Monday, April 27, 2009

దోసకాయ పప్పు - కుంపటి

మాష్టారూ మీరు మరీను. దోసకాయ పప్పుకి ఒక పోస్టా అనొచ్చు. కానీ రాయాలనిపించింది. పంచుకోవాలనిపించింది.
హఖహ!! (గొంతు సవరణ)
ఇంతకీ కధ ఏమనగా
మాకూ స్ప్రింగు వచ్చిందీ, మేమూ ధైర్నంగా ఇంటోంచి బయటికి వస్తున్నం, హీటర్లు గట్ర ఆపేసినం. మా దేశీ కొట్టోడు దోస్కాయలు దెచ్చిండు. వండుకున్నం. ఏముందీ గురూ అంటావా? కుంపటిమీన వండినం. :):)
From దోసకాయ పప్పు

మరీ పైన బొమ్మలో ఉన్నంత తాజా మాల్ కాదుగానీ పర్లేదు, ఓ మోస్తరి తాజా దోసకాయలు తెచ్చాడు మావాడు.
సరే మొన్న ఇరవై ఐదు కి వచ్చింది వేడి. బిలబిల మంటూ జనాలు బయటకి వచ్చేసారు. నేనూ ఇక కుంపటి వెలిగిద్దాం అని మొదలిబెట్టా.
ముందుగా దోసకాయ పప్పు చెయ్యటానికి కావాల్సిన వస్తువులు -
దోసకాయ.
మిర్చి కొన్ని.
కర్వేపాకు.
కందిపప్పు.
ఉప్పు గట్ర........

ముందుగా దోసకాయకి చెక్కుతీసి సన్నని ముక్కలుగా తరుక్కోవాలి.
From దోసకాయ పప్పు


కుంపటి రా చెయ్యి. అనగా, బొగ్గులు కుంపట్లో వేసి, కిరసనాయిలు పోసి, వెలిగించి సిద్ధం చేస్కో.
ఇప్పుడు ఒక గిన్నెలో కందిపప్పు ఓ గిద్దెడు, పోసి ఒకసారి కడిగి, ఒకటికి రెండు చొప్పున నీళ్ళు పోసి కొంచెం పసుపువేసి కుంపటి మీద పెట్టు. మూతపెట్టు. కొంచెంసేపయ్యాక పొంగొస్తుంది పప్పు, మూతని ఓరగా పెట్టు ఇక ఉడకనీ
From దోసకాయ పప్పు

కందిపప్పు ఒక గింజ ఒత్తిచూడు, మెత్తగా నలిగిందీ అన్నప్పుడు దోసకాయ, మిర్చి, కర్వేపాకు వేసేయ్. మూతపెట్టు.
From దోసకాయ పప్పు

బాగా ఉడకనీ ఇక. అప్పుడప్పుడూ నీళ్ళు ఉన్నాయో లేదో చూస్తుండూ. నీళ్ళు తగ్గితో ఓ అరగ్లాసు పొయ్యి. ఏంకాదు.
From దోసకాయ పప్పు

అప్పుడప్పుడూ మూత తీసి చూస్తుండూ ఏంటీ పరీస్తితీ అని.
ఇక దోసకాయ ముక్క ఉడికిందీ అన్నప్పుడు ఉప్పూ కారం వేసేయ్.
From దోసకాయ పప్పు

ఓ సారి మొత్తం కలియతిప్పి, తిరగమాత వేసి, కొంచెం కొత్తిమీర జల్లు.
From దోసకాయ పప్పు

ఓ సారి మొత్తం కలిపి, దింపెయ్.
దింపినాక, ఓ నిమ్మకాయ పిండు.
వేడి వేడి దోశకాయ పప్పు నెయ్యితో కుమ్ము.
కొంతమంది నిమ్మకాయ బదులు చింతపండు వాడతారు. నాకు మిమ్మకాయ నచ్చుతుంది. కొంతమంది కారం బదులు మిర్చి పేస్ట్ వాడతారు అనగా ఓ నాలుగు మిర్చిని గ్రైండ్ చేసి కుమ్మటమే. ఐతే మిర్చీ పేస్ట్ వేస్తే అది పచ్చివాసన పొయ్యేదాకా ఉడకనివ్వాలి.

కాంబినేష్నన్స్ తెల్సుకో - పప్పులో పచ్చడి కలుపుకుని తినే అలవాటు ఉంటే, దోసకాయ పప్పులోకి సరైన కాంబినేషన్ కొత్త ఆవకాయ.
కుమ్ము ఇక.

మా దేశి కొట్టోడు ఎల్.బికి మూడు డాలర్లు నూకాడు.
నాకు బాగా గుర్తు, మా ఊళ్ళో, దోసకాయలు ఎలా అమ్ముతారూ అంటే, ఎద్దుల బండ్లకి ముందున్న జల్లలో దోసకాయలు తెచ్చి ఊళ్ళో ఒకచోట ఆపుతారు. ఊరి ఎట్టోడు తప్పెట తో వస్తాడు, రచ్చబండాకాడాకి దోస్కాయల బండ్లొచ్చినై. ఎత్తు రూపాయ అని. ఎత్తు అనగా మూడు కిలోలు. జనాలు ఎళ్ళి మూడో నాలుగో ఎత్తులు తెచ్చుకుంటారు. రాళ్ళలా ఉండేవి ఆ దోసకాయలు. పెద్దపెద్దవి. వెతికి చూద్దాం అన్నా కుక్కమూతులు ఉండేవి కావు. పప్పు, కూర, పచ్చడి, చారు, పులుసు వీటిల్లోనే కాకుండా దోసకాయని నిలువునా కోసి ఉప్పు కారం అద్దుకుతింటే మహా రుచిగా ఉంటుంది. ఐతే దోసకాయ తిన్న పొట్ట దొంగలుపడిన ఇంటితో సమానం. మా ఊరిబయట ఎక్కడ చూసినా దోసకయ చెట్లే.
బళ్ళో నెలకోసారి బోర్డు క్లీనింగు కార్యక్రమం. దానికి బడికి ఎళ్ళేప్పుడే చొక్కా నిండా ఈ దోసాకు నింపుకుని, బడికెళ్ళినాక దులిపి, దోసాకూ బొగ్గు బాగా నూరి బోర్డుకి పట్టిస్తే, భలే వొచ్చేవి బోర్డులు.

31 comments:

భాస్కర రామిరెడ్డి said...

>> మా దేశి కొట్టోడు ఎల్.బికి మూడు డాలర్లు నూకాడు

ఇదో ఇందుకే, దోసకాయ పప్పు నాకు ఇక్కడ ఎప్పుడు తిన్నా చేదుగా వుంటుంది. ఎంతో కంత అని తెచ్చి పప్పుచేసేలోగా సగం దోసకాయలు కోసి కొయ్యగానే నోట్లోకి వెళ్ళి పోతాయి.

Sravya V said...

చుస్తుంటే యమ్మీ యమ్మీ గా ఉంది ! This is one of my fav. dish!

హరేఫల said...

ఇక్కడ ఇన్ని చానెల్స్ లో ఎవరోఒకరిని అడిగినా , అందరూ చూసే భాగ్యం కలిగేది. ఈ మధ్యన మన వాళ్ళు బయటకు కూడా వెళ్తున్నారు.

sunita said...

మీ ట్రేడ్ మార్క్ రామ్ములక్కాయలు, కొత్తిమీర మిస్ ఐయ్యాయి.అలానే తిరగమాతలో ఇంగువ కంపల్సరీ.

teresa said...

my favorite koora!
దోసకాయ చెట్టు???? ఇది నిజంగా శాఖా..హారమే :)

Anonymous said...

నాన్నగారూ , అబ్బ చూస్తేనే నోరూరుతుందండీ. కానీ పాపం మాయింట్లో దోసకాయ వండనీరండీ. వాతం అని మా అత్తగారి వువాచ.
అది సరేగానండీ. దోసకాయలు చెట్లకి కస్తాయా. మరి మావూర్లో ఏంటండీ పాదులకి కాస్తాయి.

Bhãskar Rãmarãju said...

భా.రా.రె - అంతపెట్టి కొనకుండా, చేదుగా లేకుండా ఉంటానికో మార్గం కనిపెట్టా. తర్వాత చెప్తా.
శ్రావ్యా - మా ఊరొచ్చెయ్. కుమ్మేయొచ్చు. :):)
హరేఫల - :):) కొన్ని కొన్ని వీడియోలు పెడుతున్నా, కొన్ని కొన్ని కేవలం ఫోటోలు మాత్రమే. సమయాభావం పిల్లల డీమ్యాండ్లు, సమయం సరిపోవటంలేదు.
"నా బ్లాగు" స.నై.టా గారూ - అదెలా అండీ, దోస్కాయ్ పప్పులో రామ్ములక్కాయా? విచికిత్రంగా ఉందే. కొత్తిమీర వేసాను, మీకు తగిలినట్టులేదు.
తిరగమాతలో మాత్రం ఇంగువ మస్టు..
తెరెసా గారు - :):) శాఖా .. హారమే:):)
లలితజీ - దోసపాదులు పెరిగితే దోసకాయ వృక్షాలు. ఇండ్లలో ఏమోకానీ, బయట (నే చెప్పే బయట) ఆ పాదులు పెరిగి తీగలై అడవులైతై, కాలు పెట్టటానికి కూడా చోటులేకుండా.
పాదులు - మరీ లలిత గారు లలితంగా చెప్పారు. మేము దోస చెట్టు అనే అంటాం.
అన్నట్టు దోసకాయ వాతమా? నిజమా? విచిత్రంగా ఉందే.

Hima bindu said...

దోసకాయపప్పు బొగ్గుల కుంపటి మీదే వండాలండి.....ఇప్పటివరకు ఆ సంగతి నాకు తెలీదండి ...అన్నట్టు దోసకాయ పుల్లగానే వుంటుందిగా .....ఇంకా చింత ,నిమ్మ జత చేయల్సిందేనా .....బొమ్మలు చూస్తోంటే ఆకలేస్తుంది.

Bhãskar Rãmarãju said...

చిన్ని - పప్పుని కుంపటిపై వండితే వచ్చే రుచి ఇక దేనిమీద వండినా రాదు. దోస్కాయ పుల్లనిదే అయినా గుర్తించదగ్గ పులుపు ఉండదు దాంట్లో. అందుకే నిమ్మ లేక చింతపండు వెయ్యాల్సిందే.

కొత్త పాళీ said...

్ఆబ్లాగు .. తెలుగ్గడ్డమీద దోసకాయలు కొద్దిగా అయినా పుల్లగా ఉంటాయి, అంచేత దోసకాయపప్పులో రామ్ములక్కాయలు నిషిద్ధం. సరే ఈ లాండాఫ్ మిల్కండ్‌హనీలో అన్నీ విశ్వామిత్ర సృష్టే కాబట్టి దోసకాయ పుల్లగా ఉండడం మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది.

@భాస్కర్ .. తమ్ముడూ, నా లెక్కల్లో దోసకాయ పప్పుకి తగిన అనుపానం తాజాగా తిరగమోత వేసి నూరిన చింతకాయ ఊరగాయ. అదిక్కడ దొరకదు కాబట్టి ఆవకాయ వోకే. అన్నట్టు రెండు వారాలకిందట సేంపుల్ గా ఓ మావిడకాయ కొంటే మాంచి పులుపుమీదుంది. ఆపట్టున ఒక అరడజను కాయలు తెచ్చి ఆవకాయ కలిపాము. బాగా కుదిరింది. బహుశా ఇంకో రెండు వారాలుంటుంది .. మీరు సపరివార సమేతంగా మా వూరొచ్చేందుకు మోటివేషన్ కావాల్నంటే :)

భాస్కర రామిరెడ్డి said...

>>అంతపెట్టి కొనకుండా, చేదుగా లేకుండా ఉంటానికో మార్గం కనిపెట్టా. తర్వాత చెప్తా.


తొందరగా చెప్పు బాబూ , మొన్నటి నుండి దోస్కాయ పప్పుతిందామని కాసుకూకోనున్నా

Bhãskar Rãmarãju said...

సింపులు -
కీరా దోస్కాయతో పప్పు చేస్కో...:):) బాగనే ఉండుద్ది.

Bhãskar Rãmarãju said...

కొత్తపాళీ అన్నగారూ - మా అమ్మమ్మా వళ్ళ ఇంట్లో పప్పులోనే డైరెక్టుగా వేసే వాళ్ళు చింతకాయ పచ్చడిని.
మీఊరు రావటానికి మంచి సాకు సూచించారు. :):)

teresa said...

చింతచిగురుపప్పు భలే ఉంటుంది , అంతా ఇలాగే వండటం.

జ్యోతి said...

నేనైతే దోసకాయ పప్పులో రామ్ములక్కాయ, చింతపండు పులుసు కూడా వేస్తాను, లేకపోతే పులుపు సరిపోదు మరి. నిమ్మకాయ ఐతే తర్వాత పప్పు వేడిచేస్తే బాగోదు. ఇందులో మెంతికూర కూడ వేసి, తాళింపులో వెల్లుల్లి తగిలిస్తే మాత్రం అదిరిపోతుంది. తినేటప్పుడు కొంచెం నెయ్యి మర్చిపోకండి..


తెరెసా,
చింతచిగురుతో పాటు మామిడికాయ కలిపితే ఎలా ఉంటుంది ? ప్రయత్నించారా?? (ఇదే కాంబినేషన్ మాంసం కలిపి వండొచ్చు. సూపర్ గా ఉంటుంది..))

నేస్తం said...

కీర దోస కూడా మా వూర్లో చేదు వచ్చేస్తుంది ..మరేం పర్లేదు దానికో చిట్కా చెప్పింది మా పక్కింటి ఆవిడ ..కీర దోస కొంటే ఆ చివరన ఈ చివరన చిన్న ముక్క కట్ చేసి ఆ కట్ చేసిన ముక్కలతో చివర్లు కాసేపు రుద్దాలి ..అప్పుడు కసరులా (కొంచెం నురుగులా) వస్తుంది ...అప్పుడు చేదు పోయినట్లే అంటా .. మరి ఇది మన వైపు దోసకాయలకు వర్తిస్తుందో లేదో ... :)

Bhãskar Rãmarãju said...

చించిగురు పప్పు అద్దిరిపోతుంది తెరెసా గారు. ఐతే పప్పుకి కావాల్సిన చించిగురు - అనగా మహా లేతది ఎక్కడ దొరుకుతుంది? హైద్ లోనే దొరుకతల్లేదు.:):)
జ్యోతి గారు -
చింతచిగురు పప్పులో మావిడికాయా?
దోసకాయపప్పులో రాములక్కాయా?
పప్పులో మాంసమా?
నేస్తం - నిజమే. కొన్ని కొన్ని సార్లు కీరా కూడా చేదుగా ఉంతుంది. పైన కోసి, ఉప్పులో అద్ది కొంచెంసేపు పక్కనపెడితే పోతుందీ అంటారు మరి.

జ్యోతి said...

మరే.. ఇప్పుడు దోసకాయలు ఏమంత పుల్లగా ఉంటున్నాయి. అందుకే అవి తప్పకుండా వేస్తాను నేను.. చింతచిగురు ,మామిడి భలే కాంబినేషన్.. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పింది చింతచిగురు, మామిడికాయ, మాంసం భలే ఉంటుంది.. ఈ కూర ఐతే నేను మా అమ్మ చేసిందే సూపర్ అంటాను.

teresa said...

హయ్యో ..చించిగురు ఇక్కడెక్కడ దొరుకుతుంది బెదరూ. ఇండియా వెళ్ళినప్పుడు పల్లె నించి తెప్పించుకుని దాన్నిక్కడ ఫ్రీజర్‌లో దాచుకుని అబ్బురంగా ఓ సంవత్సరం లాగించాం. అయిపోయింది కూడా :(

అవునూ పై ఫోటో లో దోసకాయల స్టాండ్‌ ఏ ఊర్లో? హమ్మో, అన్ని దోసకాయలే!!

జ్యోతి- మీరు చెప్పిన మామిడి +చిగురు+పప్పు ఎప్పుడూ ట్రై చెయ్యలేదండీ. మామిడికాయ దొరికినప్పుడు చిగురుండదు, చిగురున్నప్పుడు మామిడికాయ దొరకదూ. అసలే అబ్బురంగా దొరికే వాటితో ఇంక ప్రయోగాలు కూడానా :)

Bhãskar Rãmarãju said...

తెరెసా గారు - మేము గుంటూరు వచ్చిందాకా చింతచిగురు కొనిఎరగం. చింతకాయలు పచ్చడికి మాత్రం కొనేవాళ్ళం. కారణం, పచ్చడి మరి కనీసం ఒక ఎత్తు పెట్టేవాళ్ళు. అనగా మూడూకిలోలు. అశోకుడు రోడ్లకిరువైపులా ఏమి చెట్లు నాటించాడో కానీ, మాకు, పల్నాడూ ట్రంకు రోడ్డుకిరువైపులా చింతచెట్లే. కాయలు కాసినప్పుడు ఎల్లుడు రాళ్ళేసికొట్టుకుని తినేవాళ్ళం చింతకాయలు. ఇక చింతచిగురు, ఎక్కటం దూసుకొచ్చుకోటమే.

>>దోసకాయల స్టాండ్‌ ఏ ఊర్లో?
గుంటూర్లో. http://en.wikipedia.org/wiki/File:GNTdosakai.jpg
http://en.wikipedia.org/wiki/Cucumber

సుజాత వేల్పూరి said...

@తెరెసా,
చింత చిగురు ఇప్పుడు హైదరాబాదులో సూపర్ గా దొరుకుతోంది. తాజ్ కృష్ణా నుంచి ఖైరతాబాదు వెళ్ళే రోడ్లో, ఎర్రమంజిల్ కాలనీ మెయిన్ రోడ్డు మీద బోలేడు!

భాస్కర్ గారు,
భలే చెప్పారు. రావిపాడునుంచి అడ్డరోడ్డు దాకా చెట్లన్నీ మనవే! చిగురంతా మనదే!

teresa said...

@సుజాత- హ, చూడగా సిటీయే బెటర్‌ గా ఉంది! మా అమ్మమ్మ గారి పల్లెలో ఇదివరకు మా వాములదొడ్డి నిండా పెద్ద చింత చెట్లుండేవి. ఇప్పుడు అమ్మమ్మా లేదు, వాములూ లేవు, చింత చెట్లూ మాయం.
కలికాలం, ఈ దోస వృక్షాలొచ్చి చింతచెట్లని కొట్టేశాయి! ;)

teresa said...

@Bhaskar- ఔను గదా! నాకయితే ఇప్పటి పిల్లలు బోల్డు ఫన్‌ తింగ్స్‌ మిస్సయ్యారని జాలేస్తుంది అప్పుడప్పుడు :).. even though they don't care about that stuff.

Bhãskar Rãmarãju said...

మన లెగసి మిస్ అవుతున్నారు నేటి తరం పిల్లలు.
చింతకాయలు, దోసకాయలు వీటిపై కొన్ని వందల్ పేజీల కధలు చెప్పొచ్చు. దోర చింతకాయలు ఎలా రాళ్ళే కొట్టి, వాటిపై చెక్కు తీసి, ఆ చెక్కు గోటితో తీసీ తీసీ గోళ్ళు నొప్పెట్టి, ఆ పులు ఎసిడిక్ నేచర్ కి ఆ నొప్పెట్టిన గోళ్ళు వాచి, ఏంటో...

sunita said...

భాస్కర్ గారూ,
మరే?దోసకాయ పప్పులో రామ్ములక్కాయా విచికిత్రం అని దీర్ఘం తీసారుగా. మరి చూడండి జ్యోతి గారు వంటల మీద ఒక బ్లాగే రాస్తారంటా. ఆవిడ కూడా చింత పులుసు, రామ్ములక్కాయా వేస్తానని చెప్పారు. అవి లేకపోతే రుచి రాదు మరి. ఏమంటారు?

Bhãskar Rãmarãju said...

లోకో విభిన్న రుచి:
మేము ఎప్పుడూ అలా చేస్కుని ఎరగం. కాబట్టే విచిత్రంగా అనిపించింది.
నా అభిప్రాయం ప్రకారం, పాలకూరలో టమాటా వెయ్యరు, అలానే దోసకాయ ఇలాంటి వాటిల్లో కూడా టమాటా వెయ్యరూ అని. కొంతమంది ప్రతీదాంట్లో రాములక్కాయ వేస్కుంటారు...జిహ్వకోరుచి....
కాబట్టి అద్దెచ్చా...అదీ కధ.

జ్యోతి said...

భాస్కర్ గారు,
నేనైతే టమాట ఎక్కువగా వాడతాను. పాలకూర టమాట ఐతే మరీ ఇష్టం.. నా ఉద్ధేశ్యం ప్రకారం వంటింటికి ఉల్లిపాయ మహారాజు, టమాట మహారాణి. టమాటాలు కాని చవకగా ఉంటే ఇక tomato festival. అవి ఉంటే ఎన్నో కూరగాయలు ఉన్నట్టుగా ఉంటుంది నాకైతే.. :)

ఈ గోలంతా ఎందుకుగాని,, ఈరోజు నేను చేసిన దోసరాయ పప్పు చూడండి,చేయండి...

Wanderer said...

అవును గానీ, "దోసకాయి తిన్న పొట్ట దొంగలు పడిన ఇంటితో సమానం" అంటే ?

Bhãskar Rãmarãju said...

Wanderer జీ - ఎలా చెప్పను? దోసకాయ తింటే పొట్ట ఖాళీ అవుతుందీ అని.

Sathya Mukka said...

మీ వంటలు చాలా బాగా ఉన్నాయ్

ఒక చిన్న సవరణ : "ఎత్తు" అంటే రెండున్నర కిలోలు. మీరు మూడు కిలోలు అని రాసిన్రు.

మీకు ఎప్పుడైనా టైము ఉంటె నా రాతలు కూడా సూడున్రి. గమ్మత్తు లెక్కలు ఉంటై. http://telugupilladu.blogspot.com/

Sathya Mukka said...

మీ వంటలు చాలా బాగా ఉన్నాయ్

ఒక చిన్న సవరణ : "ఎత్తు" అంటే రెండున్నర కిలోలు. మీరు మూడు కిలోలు అని రాసిన్రు.

మీకు ఎప్పుడైనా టైము ఉంటె నా రాతలు కూడా సూడున్రి. గమ్మత్తు లెక్కలు ఉంటై. http://telugupilladu.blogspot.com/