Wednesday, December 31, 2008

ఓ శుక్రోరం సాయంత్రం!!

ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2009 మీకు ఆనందాన్ని కలుగజెయ్యాలని కోరుకుంటున్నా.


ఓ శుక్రోరం సాయంత్రం, మరి వైటీ(IT) జనాలకి పండగేగా శుక్రోరం అంటే, బుడ్లు తెచ్చుకుని, పేపరు పరిసి, చిప్పిసు, ఓ నాలుగు మిర్చి బజ్జీలు, ఓ సోడా, నాలుగు పొట్లాలు వేపిన మసాలా బఠాణీలు పెట్టుకుని, గుటుక్కున ఓ గుక్కేడు బుడ్లోంచి గోతులోకి ఒంపేస్కుని, గబ్బుక్కున ఈ చెత్తని నోట్టోఏస్కుని కరకరా నముల్తూ, ఆపీసోడి తొడలపైనబొక్కు (LAPTOP) లో సగవ్ సీకటెల్తుర్లో పాతకాలపు ఇషాద పాటలేస్కుని ఇలా
చౌదవిక చాంధో యా అఫ్తాభ్ హో జోభీ హొ తుం ఖుదాకి కసం లా జవాబుహో..
బహరొం ఫూలు బరసావో మెర మెహబూబు ఆయాహై మెరా మెహబూబు ఆయాహై..
అభీనజావో ఛోడ్ కర్ ఏ దిల అభీ భరా నహి..
జిందగీ భర్ నహి భూలేగి ఓ బరసాత్ కి రాత్..
హం బేఖుదీమె తుంకో పుకారే ఛలేగయే..
సుహాని రాత్ ఢల్చుకి నాజానె తుం కబావొగె..
కభీ కభీ మేరె దిల్ మే ఖయాల్ ఆతాహై..
कभी कभी मेरे दिल मैं ख्याल आता हैं
कि ज़िंदगी तेरी जुल्फों कि नर्म छांव मैं गुजरने पाती
तो शादाब हो भी सकती थी।

यह रंज-ओ-ग़म कि सियाही जो दिल पे छाई हैं
तेरी नज़र कि शुओं मैं खो भी सकती थी।

मगर यह हो न सका और अब ये आलम हैं
कि तू नहीं, तेरा ग़म तेरी जुस्तजू भी नहीं।

गुज़र रही हैं कुछ इस तरह ज़िंदगी जैसे,
इससे किसी के सहारे कि आरझु भी नहीं.

न कोई राह, न मंजिल, न रौशनी का सुराग
भटक रहीं है अंधेरों मैं ज़िंदगी मेरी.

इन्ही अंधेरों मैं रह जाऊँगा कभी खो कर
मैं जानता हूँ मेरी हम-नफस, मगर यूंही

कभी कभी मेरे दिल मैं ख्याल आता है. **

పాడుకుంటూ....ఎక్కడున్నాన్నేను...

రోజులు మారుతున్నాయ్..ఎక్కడబడితే అక్కడ ఏదిబడితే అది తింటే సస్తావ్ అని పెద్దల సామెత
ఓ శుక్రోరం సాయంత్రం ఇంటికాడ ఇట్టాజేస్కుని సూడండి:
మసాలాపాపడ్
సానా వీజి. ఆపీస్ నుంచి ఇంటికెళ్లేప్పుడు కూరగాయల కొట్టుకాడ ఓ చటాకు మిర్చి, ఓ కట్ట కొత్తిమీర, ఓ కట్ట పుదీనా, ఓ రెండు టమాటాలు, ఓ రెండు ఉల్లిగడ్డలు, ఓ నిమ్మకాయ కొనుక్కో. పక్కనే దుకాణంలో పాపడ్ కొను. ఎట్టాంటి పాపడ్, నీ రెండు అరసేతుల్నికలిపినంత పెద్దవి. ఏట్టా ఉండాల, పైన మిరియాలు ఏసిఉండాల. ఆటిని తీస్కో. ఇంటికిజేరు (బుడ్లెత్తుకెళ్లు, అదినేజెప్పాల్సిన పనిలేదనుకో).
ఇక మొదలెట్టు.
ఓ ఉల్లిపాయని సన్నగా తరుక్కో. మసాలా బండోణ్ణి గుర్తుకుతెచ్చుకో, అదే వచ్చేసుద్ది సన్నగ తరగటం. ఇప్పుడు, మిరగాయలు ఓ నాలుగు తీస్కో, కడుగు, సన్నగా తరుగు. ఇక పుదీనా తీస్కో కడుగు. సన్నగా తరుక్కో, ఇక కొత్తిమీర, బాగా కడుగు, సన్నగా తరుక్కో. ఇక మిగిలింది టమాటా, కడుక్కో ఓ సారి టమాటా ని, జాగర్తగా సన్నగా తరుక్కో, చితకిపోనీమాక ఆటిని. ఇప్పుడు, నిమ్మకాయ కోసేసి పెట్టుకో ఓ పక్కన. అన్నీ ఓ గిన్నెలో వెయ్యి, బాగాకలుపు, కొంచెం ఉప్పు వెయ్యి, కలుపు, నిమ్మకాయ పిండు. పక్కనబెట్టుకో.
ఇక పొయ్య ఎలిగించు. అప్పడాలని కాల్చు. మంట అంటీ అంటకుమండా కాలిస్తే బాగ వస్తాయ్, లేకపోతే మెలికలు తిరిగిపోయ్ బాగుండవు. మైక్రోవేవు ఉంటే, ఇంకా వీజీ. అప్పడం దాంట్లో ఎట్టేసి ఓ 30 సెకెండ్లు కొట్టావంటే తిరుగుండదు. సరే నీ తిప్పలు నువ్వు పడు. కల్చుకో మొత్తానికి, సేతులు కాదు, అప్పడం.
ఇక కుర్సో, ఓ అయిపు ఇందాకటి గిన్నెట్టుకో, ఇంకో అయిపు బుడ్డీ, ఓ సేత్తో అప్పడం. అప్పడం ఇరగ్గొట్టి గిన్నలోని మసాలో స్కూపుజేస్కుని లాగించు.
కొంతమంది అప్పడం పైన జల్లేస్కుంటారు. దానివల్ల అప్పడం మెత్తబడి, అప్పడం చపాతీ అవుతుంది.


కార్న్ మసాలా
నీలగిరీస్కో లేక ఫుడ్డు వరల్డ్కో ఎళ్లి గోయా మొక్కజొన్న టిన్ను తెచ్చుకో.
ఇందాకజెప్పిన మసాలా సిద్ధంచేస్కో. టిన్ను తెరువు. ఎలా? టిన్ను ఓపెనర్ ఉంటుంది దాంతో, బీరు ఓపెనర్తో రాదు బాబాయి, ట్రై సెయ్యటం దండగ. సరే, తెరిచాక, నీళ్లు ఒంపేసి, ఆ మొక్కజొన్నని ఓ సారి మాములు నీళ్లతో రిన్సు* చేసి పక్కన బెట్టుకో. పొయ్యి ఎలిగించు. ఓ మూకుడెట్టు. ఈ మొక్కజొన్నని ఓ సారి వేపు. వెంటనే తీసెయ్. ఉప్పు కారం వేస్కోఇందాకటి మసాలా కలుపు, నిమ్మకాయ పిండు ..ఇక లాగించు.

చెన్న మసాలా
గోయా గాడి చెన్న టిన్ను తెచ్చుకో. ఓపెనుజేసి, ఓ సారి కడుగు*. పొయ్యి ఎలిగించు. ఓ చెంచాడు నూనె వెయ్. ఎండు మిర్చి ఒకటివెయ్, ఏపు, కాంగనే ఓ వెల్లుల్లి రెబ్బ వెయ్, ఏపు, కాంగనే ఈ చెన్నా వెయ్. ఏపు, ఉప్పు కారం ఏస్కో, దీంపేసేయ్, ఇక లాగించు. ఈటినే గుగ్గిళ్లు అంటారు. ఈ పద్ధతినే శాతాలించటం అంటారు.

ఇంకోరకం చెన్నా మసాలా:
పొయ్ పెట్టు, ఓ టమాటా తరిగేసి దాంట్లో వెయ్, గంటె పెట్టి చిదుము, దాంట్లో చెన్నా వెయ్, ఉప్పు, కారం, ధనియా పొడి వేసి కుతకుతలాడంగనే దింపెయ్, దిపాక ఇందాకటి మసాలా అదేనయ్యా తరుక్కున్న ఉల్లిపాయలు కొత్తిమీర, పుదీనా, తరుక్కున్న మిర్చి, వేసేసి ఓ సారి బాగా తిప్పి నిమ్మకాయ పిండి లాగించు. దీన్నే మేము గుంటూరులో మసాలా బండోడిదెగ్గర తింటాం. ఇక్కడ చదువుకో దానిగురించి కావాలంటే.
ఈటిని తింటా ఈ పాటలు ఇనుకో!!!!!
మామా చందమామా వినరావా నా కధ..
నీలాలా నింగిలో..
నేనొక ప్రేమ పిపాసిని..
రాగాల పల్లకిలో కోయిలమ్మా..
మబ్బే మసకేసిందిలే..
కధగా కల్పనగా..
గంధము పూయరుగా..
ఓ బంగరువన్నెల చిలకా..
ఎవరికెవరు ఈ లోకంలో..
అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా..
ఏ కులము నీదంటే గోకులము నవ్విందీ..
పూలు గుస గుసలాడేనని..



* కడగటం అంటే rinse thru water అని.

Tuesday, December 16, 2008

సిక్కుడుకాయ కూర ఇదానంబెట్టిదనగా

ఇనరా తెలుగు ఈర పుత్రుడా ఈ సిక్కుడుకాయ కూర ఇదానం
తందాన తానా
"స్రోతలందరికీ నమస్కారాలు. బెమ్మసారిగా ఈ జానెడు పొట్టపడే కష్టాలకి సిక్కుడు సెల్లి సేసే సేవ ఇప్పుడు మీముంగట ఇరియబోతున్నది"
"ఆగు సోదరా ఆగు! జానెడు అన్నాడు, పొట్ట అన్నావు, అన్నా! మాకు ఇంకా ఇవరంగాజెప్పు"
"అదేరా! గదుల్లో సమయానికి తొండిలేక, కళ్లముంది పచ్చటి కూరగాయలెన్నున్నా సేస్కోటం రానోళ్లకి ఆకలి మంటేగా"
"ఈసారి అర్ధం ఐంది సోదరా, నిజంగా కష్టలే, మరి సిక్కుడుకాయ కూర ఎట్టాజేస్తారో ఇవరంగా జెప్పు"
"ఇనరా తెలుగు ఈర పుత్రుడా ఈ సిక్కుడుకాయ కూర ఇదానం"
తందాన తానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
తందానా దేవనందనానా.. తందానా దేవనందనానా
"ముంగట కిలో సిక్కుళ్లు"
"సై"
"ఇంటికి సంచిలో తెచ్చుకో"
"సై"
"సిక్కుళ్లని కదిగావా, ఒక పళ్లెమ్లో పోసావా"
"భాళా భళీ" ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"సిక్కుళ్లని కడిగావా, ఒక పళ్లెమ్లో పోసావా"
భాళా భళీ
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"ఒక్కో సిక్కుడు తీసుకో"
"సై"
"ఈనెల్ని ఇర్సుకో"
"సై"
"మూడు ముక్కలుజేసుకో"
తందాన తానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"అగ్గి పెట్టి పొయ్యి ఎలించి"
భాళా భళి
"ఓ పెద్ద గిన్నెలో నీళ్లతో"
భాళా భళి
"ఆ పొయ్యిమేద బెట్టేసి"
సై
"నీళ్లు మరగంగనే"
సై
"గిన్నెడు నీళ్లు మరగంగనే"
సై
"ఆ గిన్నెడు నీళ్లు మరగంగనే"
తందానా దేవనందనానా
"ఒక చిటికెడుపసుపుఏస్కో"
సై
"ఒక చెంచా ఉప్పు ఏసుకో"
సై
"ఆ సిక్కుడు ముక్కలు కుమ్మరించుకో"
భళా భళీరా సోదరా, బాగున్నదిరా ఈ కూరరా.హై
"మూతబెట్టి బాగా ఉడకనీ"
హై
"బాగా ఉడికినాక పొయ్యిని ఆర్పేసి"
హై
"ముక్కల్ని వడగట్టి"
హై
"ఓ పక్కన సిద్దంగా బెట్టుకో"
తందాన తానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"ఇప్పుడింకేమి సెయ్యాలో ఇవరంజెప్పు అన్నా"
"అట్టాగేరా, ఇనుకో"
సై
"అగ్గి పెట్టి పొయ్యి ఎలించి"
భళాభళి
"ఓ చెంచాడు నూనెపోసి"
భళాభళి
"తిరగమాతే వేసావా"
తందాన తానా
"తిరగమాత శిటపట అన్నదా"
తందాన తానా
"ఓ రెండు వెల్లుల్లి రెబ్బలు"
భళాభళి
"ఓ రెండు వెళ్లి రెబ్బలు"
భళాభళి
"ఓ రెండు వెళ్లి రెబ్బలు"
భళాభళి
"నలగ్గొట్టి దాంటో ఏసావా"
తందాన తానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
తందానా దేవనందనానా.. తందానా దేవనందనానా
"ఇప్పుడు కొంచెం ఉప్పేసుకో"
తందాన తానా
"కొంచెం కారం ఏసుకో"
తందాన తానా
"ఇప్పుడు ఆ సిక్కుళ్లని"
తందానా దేవనందనానా
"ఇప్పుడు ఆ సిక్కుళ్లని"
తందానా దేవనందనానా
"ఆ భాండీలో ఏసుకో"
తందానా దేవనందనానా
ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం ఢుంటకఢుంఢుం
"ఆ కూరని ఓ సారి తిప్పావా"
సై
"ఓ 5 నింషాలు పొయ్యిమీనే ఉంచావా"
సై
"ఇప్పుడింక పొయ్యినాపేసి, ఆ కూరని దింపుక్ని లాగించు"
"అయ్యింది అన్నా, బలే బాగాజెప్పావ్,కూరా సానా రుసిగా ఉంది"
"ఇందుమూలంగా యావన్మందికి నమస్కారాలతో ఇక సెలవ్ దీస్కుంటూ"
"జై హింద్"
నోట్: సిక్కుడుకాయ ఇలా జెయ్యాలి అని ఎక్కడా లేదు. ఒక్కోరోజు కారంతోబాటు కొబ్బరి తురిమేసి సేస్కుంటే, ఇంకోరోజు మాడ్చిన కారం దీన్నే మేము కారప్పొడి అంటాం - ఇదేస్కోవచ్చు, ఇంకోపూట కొబ్బరి కారం, ఇంకోసారి శనగపొడి (పుట్నాల పప్పు, ఎండు మిర్చి, ఉప్పు తిరగమాతలో వేసి దంచితే వచ్చే పొడి) ఇలా రకరకాలుగా వండుకోవచ్చు.
సిక్కుడుకాయకి ఈనెలు తియ్యటం ఎలా? ఇక్కడ సూడండి
వంట

Wednesday, December 3, 2008

పిజ్జా పురాణం

ఎందుకో ఇది రాయాలనిపించింది.
పిజ్జా (pizza; should be read as pit.tsa. In Italiano, z=ts) అనేది, దక్షిణ ఇటలీ పట్టణమైన నపొలి (దీన్నే నేపుల్స్ అని కూడా అంటారు) లో ఎప్పుడో గడచిన కాలమ్లో పేదవాడి బ్రెడ్. బ్రెడ్డు, మీద టమాటా సాసు అదీ పీజ్జా అంటే. తర్వాత్తర్వాత నపొలి కి సందర్శకులు ఎక్కవగా రావటం, దేనికంటే అదొకపెద్ద వ్యాపార కేంద్రం, అక్కడకి దెగ్గర్లో ఓ అగ్నిపర్వతం ఉండటం, కొన్ని రకాల చేపలు అక్కడ విరివిగా దొరకటం ఇలా ఎన్నోకారణాలవల్ల జనాల తాకిడి ఎక్కువకావటం, వచ్చిన వాళ్లు ఈ పేదోని ఆహారాన్ని ఇష్టపడటం అలా అలా ఇది వ్యాప్తి చెందింది. ఇప్పటికీ నపొలి పీజ్జా అంటె ఆ రుచే వేరు. ఈ బేసిక్కు పీజ్జా లో మూడు రంగులు ఉంటాయ్. అవి - టామాటా సాస్ - ఎరుపు , మొజరిల్ల ఛీజ్ - తెలుపు, బేసిల్ ఆకులు - ఆకుపచ్చ - అవే ఇటాలియన్ ఝెండా రంగులు. దీన్నే పీజ్జా మార్గరిటా అనికూడా అంటారు. ఇలాంటిదే పీజ్జా మరినారా. తేడా ఏంటి అంటే - మరినారా పీజ్జా మీద మొజరిల్లా ఛీజ్ కి బదులు వెల్లుల్లి, ఒరెగానొ వేస్తారు.

కాబట్టి నపొలి పీజ్జా అంటే - పల్చని బ్రెడ్ లేక క్రస్ట్, దానిమీదటమాటా సాసు, మొజరిల్ల ఛీజ్ మరియూ బేసిల్ ఆకులు. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటి - దీన్ని కాల్చే పద్ధతి. కట్టెలు పెట్టి, ఇటుకల పొయ్యి- బ్రిక్ ఒవెన్ - లో కాలుస్తారు. అదీ దీని అసలు రహస్యం.

ఏమాటకామాట - ఆరోజుల్లో, మా కార్యాలం నుండి రూముకి వెళ్లే దారిలో ప్రోంతో పీజ్జా అనే ఒక పిజ్జేరియా లో, ఇంటికి వెళ్తూ వెళ్తూ ఓ మీడియం పీజ్జా మార్గరిట ని ఆర్డరు జేస్కుని ఇంటికి పరిగెత్తుకుంటు వెళ్లి జ్యూసీగా ఉండె ఆ పీజ్జా ని వేడి వేడిగా లాగింస్తుంటే - అద్భుతం. అదేదో పాటలోలా "ఆరోజులు మళ్లీ రావేల నేస్తం" (అక్కినేని, ప్రభాకర్ రెడ్డి, కార్తీక్, అమల - ఏంసినిమా అబ్బా అది, ఏంపాటబ్బా అదీ? యాద్కొస్తల్లే)....

పాస్తా

ఆన్ సైట్ కి వెళ్లినోళ్లకి తిండి ఓ పెద్ద సమస్య. కొంతమంది "హా! డబ్బాలో మన వన్నం, బిర్యాని, పప్పుకూరలేస్కెళ్తే మసలా వాసన్లు వస్తాయ్, క్లైంటు దడ్చుకు సస్తాడు" అని అనుకుంటారు. నేను మా కార్యాలమ్లో నా సీట్లోనే కూర్చుని, అన్నం దోసకాయ పప్పు, ఆవకాయ వేస్కుని చేత్తో హ్యాపీగా కలుపుకుని లాగిస్తా. మా మేనేజెర్ వస్తే - ఓ సారి జూసి ఓహ్ అని వెళ్లిపోతాడు. బొంగు! మన బువ్వ మన ఇష్టం. అనిజెప్పి ఎండుచాపల పులుసు తీస్కెళ్లలేంలే.

చాలా సింపుల్గా, రుచిగా, డబ్బాలోబెట్టుకుని, మైక్రోవేవ్లో వేడిజేస్కుని తినగల్గే వంటల్లో పాస్తా ఒకటి. ఈ మధ్య మల్టై గ్రైన్ పాస్తా కూడా దొరుకుతున్నది మార్కెట్లో.
సరే పాస్తా అంటే అది మనదే. మన ఉప్మ కూడా ఓరకం పాస్తానే. ముందు ఈ పాస్తా సంగతేంటో జూద్దాం.
పాస్తా అంటే ఇటాలియన్లో "తడిపిన పిండి" అని అర్ధం, చపాతీపిండిలా. పాస్త అంటే ఇలాంటి పిండితో వండే వంటలు అనుకోవచ్చు. కొంతమంది "పాస్తాతో వండిన వంటల్ని పాస్తా" అంటారు. :):) అదేనాయనా గమ్మత్తు. అర్ధంకాకపోతే పాస్త వండుకుని హ్యాప్పీగా ఓ గళ్లాసులో దాచ్చారసం పోస్కుని పాస్తా తింటూ తాగుతూ అట్టా బైటపడే మంచు సూత్తా ఎన్సోయ్ చెయ్.

సరె మొత్తం 350 రకాలు ఉన్నాయంట పాస్తాల్లో.
స్ప్రింగుల్లాంటివి, గొట్టల్లంటివి, బొంగుల్లాంటివి, చెక్కల్లాంటివి, ముక్కల్లాంతివి, బీడీల్లాంటివి, సుట్టల్లాంటివి, తాళ్లలాంటివి, తేళ్లలాంటివి, నాలాంటివి, నీలాంటివి...et al.

తాడుల్లాంటి అదే పావులాఉండే పాస్తాని స్పగెటి అనికూడా అంటారు.

ఇంక ఈ సమాచారం సాలు, ఇసయంలోకొస్తే:-
పాస్తా సెయ్యటానికి ఏంగావాలా? పాస్తా గావాల. వాల్మార్ట్కో (సూపర్సెంటర్), లేక శాంస్కో లేక బీజేస్కో ఎళ్లినప్పుడు బరిల్లా పాస్తా కోసం వెతుకు. ఇదిగో ఇట్టాంటివి తెచ్చుకో


సరే - స్ప్రింగులు తెచ్చుకున్నావ్ అనుకుందాం.
ఇంకేంగావాలి? ఎజిటేబిళ్లు - అంటే కూరగాయలు. ఏమి కూరగాయలు - నీకు దొరికినవన్నీ - బీన్సు, క్యారెట్టు, బ్రొక్కొలి, బేబీ మొక్కజొన్న - మరియూ ఏ మరియూ ఆ మరియూ పా. ఇంకా, టమాటాలు, మిరగాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, నూనె, కొత్తిమీర.
ఏమి నూనె - నీకు తెలిస్తే ఆలివ్ ఆయిల్ (1), లేకపోతే, మనం మామూలుగా వాడుకునే నూనె.

చేసే పద్ధతి :
ఓ పెద్ద గిన్నే తీస్కో నువ్వు వండుదాం అనుకునే పాస్తా మెత్తం దాంట్లో పట్టగలిగేంత పెద్దది. పాస్తా మునగగలిగేంత నీళ్లు పొయ్. నీళ్లు సల సల కాకంగనే పాస్తా దాంట్లో వెయ్, కొంచెం ఉప్పు వెయ్ (బాసు!! ఉప్పు వెయ్, పొయ్యకు), ఓ చెంచాడు నూనె వెయ్ (2). ఇక ఉడకని. మీడియం లో పెట్టు మంటని పాస్తా గిన్నెకి అతుక్కోకుండా ఉంటుంది ఆ మంటతో.
ఇప్పుడు, ఉల్లిగడ్డ సన్నగా నిలువుగా తరుక్కో, మిరగాయ, నిలువుగా నాలుగు ముక్కలు జేస్కో, కూరగాయ ముక్కలన్ని తరుక్కో. బీన్స్, ఒక్కోటి నాలుగు ముక్కలు, బ్రొక్కొలి చిన్న చిన్న గుత్తులుగా, క్యారెట్టు చిన్న చిన్న క్యూబుల్లా తరుక్కో, టమాటా కూడా చిన్న చిన్న క్యూబుల్లా తరుక్కో, కొత్తిమీర కడుక్కో, పక్కనబెట్టు. ఈలోపల పాస్తా ఉడికిందేమో జూడు. ఎలా, ఓ పాస్తాని చెంచా పెట్టి గిన్నె గోడకేసి నొక్కు మెత్తగా విడిపోతే ఉడికినట్టు. సరే ఉడకంగనే పొయ్ ఆర్పివెయ్, ఓ జల్లెడ తీస్కో, సింకు దెగ్గరకి జల్లెడ, పాస్తా ఉడ్కబెట్టిన గిన్నే తీస్కెళ్లి, వడపొయ్ - గిన్నెని ఆ జల్లెడలో బోర్లించు. చల్లటినీళ్లని ఓసారి ఆ జల్లెడ మీడుగా పోని. పక్కనబెట్టు. ఇందాకటి గిన్నె తీస్కో, ఓ సారి కడుక్కో, మళ్ళీ పొయ్యి మీద బెట్టు. నూనె పొయ్. నూనె వేడెక్కేలోపు, వెల్లులి తీస్కో, బొటనవేలితో ఘట్టిగా నొక్కు, తొక్క తీయ్, పక్కనబెట్టు, నూనె వేడెక్కింది, దాంట్లో తరుక్కున్న మిరగాయ వెయ్, చిట్ పట్ అంటుంది, దడుసుకోకు, ఓ సారి తిప్పు, వెల్లుల్లి వెయ్, ఓ సారి తిప్పు, ఇప్పుడు - తరుక్కున్న ఉల్లిపాయలు వెయ్, వేపు - వేగినయ్ అనుకున్నాక, కూరగాయ ముక్కలు వెయ్, వేపు - వేగినయ్ అనుకున్నాక టమాట వెయ్, ఉప్పు వెయ్, ఓ సారి తిప్పు, టమాటా కొంచెం ఉడకని, ఇప్పుడు ఉడ్కబెట్టిన పాస్తావెయ్, తిప్పు, కొత్తిమీరతో ముగించు.
రిఫరెన్సు:
1. ఆలివ్ ఆయిల్ - ఇదేంటిది అనుకుంటున్నావా? అదే కహానిలో ట్విష్టు. ఆలివ్ ఆయిల్ నాలుగైదు రకాలు.
ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ - కోళ్డ్ ప్రెస్సింగ్ ద్వారా తీసేది. 0.8% ఆమ్లత్వం.
వర్జిన్ ఆలివ్ ఆయిల్ - 2% ఆమ్లత్వం. దీనికి రుచి ఎక్కువ
ప్యూర్ ఆలివ్ ఆయిల్ , ఆలివ్ ఆయిల్ - వర్జిన్ ఆలివ్ ఆయిల్ + రిఫైండ్ ఆయిల్
et al.
దీంట్లో సంగతి ఏంటంటే కొన్ని రకాల ఆలివ్ ఆయిళ్లని ఫ్రై వంటల్లో వాడకూడదు. వాటిని కేవలం డ్రెస్సింగుకి మాత్రమే ఉపయోగించాలి.
2. ఉడుకుతున్నవాటిల్లో నూనె దేనికి? అన్నంలో కూడా ఓ బొట్టు నెయ్యి వేస్తే - అన్నం పొడిపొడిలాడుతుంది. అట్టానే ఇక్కడకూడా నూనె వేస్తే పాస్తా కరుచుకోకుండా విడివిడిగా ఉంటాయ్.

నోట్: పాస్తా చేసే విధానం ఇది అని ఎక్కడా లేదు. ఐతే - ప్రాంతాలవారీగా ఫేమసు ఐన విధానాలు ఉన్నయ్. అంటే గోల్కొండ నవాబులు ఒకలా, పల్నాటి వీరులు ఇంకోలా, విశాఖ అరసం సభ్యులు ఇంకోలా చేస్కుంటారు.

మరి ఇంక ఆలస్యం దేనికి లాగించండి.