Friday, April 3, 2009

వడపప్పు, పానకం

జగమెల్లరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

మరి శ్రీరామనవమి రోజున, పందిళ్లలో జెగ్గులకొద్దీ పానకం, దోసిళ్లకొద్దీ వడపప్పు తినకపోతే మహా పాపం.
అసలు ఏంటివి? ఎలా చేస్తారు?
శ్రీరామనవమి చైత్రమాసం కాబట్టి, ఎండలు ముదురుతుంటాయి. తాపాన్ని తట్టుకుని, కాస్త చలువచేసేవి తినండి అని అంతర్లక్ష్యం.
పానకం తయ్యారీ విధానం -
కావాల్సినవి -
ఓ కూజాడు నీళ్లు.
ఓ వంగ గ్రా।। బెల్లం.
నాలుగు యాలుకలు.
నాలుగు మిరియాలు.
విధానం-
యాలుకల పైన తొక్క తీసేసి, ఆ గింజల్ని ఓ చిప్పగంటె నూరుకుని నీళ్లల్లో వేసేయి.
మిరియాలని, చిప్పగంటె తో బాగా నూరుకుని నీళ్లల్లో కలిపేయ్.
బెల్లాన్ని బాగా చిప్పగంటెతో నలిపేసి నీళ్లలో వేసేయి.
బాగా కలుపు, బెల్లం కరిగిందాకా. అయ్యాక, తడిగుడ్డని చుట్టు జగ్గుకి. చల్లబడతాయ్ నీళ్లు.

వడపప్పు -
పెసరపప్పు ఒక కప్పుడు.
ఒక గంట నీళ్లలో నానబెట్టిన పెసరపప్పే వడపప్పు. కొందరు దీనికి చిటికెడు ఉప్పు కలుపుతారు. కొందరు కొబ్బరి తురుము ఒక అరచెంచా, కొత్తిమీర ఒక అరచెంచా, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ఒక అరచెంచా, కలుపుతారు. మన ఇష్టం, సౌకర్యం.

ముందుగా వీటిని, ఆ సీతారామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టి, ఓ పట్టుపట్టటమే, భక్తికి భక్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
అదీ కధ.

7 comments:

శ్రీ said...

హమ్మయ్యా...రేపు ఉదయం పానకం, వడపప్పు ఎలా చెయ్యాలో అనుకుంటూ ఉన్నా! రేపు మీరు చెప్పినట్టు చేస్తా.

వేణూశ్రీకాంత్ said...

ఔరా వడపప్పు లో ఉప్పూ, కొత్తిమీరా, మిర్చీనా... నాకు ఎక్కడా తిన్న గుర్తు లేదు సోదరా... నాకు తెలిసీ బెల్లం ముక్కలు, కొబ్బరి తురుము, అరటి పళ్ళ ముక్కలు కానీ లేత మామిడి ముక్కలు కానీ కలుపుతారు. నిజమే లే మన సౌకర్యం అంతే..

మురళి said...

రాముడి లో ఉన్న గొప్పతనం ఏమిటంటే.. మనం ప్రసాదం ఎలా చేసినా కాదనడు.. మిరియాలు పావు కేజీ అని రాస్తారనుకున్నా.. పర్వాలేదు, భరించగలిగే కారమే..

నేస్తం said...

ఈ రోజు నవమనే విషయం ప్రొద్దున్నే గుర్తు చేసారు నేను ఇంకా రేపు అనుకుంటున్నా.. ధన్యవాదాలు అండి

Anonymous said...

శ్రీకాంత్ గారూ ఇంట్లో పూజలప్పుడు ప్రసాదాలన్నీ లాగించేస్తారుకానీ వడపప్పుని వదిలేస్తారు. ప్రసాదం పెట్టినదాన్ని పారయ్యేకూడదు కదండీ అందుకని దాన్నీ ఏదోలా లాగించెయ్యడానికి ఎవరికి కావల్సిన రుచిలో వారు వడపప్పుకి కాస్త అవీ ఇవీ జోడించి మొత్తానికి కడుపులో తోసేస్తాం అదీ సంగతి.

Venugopal Reddy Gurram said...

రేపు గుడికి వెళ్తే...పానకం, వడపప్పు.....రాములోరి ప్రసాదం.....!

కౌటిల్య said...

హ్మ్..రాజు గారూ..పానకంలోకి మిరియాలు కాసిన్ని ఎక్కువ దట్టిస్తే మహా భేషుగ్గా ఉంటది..కూసింత పచ్చకర్పూరం తగిలించారనుకోండి,ఘుమఘుమలాడిపోద్ది..ఇక వడపప్పులో పుల్లటి పచ్చి మామిడికాయ బాగా తురిమి కలిపి,ఒక చిన్న సీసాడు తేనె గనక వేసి, ఒక అరగంట ఆగాక తింటే అబ్బో..ఇక మీరు వద్దన్నా అందరూ గుప్పిళ్ళకొద్దీ లాగించేస్తారు...నా రూములో శ్రీరామనవమి పానకానికి, వడపప్పుకి మా కాంప్లెక్సులో ఫ్యామిలీసు అంతా క్యూలు కట్టేస్తారు మరి, ఆ టేస్టు కోసం....ః)