
ఒక్కో పోష్టులో ఒక్కోటి. చూస్తారుగా మీరే.
మా ఆవిడ్ని మధ్యలో తీసుకురావటం సరదాకి మాత్రమే. తనూ ఒక బ్లాగు పెట్టింది. చాలా కాలం క్రితం. కొన్ని వంటలు పెట్టింది కూడా. ఇదీ తన బ్లాగు అడ్రసు : http://harihyderabadi.blogspot.com/ .తనకి అప్పటికి తెలుగు లో రాయొచ్చు అని పెద్దగా తెలియదు. ఇపుడు మా బుడ్డాడితో కుదరటంలేదు. ఇప్పుడు తనకి తొమ్మిదో నెల. ఇంక రోజుల్లో ప్రసవం.

అది కధ

sujata said...

నేనింతకు ముందే వ్యాఖ్యడానికి ప్రయత్నించాను. అపుడు కనెక్షన్ పుటుకుమనిపోయింది. మరేమీ లేదు. కారంగా టొమేటొ కూర చేసి, చివరికి పంచదార కలిపితే బావుంటుంది. బుడ్డోడికి పెట్టండి ఒక సారి. బెల్లం కూడా వెయ్యొచ్చు గానీ పంచదార టేస్ట్ నాకు నచ్చుతుంది.

నాకూ సుజాత గారి లాగా కారం పచ్చడి (కొరివి కారం) చాలా ఇష్టం. చెయ్యడమే రాదు.

ఈ ప్రపంచం లో నాకు నచ్చని పదం.. వంకాయ. ఇపుడే మీ కొత్త పోస్ట్ కూడా చూసేను కాబట్టి.. ఈ అమూల్య అభిప్రాయం కూడా చెప్పెయాలనిపించింది. మీకూ, మీ మిస్సెస్ కీ శుభాకాంక్షలు. మనది (బ్లాగరుల తో మీది) టొమేటొ కలిపిన స్నేహం. ఇది మర్చిపోకూడదు. జై హింద్. జై టొమేటో !

భాస్కర్ రామరాజు said...

@సుజాత గారు: థాంక్సండి. కానుపు ఎప్పుడైనా కావొచ్చు. :)