Thursday, January 22, 2009

పొపెప

ఈ సారి మంచి రంజైన వంట చేద్దాం. దీనిపేరు పొపెప.

ఇంతకీ పొపెప అంటే ఏంటి అనుకుంటున్నారా?
పొ.పె.ప = పొట్లకాయ పెరుగు పచ్చడి.

దీన్ని చెయ్యటానికి కావాల్సింది పొట్లకాయ, పెరుగు మరియూ పచ్చడి(??ఏం పచ్చడి అనకూ, సదువ్)!!!

ఎట్లాంటి పొట్లకాయ? నవనవలాడుతుండాలి. ఇక్కడ బొమ్మలో పెట్టిన లాంటివి బాగుండవు.
From వంట
కానీ మాకు ఇవే దొరుకుతాయి కాబట్టి సరిపెట్టుకున్నాం.
ఇంకా, పెరుగు, మిర్చి, కొత్తిమీర, అల్లం, తిరగమాత గింజలు,మరియూ మెంతులు.
From వంట

ముందుగా పొట్లకాయల్ని శుభ్రంగా కడుక్కో, చిన్న చిన్న ముక్కల్ గా నరిక్కో ఇక్కడ కింద జూపెట్టినట్టుగా:
From వంట

ఇలా నరికేసిన ముక్కల మీన ఉప్పేసి బాగా కలిపి కొంచెంసేపు పక్కనబెట్టు (1). ఈలోపల, ఓ భాండీ తీస్కో, నూనె ఓ రెండు చెంచాలు పొయ్, తిర్గమాత వేస్కో. తిరగమాత చిట్పట్ లాడుతున్నప్పుడు, ఉప్పేసిపిసికి పెట్టిన పొట్లకాయ ముక్కల్ని చేతినిండా తీస్కో, ఘట్టిగా పిండు, తిర్గమాతలో వెయ్, అట్లా మొత్తం ముక్కలు చేతిలోకి తీస్కొనుడు, పిండుడూ ఏసుడు ఇట్టా:
From వంట

అయ్యాక ఓ సారి మొత్తం కలిపేసి మూతపెట్టు (2).
ఇప్పుడు ఓ చిన్న చిప్ప గంటె తీస్కో మెంతులు వేపు, వేపరా చిన్నా మాడ్చకు, బంగారం బ్రౌను రంగుదాకా (నీకో సీక్రెటు రహస్యం, మెంతులు వేపక ముందుకూడా అదే రంగులో ఉంటాయ్). మిర్చీ, కొత్తిమీర, అల్లం, ఈ వేపిన మెంతులు మొత్తం ఓ సారి రుబ్బు (దీన్ని ఓ పెద్ద గిన్నెలో వేసి రుబ్బింగు వెయ్యబడును దెగ్గరకి వెళ్లావనుకో ఆడు నవ్వుతాడు, కాబట్టి ఇంటోనే వేస్కో). రుబ్బటానికి మిక్సీ లేకపోతే ఎలా? ఇలా చెయ్యి. మిరగాయల్ని సన్నగా తరుగు, అల్లం కూడా, కొత్తిమీరనికూడా (కొత్తిమీర ని కడగటం మర్చిపోకు) చాలా సన్నగా తరుక్కో. ముందు మెంతుల్ని కూరగాయల్ని నరికే చెక్కమీద చిప్ప-గంటె తో బాగా నలుపు. అయ్యాక మిర్చి మిగతావి వేసి నలపటాం మొదలుపెట్టు - ఠడా!! లేకపోతే, చపాతీకఱ్ఱతో చెయ్యోచ్చు ఈ పని. సరే ఎలానో ఓలా తిప్పలుపడు, ఈ ముద్దని రెడీజేస్కో. ఈలోపల పొట్లకాయ మాడిందేమో జూస్కో. మాడకుండా ఉంటే, ముందు ఈ ముద్దని పెరుగులో వేస్కో, తర్వాత ఆ పొట్లకాయ కూరని వెయ్యి, ఓ సారి కలుపు. ఇక లాగించు.
From వంట


1. పొట్లకాయ, దొండకాయ ఇలాంటివాటిని ముందుగా ఉప్పులో నానబెట్టుకోవాలి
2. ఈ కూరలు మూతబెట్టకపోతే ఉడకవు. చలా మంది మూతబెట్టి పైన నీళ్లు కూడా పోస్తారట.
టిప్పు: పెరుగు ఎంత ఫ్రెష్ అయితే అంత రుచి.
త్వరలో పొపెప పాడ్కాస్ట్ మీరు ఊహించని రీతిలో :):)

16 comments:

నిషిగంధ said...

"అట్లా మొత్తం ముక్కలు చేతిలోకి తీస్కొనుడు, పిండుడూ ఏసుడు.."

:)) మీరు రెసిపీ చెప్పుడు ఇంకా బావుంది.. నేను అరటికాయ పెరుగు పచ్చడి చేస్తాను కానీ ఇది తెలీదు.. నా రోటి (అదేలేండి మిక్సీ) పచ్చళ్ళ జాబితాలోకి ఇంకో కొత్తది చేర్చినందుకు మీకు ధన్యవాదాలు :-)

Sravya V said...

ఏదో ఇంత subway food గాని pastamania food గాని తిని బతికే వాళ్ళను మీ వంటల తో ఊరించి చంపుతున్నారు గా ! :) అసలు నాకొక అనుమానం మీకు ఒబెసిటి క్లినిక్ గాని ఉందా? Business పెంచుకోవటానికి ఈ Blogaa అని . J/K

కొత్త పాళీ said...

నా ఆల్టైం ఫే.పె.ప .. అనగా ఫేవరెట్ పెరుగు పచ్చడి ఇది.
శ్రావ్య కామెంటు అదుర్స్. ఇదేదో శోధించాల్సిందే. మదుపు సలహాలు ఉచితంగా ఇచ్చే మహానుభావులు డిస్క్లోషర్లు చెప్పాలి, అలాగే ..

madhu said...

చలువ చేసే చల్లని పచ్చడి ఇదే !
పొట్లకాయ పెరుగు పచ్చడి ఇష్టపడని తెలుగు వారు ఉండరేమో !

మీ వంటలో ఒకే ఒక్క సవరణ, కాలం ఆదా కూడా అవుతుంది ఈ సవరణ లో చెప్పినట్టు చేస్తే !

బీరకాయ ముక్కల్ని ఉప్పేసి పెట్టటం బానే ఉంది ... కానీ పిండితే, పోషకాలు మొత్తం పోతాయి ! విటమిన్లు అనేవి వాటర్ soluble అనగా ... నీటిలో కలుస్తాయి త్వరగా ! ఉప్పేసి పెట్టటం వల్ల నీళ్లు ఊరుతాయి పొట్లకాయ నుంచి ... ఆ నీళ్ళల్లోనే విటమిన్లు ఉంటాయి.అందువల్ల తిరగమాతలో పిండని పొట్లకాయ వేసి వెంటనే మూత పెట్టేయాలి ఉడికే దాక, మధ్యలో ఒక నిమిషం తీసి కలుపుకోవచ్చు కావాలంటే !

చాలా కూరల్లో మూత పెట్టేది ఇందుకే, ఆవిరి ( నీరే కదా ) తో పోషకాలు పోతాయి అని ! అందుకే నీళ్ళల్లో ఉడకబెడితే కూరలు, నీళ్లు ఇష్టం లేపోతే కూరలో, వంపుకుని తాగొచ్చు ఆ నీటిని, లేపోతే, తక్కువ నీరేసి వండుకోవచ్చు, చిక్కుళ్ళు, పొట్ల మొదలగు కూరలు !

బీర, పొట్ల , సొర,దోస ...
ఈ నాలుగు కూరలు అతి తక్కువ కాలరీలు కలిగి ఉంటాయి ! ఇంత తక్కువ కాలరీలు ఇంకే పదార్థం లోను ఉండవు / ఉండబోవు ! త్వరగా జీర్ణం అవుతాయి .. .అలా అని మళ్ళీ కాలక్షేపం తిండి తింటే, వ్రతం చెడుతుంది ! పోషకాలు మాత్రం చాల మెండు వీటిలో ... మంచి విటమిన్లు, మినరల్స్, ఉంటాయి.

కాపోతే, పెరుగేసి చేస్తే, ఎంచక్కా బరువు పెరగొచ్చు ! మామూలుగా మాత్రం, బరువు తగ్గలనుకునే వాళ్ళు, పైన చెప్పిన కూరలు ఎంత తిన్నా, నష్టం లేదు !

Bhãskar Rãmarãju said...

@నిషిగంధ: ధన్యవాదాలు. ఎంజాయ్ చెయ్యండి ఇక. :):)
@శ్రావ్యా: ఒబెసిటీ క్లినిక్కా?? అలాంటిదేదో ఉంటే యోగాలు దేనికీ, సూర్యనమస్కారాలు దేనికీ? సీరియస్ గా చెప్పాలంటే మనం నిజంగానే ఎన్ని క్యాలరీలు తింటున్నాం అని చూస్కోము దేశంలో. ఇదీ అలాంటిదే.:):)
@కొత్తపాళీ అన్నగారు: ఎప్పుడన్నా ఓ ఆదివారం ఆటవిడుపుకోసం ఆనందించవచ్చుగా బరువు అనుకున్నప్పుడు? :)
@శ్రీ గారూ: మీ సలహా బాగుంది. >>పొపెప ఇష్టపడని తెలుగు వారుండరేమో!!
నిజమే. అదే "మన" గమ్మత్తు. చిన్న చిన్నవి అద్భుతంగా ఉంటాయ్. మంచి విషయాలు తెలియజేసారు. ఓపిగ్గా వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

madhu said...

భాస్కర్ గారు, థాంక్సులు ! ఇంకో విషయం , కాలరీలు తక్కువున్న ఆహరం అనగా, బీర, సొర, పొట్ల, దోస ... ఈ కూరలు తింటే, కాలరీలు తక్కువ ఉండటం వల్ల వీట్లో, శరీరం నిలువ ఉన్న కొవ్వు ని వాడుకుంటుంది శక్తికి ... అలా ఆరోగ్యకరంగా, బరువు తగ్గించే కూరలు ఇవి అని చెప్పుకోవచ్చు !

ఒక బుల్లి కప్పు కాఫీ లో ఎంత శక్తి (calories) ఉంటుందో, ప్లేట్ నిండా పొట్లకాయ, బీర మొ|| పైన కూరలు తింటే, అంతే శక్తి వస్తుంది ... కడుపు నింపుతాయి, పోషకాలు ఉంటాయి, శరీరం లో నిలవున్న కొవ్వు కరిగిస్తాయి ! కాబట్టి ... త్వరగా బరువు తగ్గొచ్చు ఇవి తింటే ! పీచు పదార్థాలు కూడ ఎక్కువ వీటిలో ! చిక్కుళ్ళు కూడా !

ఉప్మా చేస్కునే వాళ్ళు, గోధుమ రవ్వతో చేస్కొండి ! గోధుమ రవ్వ ఉప్మా, బోల్డు టమాటాలు వేసి చేస్తే, బాగుంటుంది ! ఉప్మా రవ్వ లో కాలరీలు ఎక్కువ, ఒక్క పోషక పదార్థం కూడా ఉండదు ! empty calories(lot of calories without any nourishment to the body) అంటారు దీన్నే, కాఫీ కూడా అంతే ! ఇలా తిండి తగ్గించకుండా, తెలివైన ఎంపికతో, బరువు తగ్గొచ్చు ఆరోగ్యకరం గా, శరీరానికి కావాల్సిన పోషకాలు ఇస్తూనే ! :-)

అలాగే వారానికో రోజు, అన్నం, చిరుతిళ్ళు అనీ మానేసి, మొత్తం గా నిమ్మ రసం తేనె కలిపి ( చక్కర బరువు పెంచుతుంది, తేనె పెంచదు ! ) ప్రతి రెండు గంటలకో సారి తాగటం... ఇలా చేస్తే, నిలవున్న కొవ్వు కరిగుతుంది, తేనె సంపూర్ణ ఆహరం కాబట్టి శక్తి వస్తుంది ! నిమ్మ రసం చాల మంచిది కాబట్టి శరీరం పోషింపబడుతుంది ! ఇవి ప్రక్రుతి ఆశ్రమం లో చిట్కాలు ... మా కుటుంబంలో ప్రయత్నించి మంచి ఫలితాలు సాదించాం కాబట్టి మీతో పంచుకుందాం అని ... ఇక్కడ ఎవరికైనా ఉపయోగ పడుతుందని మీ బ్లాగు స్పేస్ వాడుకున్నా ... మన్నించండి !

Bhãskar Rãmarãju said...

@శ్రీ గారు: మీకు ఇంత సమాచారం ఎక్కడ దొరికింది, వారేవా!! బాగా చెప్పారు. అలానే పాటిస్తాం, ఇంత చెప్పాక!!

ధన్యవాద్

madhu said...

మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రక్రుతి చికిత్స ఆశ్రమం నుంచి ! :-)

empty calories ఎందుకు చెడ్డవి అంటే, పచ్చి కూరల్లో, పండ్లల్లో, కాలరీలతో పాటు, పోషకాలు, పీచు పదార్థాలు ఉంటాయి ... ఇవి కాలరీలని
టోకున కొవ్వుగా మారనివ్వవు, కనుక బరువు పెద్దగా పెరగము !

అదే empty calories ఐతే, మొత్తం గా కొవ్వుగా మారిపోతాయి, శరీరానికి పోషణ, బలం ఇవ్వవు, బరువు పెంచటం తప్ప ! అదన్న మాట ! చెక్కెర కూడా ఇదే empty calories కోవలోకి ఒస్తుంది !తేనె రాదు, తేనె లో ఎన్నో మినరల్స్ ఉంటాయి ! తేనె ని అమృతం అనీ, సంపూర్ణ ఆహరం అనీ అంటారు ! ఒక్క తేనె మాత్రమే తిని ( ఇంకే ఆహరం తినకుండా ! ) ఏ పోషకాహార లోపం లేకుండా మనిషి 100 days అయినా ఉండగలడు ! ఈ టోకున ఇంకే పదార్థంకి అంత సంపూర్ణత లేదు ! ఇది 100 miracles of honey అనే పుస్తకం నుంచి నేర్చుకున్నా !

అందుకే ఉపవాసం, పథ్యం చేసేప్పుడు మంతెన రాజు గారు, తేనె + నిమ్మ రసం అన్నారు !

అందుకే శనివారం మొత్తం నిమ్మరసం + తేనె మాత్రమే తాగి ఇంకేం తినకుండా గడపమని, ఆది వారం ఓపికుంటే, మొత్తం పళ్ళ రసాలు, మన ఇష్టం ! ( అరటి పండు తప్ప ! అరటి పండు తింటే ఒకటి తినొచ్చు ! ) ( అంతే ఇంకేం తినకూడదు ఆది వారం )

మళ్ళీ పళ్ళ రసాలలో, చక్కర కలిపి తాగితే, ఫలితం ఉండదు ! తేనె మాత్రమె కలపాలి ( ఇంకా తీపి కావాలంటే ! )

ఆది వారం ఇలా చేయటానికి ఓపిక లేపోతే, కేవలం వారానికి ఒక్క రోజు, నిమ్మ రసం ఉపవాసం చేసి వదిలేయోచ్చు !

ఆయన శిష్యరికం చేసి, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహరం తినమని చెప్పాలనే దుగ్ధ ఎక్కువైనట్టు ఉంది నాక్కూడా ! మీకు లెక్చరు అనిపించే లోగ ఇంక ఆపేస్తాను !

madhu said...

భాస్కర్ గారు,ఇది చూడండి, పది నిమిషాల వీడియో !

http://www.youtube.com/watch?v=pvFRLIjOLOU

if you've enough time,
detailed video is here:

http://video.google.com/videoplay?docid=-566922170441334340&ei=YkN6SbnwMoLorgLKr53EBQ&q=sweet+misery&emb=1


చక్కర కన్నా దారుణం ఈ కృత్రిమ పంచదార ! దీని వాడుకని అందరం ఆపేద్దాం !

Bhãskar Rãmarãju said...

ఎక్సలెంతో(Excellent)!!!
Well, నేను పంచదార మానేసి సమచ్చరం పైగా అయ్యింది. యా!! మీరన్నట్టు తేనె నిమ్మరసం చాలా మంచిది. అస్సలు పొద్దున్నే తేనే నిమ్మరసం ఓ గ్లాసుడు గోరువెచ్చని నీళ్లతో తాగితే మంచిది.
సరే మీకో సీక్రెట్టు రహస్యం చెప్పనా? మనకి అన్నీ తెలుసు, అయితే పాటించం :):)

Thanks a ton for the info. Have a wonderful Weekend.

Bhãskar Rãmarãju said...

@శ్రీ గారు: మొత్తానికి మొన్న శని వారం, మీరు సూచించిన విధంగా నిమ్మరసం తేనే తాగుతూ మధ్యానం రెండుదాక ఉందగలిగా. ఆతర్వాతే సమస్య మొదలైంది. తేనే నిండుకున్నది, నిమ్మకాయలూ అయిపొయ్యాయి, ఆకలీ మొదలైంది. :):)
ఇంకో శని వారం ప్రయత్నిస్తా..(ఆరోజున నీళ్లు అయిపోతాయేమో:):))

madhu said...

హ హ హ ... భలే వారే ... తప్పకుండా ప్రయత్నించండి ! sams ( or any other whole sale store) లో తేనే కొంటాము మేము, వాల్మార్ట్ కన్నా ధర తక్కువ ... 2.5 kgs - 7$.

ఒక గ్లాస్ నిమ్మ రసం లో --- తీపి సరిపడే తేనె వేసి తాగాలి ... ప్రతి రెండు గంటలకి ఒక సారి !

మీకు అంతగా ఆకలేస్తే ,( maximum try చేయండి,వ్రత భంగం కాకుండా !) పళ్ళు తినండి ( అరటి పండు తప్ప ! ). నష్టం లేదు ! అంతే, ఇంకే ఇతర ఆహరం తీస్కోకూడదు ! )

madhu said...

పొద్దున్న 8am కి మొదలెట్టి నిమ్మ రసం, 9am కి నీళ్లు, 10am కి నిమ్మ రసం, 11am కి నీళ్లు ... అలా ! కాబట్టి నీళ్లు కూడా బాగా పెట్టుకోండి, ఆకలేస్తే నీళ్ళే మరి సరిపడా తాగాలి !

వీటితో ఇంకో రెండు చిట్కాలు ... పొద్దున్న రోజు పళ్ళు, మొలకెత్తిన విత్తనాలు ( మొలకెత్తిన పెసలు, శనగలు etc ) తినాలి ( ఇంకే ఆహరం తీస్కోకుండా, ఇది బలానికి, ఆరోగ్యానికి ), మధ్యాన్నం పుల్కాలు, కూర ... సాయంత్రం పుల్కాలు, కూర ! అన్నం లో కాలరీలు ఎక్కువ ! అందుకే పుల్కాలు ( నూనె ఉండవు కనుక )

అన్నం మానేసి పుల్కాలు తినాలి రోజు ( కుదరకపోతే, బయట పుల్కాలు కొనుక్కోండి, కేటరింగ్ వాళ్లతో ) రోజు ఆకుకూరలు తినాలి ! సాయంత్రం 6 గంటలకే భోజనం ముగించి, ఇంక రాత్రి ఏమి తినకూడదు ! ( కుదరకపోతే, సాయంత్రం కేవలం పళ్ళు తినేసి ముగించాలి 6pm కి ).

ఎందుకంటే, సాయంత్రం జీర్ణ క్రియ అతి తక్కువ గా ఉంటుంది ...అందుకే శరీరం, మొత్తం ఆహరం -- కొవ్వు కింద మార్చేస్తుంది రాత్రి ...అందుకే 6 కే ముగించటం... 6 కి తింటే, 9-10 కి అరుగుతుంది...ఇంక కొవ్వు గా మారదు ఆహరం...ఎంత లేట్ గా తింటే సాయంత్రం, అంత తేలిక బరువు పెరగటం !

సో మొత్తం గా ,

1) పొద్దున్న పళ్ళు, మొలకలు --- పుల్కాలు మిగిలిన రోజు.

౨) 6pm కే భోజనం ముగించటం

౩) వారానికి ఒక రోజు ఉపవాసం ( తేనె, నిమ్మ రసం తో )

౪) రోజు కనీసం కొద్ది సేపు వ్యాయామం --- సూర్య నమస్కారాలు చేసాం మేము

ఇవి పాటించి, నెలకి పది, పెన్నెండు కిలోలు తగ్గొచ్చు,ఆరోగ్యకరంగా తింటూ ! మొదట్లో కష్టమనిపించింది కానీ ఇప్పుడు అలవాటై పోయింది !

సుజాత వేల్పూరి said...

భాస్కర్ గారు, శ్రీ గారు, నేనూ మంతెన గారి కార్యక్రమాలు అన్నీ చూసాను. పుస్తకాలు కూడా కొన్నాను. కానీ శారీరక వ్యాయామం లేకుండా ఏ విధమైన మితాహారమూ ఫలితాలనివ్వదండీ! శరీరం వదులైపోతుంది. అదీ గాక ఇలాంటి ఆహారం మంచిదైతే కావొచ్చు గానీ , ఇక తర్వాత ఏ రకమైన ఆహారాన్నీ శరీరం యాక్సెప్ట్ చెయ్యకుండా ఉండే స్థాయికి ఈ ప్రకృతి ఆహార వాడకం చేరకూడదని అనుకుంటాను నేను. కొవ్వులు తగ్గించి, కూరగాయలు ఎక్కువ తీసుకోవడం, నీళ్ళు ఎక్కువ తాగడం(ఒకేసారి కాదు),తగినంత వ్యాయామం....పాజిటివ్ ఆలోచనా విధానం ఇవి చాలు ఆరోగ్యానికి.

Bhãskar Rãmarãju said...

@శ్రీ గారు: Let me Try this.
@సుజాత గారు: నిజమే. అన్నట్టు మీరు పొట్ల కాయ పెరుగుపచ్చడి మీద ఏమి చెప్పలేదు. :(.
ధన్యవాదాలు...

సుజాత వేల్పూరి said...

భాస్కర్ గారు,
పొట్లకాయ పెరుగుపచ్చడి మా అమ్మ చేసినట్టు ఇంకెవ్వరూ చెయ్యలేరు.(మీరూ మీ అమ్మగారి గురించి ఇలాగే అనుకుంటారనుకోండి), పైగా అచ్చు మీరు చెప్పిన స్టైల్లోనే చేస్తుంది. ఈ టపా కొంచెం లేటుగ చూసా! అప్పటికే ఆరోగ్య సూత్రాల దాకా వచ్చేశాయి వ్యాఖ్యలు!

పొ.పె.ప ని అమ్మ ని తల్చుకుని దిగాలుపడి ఊరుకున్నాను! ఇప్పటికిప్పుడు దానికోసం 6 గంటలు బస్సులో కూచుని పేట వెళ్ళలేనుగా మరి!