హఖహ!! (గొంతు సవరణ)
ఇంతకీ కధ ఏమనగా
మాకూ స్ప్రింగు వచ్చిందీ, మేమూ ధైర్నంగా ఇంటోంచి బయటికి వస్తున్నం, హీటర్లు గట్ర ఆపేసినం. మా దేశీ కొట్టోడు దోస్కాయలు దెచ్చిండు. వండుకున్నం. ఏముందీ గురూ అంటావా? కుంపటిమీన వండినం. :):)
From దోసకాయ పప్పు |
మరీ పైన బొమ్మలో ఉన్నంత తాజా మాల్ కాదుగానీ పర్లేదు, ఓ మోస్తరి తాజా దోసకాయలు తెచ్చాడు మావాడు.
సరే మొన్న ఇరవై ఐదు కి వచ్చింది వేడి. బిలబిల మంటూ జనాలు బయటకి వచ్చేసారు. నేనూ ఇక కుంపటి వెలిగిద్దాం అని మొదలిబెట్టా.
ముందుగా దోసకాయ పప్పు చెయ్యటానికి కావాల్సిన వస్తువులు -
దోసకాయ.
మిర్చి కొన్ని.
కర్వేపాకు.
కందిపప్పు.
ఉప్పు గట్ర........
ముందుగా దోసకాయకి చెక్కుతీసి సన్నని ముక్కలుగా తరుక్కోవాలి.
From దోసకాయ పప్పు |
కుంపటి రా చెయ్యి. అనగా, బొగ్గులు కుంపట్లో వేసి, కిరసనాయిలు పోసి, వెలిగించి సిద్ధం చేస్కో.
ఇప్పుడు ఒక గిన్నెలో కందిపప్పు ఓ గిద్దెడు, పోసి ఒకసారి కడిగి, ఒకటికి రెండు చొప్పున నీళ్ళు పోసి కొంచెం పసుపువేసి కుంపటి మీద పెట్టు. మూతపెట్టు. కొంచెంసేపయ్యాక పొంగొస్తుంది పప్పు, మూతని ఓరగా పెట్టు ఇక ఉడకనీ
From దోసకాయ పప్పు |
కందిపప్పు ఒక గింజ ఒత్తిచూడు, మెత్తగా నలిగిందీ అన్నప్పుడు దోసకాయ, మిర్చి, కర్వేపాకు వేసేయ్. మూతపెట్టు.
From దోసకాయ పప్పు |
బాగా ఉడకనీ ఇక. అప్పుడప్పుడూ నీళ్ళు ఉన్నాయో లేదో చూస్తుండూ. నీళ్ళు తగ్గితో ఓ అరగ్లాసు పొయ్యి. ఏంకాదు.
From దోసకాయ పప్పు |
అప్పుడప్పుడూ మూత తీసి చూస్తుండూ ఏంటీ పరీస్తితీ అని.
ఇక దోసకాయ ముక్క ఉడికిందీ అన్నప్పుడు ఉప్పూ కారం వేసేయ్.
From దోసకాయ పప్పు |
ఓ సారి మొత్తం కలియతిప్పి, తిరగమాత వేసి, కొంచెం కొత్తిమీర జల్లు.
From దోసకాయ పప్పు |
ఓ సారి మొత్తం కలిపి, దింపెయ్.
దింపినాక, ఓ నిమ్మకాయ పిండు.
వేడి వేడి దోశకాయ పప్పు నెయ్యితో కుమ్ము.
కొంతమంది నిమ్మకాయ బదులు చింతపండు వాడతారు. నాకు మిమ్మకాయ నచ్చుతుంది. కొంతమంది కారం బదులు మిర్చి పేస్ట్ వాడతారు అనగా ఓ నాలుగు మిర్చిని గ్రైండ్ చేసి కుమ్మటమే. ఐతే మిర్చీ పేస్ట్ వేస్తే అది పచ్చివాసన పొయ్యేదాకా ఉడకనివ్వాలి.
కాంబినేష్నన్స్ తెల్సుకో - పప్పులో పచ్చడి కలుపుకుని తినే అలవాటు ఉంటే, దోసకాయ పప్పులోకి సరైన కాంబినేషన్ కొత్త ఆవకాయ.
కుమ్ము ఇక.
మా దేశి కొట్టోడు ఎల్.బికి మూడు డాలర్లు నూకాడు.
నాకు బాగా గుర్తు, మా ఊళ్ళో, దోసకాయలు ఎలా అమ్ముతారూ అంటే, ఎద్దుల బండ్లకి ముందున్న జల్లలో దోసకాయలు తెచ్చి ఊళ్ళో ఒకచోట ఆపుతారు. ఊరి ఎట్టోడు తప్పెట తో వస్తాడు, రచ్చబండాకాడాకి దోస్కాయల బండ్లొచ్చినై. ఎత్తు రూపాయ అని. ఎత్తు అనగా మూడు కిలోలు. జనాలు ఎళ్ళి మూడో నాలుగో ఎత్తులు తెచ్చుకుంటారు. రాళ్ళలా ఉండేవి ఆ దోసకాయలు. పెద్దపెద్దవి. వెతికి చూద్దాం అన్నా కుక్కమూతులు ఉండేవి కావు. పప్పు, కూర, పచ్చడి, చారు, పులుసు వీటిల్లోనే కాకుండా దోసకాయని నిలువునా కోసి ఉప్పు కారం అద్దుకుతింటే మహా రుచిగా ఉంటుంది. ఐతే దోసకాయ తిన్న పొట్ట దొంగలుపడిన ఇంటితో సమానం. మా ఊరిబయట ఎక్కడ చూసినా దోసకయ చెట్లే.
బళ్ళో నెలకోసారి బోర్డు క్లీనింగు కార్యక్రమం. దానికి బడికి ఎళ్ళేప్పుడే చొక్కా నిండా ఈ దోసాకు నింపుకుని, బడికెళ్ళినాక దులిపి, దోసాకూ బొగ్గు బాగా నూరి బోర్డుకి పట్టిస్తే, భలే వొచ్చేవి బోర్డులు.